ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే రూపొందించినట్లున్నా... వ్యవసాయానికి మాత్రం అన్యాయం జరిగింది. ఒకపక్క 2022–23 ఆర్థిక సర్వే వ్యవసాయ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరం అని పేర్కొన్నా... బడ్జెట్‌లో మాత్రం పాత కేటాయింపుల కన్నా తక్కువ నిధులు కేటాయించడం గమనార్హం. ఈ రంగానికి 2022–23లో రూ. 1.24 లక్షల కోట్లు కేటాయించగా... 2023–24కు గానూ రూ. 1.15 లక్షల కోట్లకు కేటాయింపులు తగ్గించారు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రైతు సగటు ఆదాయం దారుణంగా రూ.7 వేలకు మిం^è డం లేదు. కానీ వ్యవసాయ అభివృద్ధి బాగా ఉందనీ, ఆహార ఉత్పత్తి పెరుగు
తోందనీ ప్రకటించిన ప్రభుత్వం... రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ ప్రస్తావించలేదు.
భారత వ్యవసాయం మంచి పనితీరును కనబరిచిందనీ, అయితే భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతికూల ప్రభావాలూ, పెరుగుతున్న పంట ఖర్చులూ వంటి కొన్ని సవాళ్ల నేపథ్యంలో ఈ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమనీ జనవరి 31న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2022–23 ఆర్థిక సర్వే తెలిపింది. ఇదే ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం 2020–21లో వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడులు 9.3 శాతానికి పెరిగాయి. వ్యవసాయ రంగానికి సంస్థాగత రుణాలు 2021–22లో రూ. 18.6 లక్షల కోట్లకు పెరిగాయి. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్థిరమైన పెరుగుదల వల్ల 2021–22 లో 315.7 మిలియన్ టన్నులకు ఉత్పత్తి చేరింది.
2021–22 నాలుగో ముందస్తు అంచనాల ప్రకారం ఆహార ధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి ఏటేటా పెరుగుతోంది. పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గత ఐదేళ్లలో సగటున 23.8 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా ఉంది. మారుతున్న వాతావరణం... వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపు తోందని చెప్పిన నివేదిక ఆహార ఉత్పత్తి పెరిగిందనీ చెబుతోంది. కానీ రైతుల పరిస్థితి మీద అంచనా మాత్రం వేయలేదు. రైతుల ఆత్మహత్యలు పెరుగు తున్నాయి. రైతు సగటు ఆదాయం చాలా దారుణంగా రూ.7 వేలు మించని వైనం ప్రస్తావించలేదు.
వ్యవసాయానికి ఒక కొత్త దారి అవసరమని ఆర్థిక సర్వే చెప్పినా, బడ్జెట్‌లో ఆ దిశగా ఆలోచన చేయలేదు. వ్యవసాయానికి కేటాయింపులను తగ్గించారు. 2022–23లో రూ. 1,24,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ కేటాయింపులు 2023– 24కి వచ్చేటప్పటికి రూ. 1,15,531.79 కోట్లకు తగ్గించారు. పశుగణాభివృద్ధికీ, మత్స్య రంగానికీ కలిపి రూ. 6,576.62 కోట్లు కేటాయించారు. పోయిన సంవత్సరం ఈ రంగాలకు ఇచ్చింది రూ. 5,956.70 కోట్లు. వ్యవసాయ పరిశో ధనలకు రూ. 9,504 కోట్లు కేటాయించారు. గతేడాది ఇచ్చింది రూ. 8,513.62 కోట్లు. మొత్తం మీద వ్యవసాయ రంగానికి గతేడాది కన్నా రూ. 8,468.21 కోట్లు – దాదాపు 7 శాతం తగ్గించారన్నమాట. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ప్రధాన మంత్రి పంటల బీమా పథకానికి 13 శాతం కోత విధించింది. ఈసారి ఇచ్చింది కేవలం రూ. 13,625 కోట్లు మాత్రమే.
ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారిన పడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకాన్ని ఇంకా విస్తృతం చేయాల్సి ఉండగా తగ్గించడం శోచనీయం. ప్రధాన మంత్రి రైతులకు అందిస్తున్న రూ. 2 వేల నగదు సహాయం వల్ల రైతులకు నగదు సమస్య తీరిందనీ, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు వారి రోజువారీ వినియోగం, విద్య, ఆరోగ్యం ఇతర యాదృచ్ఛిక ఖర్చులను తీర్చడానికి సహాయపడిందనీ సర్వే తెలిపింది. ఏడాదికి కేవలం రూ. 2 వేలతో రైతుల సమస్య తీర్చిన ఈ గొప్ప పథకానికి బడ్జెట్లో కేటాయింపులు మాత్రం పెరగలేదు. పైగా తగ్గాయి. మొత్తంగా రూ. 8 వేల కోట్లు తగ్గించారు.
పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, చేపల పెంపకంపై దృష్టి సారించి వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11 శాతం (రూ. 20 లక్షల కోట్ల) పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యం రూ. 18 లక్షల కోట్లు. ఇది లక్ష్యం మాత్రమే. రైతులకు బ్యాంకుల నుంచి, సంస్థాగత రుణాలు పలు కారణాల వల్ల అందడం లేదు. ప్రతి ఏటా ప్రకటించే రుణాల లక్ష్యం ఏ మేరకు సఫలం అయ్యిందీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పదు. రూ. 2,200 కోట్ల వ్యయంతో అధిక విలువ కలిగిన ఉద్యాన పంటలకు వ్యాధి రహిత, నాణ్యమైన మొక్కల లభ్యతను పెంచడానికి ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ కొత్త పథకానికి ప్రత్యేక కేటాయింపులు మాత్రం లేవు. కృషి ఉన్నతి కార్యక్రమంలో భాగంగా ఖర్చు పెట్టవచ్చు.
మత్స్యకారులూ, చేపల వ్యాపారులూ... సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికీ, మత్స్య ఉత్పత్తుల సరఫరా సామర్థ్యాలను మెరుగుపరచడానికీ, మార్కెట్ విస్తరించడానికీ ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ కొత్త ఉప పథకాన్ని రూ. 6,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో చెప్పారు. కాని మత్స్య శాఖ కేటాయింపులు మొత్తం రూ. 2,250 కోట్లు దాటలేదు. ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ పథకానికి ఇచ్చిన కేటాయింపు కేవలం రూ. 2,025 కోట్లు మాత్రమే. తరువాత పెంచుతారా అనే విషయంలో స్పష్టత లేదు.
వ్యవసాయ రుణాలపై ఉండే 9 శాతం వడ్డీకి, 2 శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కేటాయించింది రూ. 23 వేల కోట్లు. పోయిన ఏడాది సవరణ ద్వారా ఈ పథకానికి ఇచ్చింది రూ. 22 వేల కోట్లు – పెంచింది కేవలం 4.5 శాతం మాత్రమే. ఈ పథకం ద్వారా ఎంత మంది రైతులు లబ్ధి పొందు తున్నారు? బ్యాంకు రుణాలు తీసుకున్న ప్రతి రైతుకూ ఈ వడ్డీ రాయితీ అందడం లేదు. వడ్డీ రాయితీ నేరుగా రైతులకు కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రుణదాతలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు తమ నిధుల వినియోగంపై వడ్డీ రాయితీ... ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల రీఫైనాన్సింగ్ కోసం నాబార్డ్‌కు ఇస్తారు.
ఇదివరకు, 3 శాతం వడ్డీ రాయితీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 3 శాతం ఇచ్చేది. ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇవ్వడం లేదు. రైతు మీద వడ్డీ భారం 7 నుంచి 9 వరకు ఉంటుందని మనకు అర్థమవుతోంది. స్పష్టంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేయ లేదు. రుణ వ్యవస్థలో చిన్న, సన్నకారు రైతుల సంఖ్యను పెంచడానికీ, పూచీకత్తు లేని వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 1.6 లక్షలకు పెంచాలనీ రిజర్వ్ బ్యాంకు నిర్ణయించిందనే ప్రకటన చూశాం. దీనికీ బడ్జెట్ కేటాయింపులకూ సంబంధం లేదు. వ్యవసాయ అభివృద్ధి బాగా ఉందనీ, ఆహార ఉత్పత్తి పెరుగుతోందనీ ప్రకటించిన ప్రభుత్వం... రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ, ఈ మధ్య కాలంలో రైతులు ఎదుర్కుంటున్న ఆర్థిక నష్టాల గురించీ అటు ఆర్థిక సర్వేలో, ఇటు కేంద్ర బడ్జెట్‌లోనూ ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం, వారి సమస్య పరిష్కారానికి తగిన విధంగా స్పందించక పోవడం వ్యవసాయ ఆధారిత సమాజంలో పెను విషాదం.
డా. దొంతి నరసింహారెడ్డి
వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment