ప్రకృతిపై ప్రభుత్వానికి పట్టింపు లేదా? | Dr Donthi Narasimha Reddy Article on Scrapping Telangana Govt 110 GO | Sakshi
Sakshi News home page

ప్రకృతిపై ప్రభుత్వానికి పట్టింపు లేదా?

Published Fri, Apr 29 2022 12:52 AM | Last Updated on Fri, Apr 29 2022 12:53 AM

Dr Donthi Narasimha Reddy Article on Scrapping Telangana Govt 110 GO - Sakshi

హైదరాబాద్‌ జీవనంలో అతి ముఖ్యమైన నీటి వనరుల నిర్వహణలో ఆధునిక ప్రభుత్వాలు తలా తోక లేని విధానాలతో భవిష్యత్తుని అగమ్య గోచరం చేస్తున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చే జంట జలాశయాలు హిమాయత్‌ సాగర్, ఉస్మాన్‌ సాగర్‌ ఇప్పుడు హుస్సేన్‌ సాగర్‌ దుఃస్థితి దిశగా పయనిస్తు న్నాయి. ప్రకృతితో కూడిన ప్రజా సంక్షేమ పాలన చేయకుండా ప్రకృతి వనరులను కైంకర్యం చేసుకుని, వ్యక్తిగత సంపద సృష్టించుకుంటున్నారు. జీవో 111 రద్దు చెరువులే అస్తిత్వంగా కలిగిన తెలంగాణా సంస్కృతి మీద దాడి. గొలుసు కట్టు చెరువుల ద్వారా తక్కువ ఖర్చుతో దాహార్తిని తీర్చే అవకాశం ఉండగా, ఈ వ్యవస్థను నాశనం చేస్తూ, గోదావరి నుంచి నీళ్ళు తెస్తున్నాం అనే కలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నది.


1985కి పూర్వం చెరువులు, కుంటలు నగర నివాసితుల నీటి అవసరాలను తీర్చేవి. 400 యేండ్ల క్రితం తవ్విన హుస్సేనసాగర్‌ చెరువు ఒక 30 ఏళ్ళ కాలంలో క్రమంగా విషపూరితం అయిపొయింది. 1990 తరువాత అసలు ఆ నీటిని ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందూ, తరువాతా కూడా ప్రభుత్వాలు ఈ చెరువు పరిస్థి తిని మెరుగుపరచడంలో విఫలం అయ్యాయి. తాగు నీటికి కాకున్నా ఇతర అవసరాలకు వినియోగించే స్థాయికి కూడా తీసుకురాలేక పోవడం సాంకేతిక పరిమితులతో పాటు పరిపాలనా లోపం స్పష్టంగా కనపడుతున్నది. నగరం నడి బొడ్డున కాలుష్య జలాలతో నిండి ఉన్న చెరువుతో జీవించక తప్పని దుస్థితి తెలంగాణా ప్రజలకు వచ్చింది. ప్రకృతి వనరుల నాశనం వల్ల విపరీతంగా నష్టపోయేది సామాన్య ప్రజలే. 

1908లో మూసి నదికి వరదలు వచ్చి హైదరాబాద్‌ అతలా కుతలం అయ్యింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. వరదలను నివారించటానికి అప్పటి నిజాం ప్రభుత్వం మూసీ నది ఏర్పడక ముందు ఉన్న రెండు పాయల మీద రెండు చెరువులను నిర్మించింది. మూíసీ నది మీద నిర్మించిన ఉస్మాన్‌ సాగర్‌ చెరువు 1920లో పూర్తయింది. ఇది తరువాత గండిపేట్‌గా ప్రసిద్ధి చెందింది. పైన అనంతగిరి గుట్టల నుంచి జాలువారే ఈ నీళ్ళు గండిపేట్‌ నీళ్ళుగా ప్రాచుర్యం పొందాయి. ఇవి రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచివి అని నానుడి ఏర్పడింది. ప్రత్యేకంగా, తమ ప్రాంతంలో కలుషిత నీటితో సతమతమయ్యే ఆంధ్ర ప్రాంత ప్రజలు ఈ నీటి ప్రాశస్త్యాన్ని గుర్తించారు. వలసలు ఈ ప్రాంతానికి ఆ కారణంగా కూడా జరిగి నాయి. ఈసా నది మీద కట్టిన హిమాయత్‌ సాగర్‌ చెరువు 1927లో పూర్తయింది.

ఈ రెండు చెరువులు కట్టిన ప్రాథమిక ఉద్దేశం హైదరాబాద్‌ నగరాన్ని వరద నుంచి కాపాడటానికే. మంచి నీటిని అందించటం కూడా ఈ ప్రణాళికలో భాగమే. ఈ చెరువులు కలుషితం కాకుండా వీటి పరివాహక ప్రాంతంలో అప్పట్లోనే నిజాం ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. వీటి పరివాహక ప్రాంతంలో ఉన్న ఊర్లకు ఇవి వర్తింప జేశారు. అయితే ఆ పరిమితుల మీదా, వాటి ప్రభావం మీదా పూర్తి స్థాయి సమాచారం ఎక్కడా చరిత్రలో కనపడదు. హుస్సేన్‌ సాగర్‌ కలుషితం అయిన నేపథ్యంలో, ఈ జంట జలాశయాలు కూడా కలుషితం కావద్దనే ఉద్దేశంతో 1989లో ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది (జీవో 50. జనవరి 28. 1989). ఈ ఉత్తర్వు, ఈ జంట జలాశయాల నీటి పరివాహక ప్రాంతం మొత్తాన్నీ పరిరక్షించాలని నిర్దేశించింది. ప్రస్తుతం, ఈ ఉత్తర్వు పూర్తి ప్రతి అందుబాటులో లేదు. కానీ, దాని ప్రస్తావన తదుపరి ఉత్తర్వులలో ఉంది. దీనిలో ఉన్న అంశాల మీద అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో 1993లో ఒక సాంకేతిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన మొదటి నివేదిక ఆధారంగా 1994లో ఈ చెరువుల పరిరక్షణకూ, నీటి నాణ్యత రక్షణకూ ఇంకొక ఉత్తర్వు జారీ అయ్యింది (జీవో 192. మార్చ్‌ 31, 1994). ఈ కమిటీ ఇచ్చిన రెండవ నివేదిక ఆధారంగా 1996 మార్చ్‌ 8న ఇంకో కొత్త జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. అది 111 జీవోగా ప్రాచుర్యం పొందింది.

ఈ ఉత్తర్వులో పరివాహక ప్రాంతంలో 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాలలో కొత్త నిర్మాణాల మీద పరిమితులు విధించారు. పరిశ్రమల ఏర్పాటుని పూర్తిగా నిషేధించారు. వాణిజ్య భవనాల నిర్మాణం వద్దన్నారు. ఇండ్ల నిర్మాణం మీద, కొత్త లేఅవుట్ల మీద ఆంక్షలు పెట్టారు. మంచి నీటి చెరువులకు చేటు తెచ్చే కాలుష్య కార్యకలాపాలు నిర్దేశించే విధంగా ఈ ఉత్తర్వులు రూపొందించారు. ఈ ఉత్తర్వు ఒక విధంగా 314 చదరపు కిలోమీటర్లకు మాస్టర్‌ ప్లాన్‌ వంటిది. కొంత జోన్ల గురించి ప్రస్తావన ఉన్నా, పూర్తిగా జోనల్‌ విధానం లేదు. గ్రామకంఠంలో ఆంక్షలు లేవు. కాకపోతే, అంతస్తుల మీద పరిమితులు ఉన్నాయి. ‘ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌’ కూడా నిర్వ చించారు. ఈ ఉత్తర్వు జారీ చేసిన రెండు నెలలలోనే ప్రభుత్వమే ఉల్లంఘనలకు నాంది పలికింది. ఒక పరిశోధన ల్యాబ్‌కు అనుమతిచ్చారు. అప్పట్లో ఇది ఎవరికీ తెలవదు. ఆ సంస్థ భవన నిర్మాణం 2002లో హిమాయత్‌ నగర్‌ గ్రామం దగ్గర మొదలు పెడితే తెలిసింది. ఇంకొక ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చారు. దాని మీద సుప్రీం కోర్టులో హోరాహోరీ పోరాటం జరిగింది. ఆఖరున సుప్రీం కోర్టు అన్ని కాలుష్య కార్యకలాపాలు నిలిపి వేయాల్సిందే అని 2000 సంవత్సరంలో తీర్పు ఇచ్చింది. హైదరాబాద్‌ విమానాశ్రయం కూడా ఈ ఉత్తర్వు పరిధిలోకి వస్తుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పడిన ఈ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు ప్రభుత్వం ధారాదత్తం చేస్తే, అందులో 2 వేల ఎకరాలు 111 జీవో పరిధిలోకి వస్తుంది అని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో వ్యాజ్యం వేస్తే, అనేక వాదనల తరువాత ఈ వ్యాజ్యం కొట్టివేశారు. అంతకు ముందే, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ డెవెలప్‌మెంట్‌  అథారిటీ పేరిట ఆ ప్రాంతంలో జోనల్‌ నిబంధనలు తీసుకొచ్చారు. ఈ అథారిటీ పరిధిలో దాదాపు 1,700 ఎకరాలను బయో కన్జర్వేషన్‌ జోన్‌గా గుర్తించి (జీవో 111 పరిధిలో) నిర్మాణాల మీద పరిమితులు విధించారు.

అయినా ఈ రెండు చెరువుల పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఆగలేదు.  2007లో ఈ విషయమై సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు అయ్యింది. అంతకుముందే 2005లో (జీవో 952. నవంబర్‌ 25, 2005) ప్రభుత్వం ‘ఈపీటీఆర్‌ఐ’, ‘ఏపీïపీసీబీ’లతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా రెండు చెరువుల కట్ట దాటి కూడా కొన్ని ఆంక్షలు విధించారు. ఆ మేరకు చెరువుల కట్ట కింద పారే మంచి నీటి కాలువలను సంరక్షించాలని ఇంకా కొన్ని అదనపు ఆంక్షలు చేరాయి. దాంతో ఇంకొక 86 గ్రామాలు దీని పరిధిలోకి వచ్చాయి. జీవో 111 కొనసాగించాలని సుప్రీం కోర్టు పునరుద్ఘాటించింది.

2015లో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఎదుట జీవో 111ను సవాలు చేస్తూ, అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నయంటూ వ్యాజ్యాలు వచ్చాయి. తెలంగాణా ప్రభుత్వం 2016లో (జీవో 839. డిసెంబర్‌ 7, 2016) ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, ఈ కమిటీ నిర్ణయం మేరకు తమ వాదన, నిర్ణయం ఉంటుందని కోర్టుకు తెలిపింది. కాగా ఆ కమిటీ 2019 వరకు నివేదిక ఇవ్వకపోవడం, ప్రభుత్వం స్పందించకపోవటంతో ఎన్జీటీ 111 జీవో కొనసాగింపు ఉంటుందని తీర్పు ఇచ్చింది.

ధనికులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ఇక్కడ వందల ఎకరాలు కొనుక్కుని ఫార్మ్‌హౌస్‌లు కట్టుకుని, నిర్మాణాల మీద ఉన్న ఆంక్షలను తుంగలో తొక్కారు. వీరిని నియంత్రించని ప్రభుత్వం చిన్న చితక కుటుంబాల మీద తన ప్రతాపం ఇప్పటికీ చూపెడుతోంది. వారి నిర్మాణాలకు ఎటువంటి ఆంక్ష లేకున్నా వారిని ఇబ్బంది పాలు జేస్తూ, పలుకుబడి ఉన్నవారు ఏమి చేసినా పట్టించుకోకపోవటం అలవా టైంది. ఈ విషయంగా జీవో 111 పట్ల అపోహలు పెంచారు. దీన్ని చూపెట్టి చిన్న, సన్నకారు రైతుల నుంచి భూమి బదలాయింపు చేసుకోవడం, అసైన్డ్‌ భూములను కబ్జా చేసుకోవడం మొదలైంది. ప్రశ్నించిన వారికి 111 బూచి చూపెట్టడంతో దాని పట్ల వ్యతిరేకత వచ్చింది. మీడియాలో కూడా అసందర్భ వ్యాఖ్యలతో అది ఇంకా పెరిగింది.


తెరాస అధ్యక్షుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, 2014 చేవెళ్ళ ఎన్నికల బహిరంగ సభలో 111 జీవో ఎత్తివేతకు హామీ ఇస్తూ, ఎకరాకు రూ.20 లక్షల ధర కూడా ఇప్పిస్తానని ఒక విచిత్రమైన వాగ్దానం చేయడం ఆశ్చర్యపరిచింది. తరువాత కూడా చేవెళ్ళ, ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా దాన్ని ఎత్తివేస్తామని ప్రకటన చేస్తూనే ఉన్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తరువాత కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఈ జీవో పట్ల వ్యతిరేక భావం పెంచి పోషిస్తున్న పరిస్థితి! 2022 మార్చి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో చివరిరోజు ముఖ్యమంత్రి ఈ రెండు చెరువుల కాలం చెల్లిపోయింది కాబట్టి జీవో 111 ఎత్తివేస్తామని ప్రకటించారు. అయితే ఈ 111 ఎత్తివేత వల్ల 1,32,600 ఎకరాల ఆంక్షలు తొలిగిపోయి మార్కెట్లోకి వస్తాయి; దాని వలన రియల్‌ ఎస్టేట్‌ పరిస్థితి గందరగోళంగా మారు తుంది కాబట్టి ఒక నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.


