అన్ని పథకాల కంటే చేనేత రంగానికి కేటాయింపులను దారుణంగా తగ్గించేశారు. పెరిగిన ఉత్పత్తి ధరలు, అసమంజస పోటీ, ప్రత్యర్థి రంగాలకు సబ్సిడీ ఇవ్వడం వంటి పరిణామాలతో చేనేతరంగం గిడసబారిపోతోంది.
తాజా బడ్జెట్ చేనేత పరిశ్రమపై శీతకన్ను వేసినట్లే చెప్పాలి. చేనేత రంగానికి గత సంవత్సరం రూ. 604 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌లో కేవలం రూ. 386.09 కోట్లు కేటాయించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో కుదేలైన చేనేత రంగంపై దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది. గత వందేళ్లలో చేనేత రంగానికి ఇంత తక్కువ ఎన్నడూ కేటాయించలేదు. భారీ నష్టాలు, పెరిగిన అప్పులతో సతమతమవుతున్న చేనేత కార్మికులు, ఈ ఏటి బడ్జెట్‌లో అయినా ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగిస్తుందని, ప్రత్యక్ష నగదు బదిలీతో ప్రోత్సహిస్తుందని పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి.
చూస్తుంటే ప్రభుత్వానికి ఆలోచనలే కరువై చేష్టలుడిగినట్లు కనిపిస్తోంది. అన్ని పథకాల కంటే చేనేత రంగానికి కేటాయింపులను దారుణంగా తగ్గించేశారు. పెరిగిన ఉత్పత్తి ధరలు, అసమంజసమైన పోటీ, ప్రత్యర్థి రంగాలకు సబ్సిడీ ఇవ్వడం వంటి పరిణామాలతో చేనేతరంగం గిడసబారిపోతోంది. నూలు సరఫరా స్కీం కేటాయింపుల్లో భారీ కోతలు తమ ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. పట్టు, పత్తి, నూలు, ఇతర సహజ ఫైబర్‌కి సంబంధించిన ముడి çసరుకు ధర పెరిగిపోవడంతో చేనేత రంగం నిత్యం ప్రకంపనలకు గురవుతూనే ఉంది.బీజేపీ ఎన్నికల ప్రణాళికల్లో, ఎన్నికల ప్రసంగాల్లో సమీకృత అభివృద్ధి గురించి వాగ్దానం చేసింది. కానీ జైట్లీ బడ్జెట్ ఈ అభివృద్ధిలో చేనేత కార్మికులను భాగం చేయలేదు.
చేనేతరంగాన్ని పైకి తీసుకురావడానికి కనీస ప్రతిపాదనలు కూడా పొందుపర్చలేదు. 14 శాతం నుంచి 60 శాతం వడ్డీ రేట్లు చెల్లిస్తున్న తమకు తక్కువ వడ్డీతో అప్పు ఇప్పించాలని చేనేత కార్మికులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. పైగా, చేనేత ఉత్పత్తికి సంబంధించి అతి ముఖ్యమైన భాగం పెట్టుబడి. సాంప్రదాయిక వనరుల నుంచి చేనేతకు పెట్టుబడులు తరిగిపోతున్నాయి. చేనేత రంగానికి అంతో ఇంతో పెట్టుబడులు అందించేదిగా పేరుపడిన నాబార్డ్ చాలా వరకు ఆ బాధ్యతను తగ్గించుకుంది. దీని ఫలితంగా అధిక ఖర్చు భారాన్ని మోపే ప్రైవేట్ వనరుల వైపు మళ్లవలసి వస్తోంది. అధిక వడ్డీ రేట్లు, జాగరూకత లేమి, దోపిడీ పరిస్థితులు చేనేత కార్మికుల కష్టాలను మరింతగా పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో రుణమాఫీ చేనేతకు జీవగర్ర లాంటిది. కానీ ఈ విషయంలో కేంద్రం స్పందన రానురానూ తగ్గిపోతున్నట్లు స్పష్టమవుతూనే ఉంది. 2013–14 బడ్జెట్‌లో రూ. 157 కోట్ల స్వల్పమొత్తాన్ని కేటాయించిన ప్రభుత్వం 2016–17 నాటికి చేనేత కార్మికుల వెతలను విస్మరించేసింది.
- డా‘‘దొంతి నరసింహారెడ్డి
వ్యాసకర్త స్వతంత్ర జౌళి విధాన నిపుణులు
ఈ–మెయిల్ : nreddy.donthi16@gmail.com
Comments
Please login to add a commentAdd a comment