ఈనెల 3న కేంద్ర ప్రభుత్వం ఒకేరోజు మూడు ఆర్డినెన్సుల్ని ఆమోదించింది. రైతులకు మేలు చేసే, వ్యవసాయ రంగ రూపు మార్చే చారిత్రక ఆర్డినెన్సులుగా వీటిని పేర్కొన్నారు. మూడింట్లో ఒకటైన నిత్యావసర సరుకుల చట్టం సవరణ ఆర్డినెన్స్ అన్ని వ్యవసాయ సంబంధ ఉత్పత్తులను నిత్యావసర సరుకుల జాబితా నుంచి తొలగిస్తుంది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఏ వ్యవసాయ ఉత్పత్తినైనా అత్యవసరమైనదిగా పేర్కొనే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగివుంటుంది. అయితే, వ్యవసాయరంగంలో పెట్టుబడిదారులను నిరుత్సాహపరచకుండా, ఎగుమతిదారుల నిల్వల పరిమితిని దీన్నుంచి మినహాయించినట్టు తెలిపింది. ఉత్పత్తి, నిల్వల, రవాణా, పంపిణీలపై స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగంలోకి ప్రైవేటు రంగాన్నీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనూ పెద్దస్థాయిలో ఆకర్షించవచ్చనీ; భావిస్తోంది ప్రభుత్వం. ఈ ఎస్మా ఆర్డినెన్స్ వల్ల ధరలు స్థిరీకరించబడి, వ్యాపారులు, వినియోగదారులకు మేలు కలుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇది ప్రాథమికంగా వ్యాపారులకు మేలు చేసేదే.
ఇక రెండవదైన, వ్యవసాయ రంగ ఉత్పత్తుల అమ్మకం, వాణిజ్యం ఆర్డినెన్స్ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చట్టాలు సూచించిన భౌతిక ఆవరణల బయట రాష్ట్ర అంతర్గత, అంతర్రాష్ట్ర వాణిజ్యంలో ఉన్న ఆటంకాలను తొలగించడానికి ఉద్దేశించినది. దేశంలో విస్తారంగా క్రమబద్ధీకరించిన వ్యవసాయ మార్కెట్లను తెరిచే దిశగా ఇదొక చారిత్రక అడుగుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఇది ప్రాథమికంగా ‘మార్కెట్ ఆవరణల’ బయట వాణిజ్య అవకాశాలను సృష్టించడానికి ఉద్దేశించినది.
ఇక మూడోది, ‘ద ఫార్మర్స్ (ఎంపవర్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ ఆర్డినెన్స్, 2020’. ఇది రైతులతో ఒప్పందాలు చేసుకునే ఏ థర్డ్ పార్టీకైనా ఒక జాతీయ ఫ్రేమ్‌వర్క్ సమకూర్చడం కోసం ఉద్దేశించింది. అంటే, కాంట్రాక్టు వ్యవసాయానికి చట్టబద్ధతను కల్పించడం. ఈ మూడు ఆర్డినెన్సులూ రైతులకు లబ్ధి చేకూర్చేవిగా ప్రభుత్వం చిత్రిస్తున్నప్పటికీ, ఇందులో ఏ ఒక్కటి కూడా రైతులకు మేలు చేయదు. ఇవి వ్యాపారులకు, ప్రత్యేకించి పెద్ద కంపెనీలకు లబ్ధి కలిగిస్తాయి. ఉమ్మడిగా ఈ మూడు అత్యవసరాదేశాలు రాష్ట్ర చట్టాల్నీ, మార్కెట్ కమిటీల్నీ కాదని రాష్ట్రాల అధికారాల్ని బలవంతంగా లాక్కునే లక్ష్యంతో తెచ్చినవి. ప్రణాళిక, నిధుల కేటాయింపు, అమలు తదితరాల్లో కేంద్ర ప్రభుత్వం భాగమైనప్పటికీ వ్యవసాయం ముఖ్యంగా రాష్ట్రాల పరిధిలోని అంశం. దీర్ఘకాలంగా వ్యవసాయ ఉత్పాదక కంపెనీలు, ముఖ్యంగా విత్తనాలు, రసాయన ఎరువుల కంపెనీలు వ్యవసాయ సంబంధ నిర్ణయాల్లో కేంద్రీకరణ ఉండటం తమకు లాభిస్తుందనే యోచనతో ఉన్నాయి.
గత కొన్ని యేళ్లుగా మోడల్ చట్టాల ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ వాణిజ్యంలో సంస్కరణల కోసం పట్టుబడుతోంది. ఈ శాసనాలతో పాటు ఇంకా ఇతరత్రా అన్ని కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీలను, ప్రాంత గుత్తాధిపత్యాలను నీరుగార్చడానికి ఉద్దేశించినవి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత విధానం ‘మార్చి’, ఈ ‘నమూనా’ విధానంలోకి మారడానికి మొగ్గుచూపవు. ఎందుకంటే వాటికి ఆదాయం సమకూర్చే ఆధారంలో కోతపడుతుంది. ఈ త్రిశక్తి ఆర్డినెన్సులు– వ్యవసాయ ఉత్పత్తులు, వాటి మార్కెట్ల మీద రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణనూ సంపూర్ణంగా తొలగించాలని ఆశిస్తున్నాయి. అత్యవసర ఉత్పత్తి అనే ట్యాగ్ తొలగించినప్పటకీ, రాష్ట్రాల మార్కెటింగ్ కమిటీ చట్టాల వల్ల వ్యాపారులు ఇప్పటికీ ఆటంకాలు ఎదుర్కోవచ్చు. అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండబోదని వ్యాపారులు, వ్యవసాయ కంపెనీలకు కేంద్రం విశ్వాసం కలిగించవచ్చు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయం నష్టపోతాయి. వ్యవసాయ ఉత్పత్తుల మీద వాటి ఆధిపత్యం తగ్గిపోతుంది. ఒక్కమాటలో, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడానికి ఏ మాత్రమూ వీలు లేకుండా చేయడంలో ఈ మూడు అత్యవసర ఆదేశాలు విజయం సాధిస్తాయి.
కానీ, వినియోగదారులు(ఈ దేశానికి సంబంధించిన అందరు పౌరులు) ధరలు పెరగడాన్ని చూడాల్సిరావొచ్చు. ‘స్వేచ్ఛా వాతావరణం’లో వ్యవసాయ దిగుమతులు పెరగవచ్చు. ఈ దిగుమతులతో ఉత్పన్నమయ్యే పోటీలో, రైతులు నష్టపోవచ్చు.రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉన్న సందర్భంలో ఇది ఇక అధికార క్రీడ అవనుంది. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. కానీ ఒకటి, ఈ అధికార పోరులో రైతులకు స్థానం లేదు. రైతులు ఎప్పుడూ పరిగణనలో లేరు, ఉండరు. కేంద్రం ఇప్పటికైతే ఈ త్రిశూల్ ద్వారా వ్యాపారులు, పెట్టుబడిదారులు, కంపెనీలు, అమ్మకందారులు అందరికీ సహకరించాలని నిర్ణయించుకుంది. ఇండియాను పారిశ్రామిక వ్యవసాయంలోకి నడిపించాలనుకునే ఈ శక్తిమంతమైన లాబీకి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తలొగ్గుతాయా? బహుశా అవునా కాదా అన్నదానికంటే ఎప్పుడు, ఎలా అనేదే విషయం కావొచ్చు.
నరసింహారెడ్డి దొంతి
– వ్యాసకర్త ఆర్థిక రంగ విశ్లేషకులు
ఫోన్ : 0091–40–24077804
Comments
Please login to add a commentAdd a comment