తదుపరి, ఈ హామీని కూడా తుంగలో తొక్కుతూ ఏప్రిల్‌ మొదటి వారంలో మంత్రివర్గ సమావేశంలో జీవో 111 ఎత్తివేతకు తీర్మానం ఆమోదం పొందింది అని ముఖ్యమంత్రి పత్రికా సమావేశంలో ప్రకటించారు. నిపుణుల కమిటీ వేయకుండా, కమిటీ నివేదిక లేకుండానే తెలంగాణా మంత్రివర్గం జీవో ఎత్తివేతకు ఆమోదం తెలపడం విస్మయం కలిగించింది. అంత తొందరపాటు దేనికోసం అనే ప్రశ్న వచ్చింది. శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన తరువాత చాలామంది నిపుణుల కమిటీ మీద ఆశలు పెట్టుకున్నారు. నిపుణుల కమిటీ ప్రజలతో సంప్రదింపులు చేయాలనీ డిమాండ్‌ చేశారు. ఆ ఆశలను తుంచివేస్తూ ఆకస్మికంగా ఏప్రిల్‌ 19న 111 జీవోను రద్దు చేస్తూ, 69 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దీని మీద ఉన్న తేదీ మాత్రం ఏప్రిల్‌ 12ది. వారం రోజుల ముందు జీవో వచ్చింది; లేదా, జీవోకి బ్యాక్‌ డేట్‌ ఇచ్చారు. కోట్ల రూపాయల రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల నేపథ్యంలో ఈ వారం రోజుల ఆలస్యం అనుమానాలను రేకెత్తిస్తుంది. గందరగోళం ఏర్పడుతుంది అని స్వయంగా ముఖ్యమంత్రి జాగ్రత్త చెప్పి, నిపుణుల కమిటీ లేకుండా, శాస్త్రీయ నివేదిక మంత్రిమండలి ముందు పెట్టకుండా, వారం రోజులు ఆలస్యంగా ప్రజల ముందుకు కొత్త జీవో తేవడం వంటి చర్యల వల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడింది. విచారణ చేస్తే వాస్తవాలు తెలుస్తాయి.


తెలంగాణా రాష్ట్రం కొరకు జరిగిన ఉద్యమంలో అనేక అన్యా యాల ప్రస్తావన వచ్చింది. అందులో ఒకటి: హైదరాబాద్‌ నగరంలో స్థానికుల, మూలవాసుల నుంచి వలసదారులు ఏ విధంగా ప్రభు త్వాలను, అధికారులను అడ్డు పెట్టుకుని దోచుకున్నారనేది. తెలం గాణా రాష్ట్రంలో చెరువులను కాపాడుకోవాలనీ, హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో తెలంగాణా మూలవాసుల భాగస్వామ్యం పెంచాలనీ, తెలంగాణా భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించుకోవాలనీ ఆనాటి ఉద్యమం ఆకాంక్షించింది. తెలంగాణ అస్తిత్వం చెరువుల చుట్టూ ఉంది; ఇంకుడు గుంతలు కాదు, చెరువుల మీద ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలని ఉద్యమకారులు డిమాండ్‌ చేశారు. ఆధునిక అభివృద్ధి పేరిట జరుగుతున్న వనరుల దోపిడీని ప్రశ్నించడం మలి దశ తెలంగాణా ఉద్యమం కంటే ముందే పుట్టింది.


జీవో 111 రద్దును తెలంగాణా సంçస్కృతి మీద దాడిగా భావించవచ్చు. తెలంగాణకు నీటి నిర్వహణలో ఎవరూ పాఠాలు చెప్పే పని లేదు. గొలుసు కట్టు చెరువుల ద్వారా హైదరాబాద్‌ వంటి మహా నగర దాహార్తిని తక్కువ ఖర్చుతో తీర్చే అవకాశం ఉండగా, తెలంగాణా ప్రభుత్వం ఈ వ్యవస్థను నాశనం చేస్తూ, గోదావరి నుంచి నీళ్ళు తెస్తున్నాం అనే కలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నది. ఈ విపరీత అప్రజాస్వామిక, ప్రకృతి వ్యతిరేక చర్య వల్ల తెలంగాణా సాంస్కృతిక వారసత్వ సంపద మీద, భవిష్యత్తు తరాల నీటి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ రెండు చెరువుల వినాశనం తెలంగాణకే చేటు చేస్తుంది.


వ్యాసకర్త: డాక్టర్‌ దొంతి నరసింహారెడ్డి 
విధాన విశ్లేషకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement