Matrimonial Fraud: Chittoor Man Arrested - Sakshi
Sakshi News home page

నటుడి ఫొటో తనదిగా చెప్పి వివాహ సంబంధాలు.. 100 మందికిపైగా యువతులను

Published Fri, Feb 18 2022 3:58 AM | Last Updated on Fri, Feb 18 2022 10:55 AM

Matrimony fraudster arrested in Chittoor - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, (ఇన్‌సెట్‌లో) నిందితుడు రెడ్డిప్రసాద్‌

చిత్తూరు అర్బన్‌: అతడు చదువుకుంది ఆర్థికశాస్త్రంలో పోస్ట్రుగాడ్యుయేషన్‌. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద అటెండర్‌ పోస్టు వచ్చింది. చేస్తున్నపని నచ్చలేదు. మానేశాడు. దుర్వ్యసనాల నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించడానికి మార్గాలు అన్వేషించాడు. ఉన్నతాధికారిగా పనిచేస్తున్నట్లు పేర్కొంటూ, నటుడి ఫొటో తనదిగా చెప్పి వివాహ సంబంధాల వెబ్‌సైట్లలో ఉంచాడు. వీటి ఆసరాగా వందమందికిపైగా యువతులను మోసంచేసి దాదాపు రూ.25 లక్షలు కొల్లగొట్టాడు. ఈ మోసాలకు పాల్పడ్డ చిత్తూరుకు చెందిన కరణం రెడ్డిప్రసాద్‌ (42)ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ యుగంధర్‌ ఈ వివరాలను మీడియాకు వివరించారు.  

అరక్కోణంలో స్థిరపడి మోసాలు 
చిత్తూరులోని యాదమరి కాశిరాళ్లకు చెందిన కరణం షణ్ముగం పిళ్‌లై పశుసంవర్ధకశాఖలో పనిచేస్తూ చనిపోవడంతో ఆయన కుమారుడు రెడ్డిప్రసాద్‌కు కారుణ్య నియామకం కింద 2002లో అదే శాఖలో అటెండర్‌గా ఉద్యోగం వచ్చింది. చిత్తూరులోని పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తుండగా 2012లో టైపిస్టుగా ఉద్యోగోన్నతి వచ్చింది. సాంకేతిక విద్యార్హతలు చూపకపోవడంతో 2016లో అటెండర్‌గా రివర్షన్‌ ఇచ్చారు. దీంతో ఉద్యోగం మానేసిన రెడ్డిప్రసాద్‌ వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. భార్య, కుమార్తె అతడి నుంచి వేరుగా ఉంటున్నారు.

మ్యాట్రిమోనీ (వివాహాలను కుదిర్చే ఆన్‌లైన్‌ సంస్థలు) యాప్‌లో కేరళ బుల్లితెర నటుడి ఫొటో పెట్టి చిత్తూరులోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు, నెలకు రూ.2 లక్షల జీతం వస్తున్నట్లు పే–స్లిప్‌లు కూడా అప్‌లోడ్‌ చేశాడు. 2015లో తమిళనాడులోని అరక్కోణంలో స్థిరపడిన రెడ్డిప్రసాద్‌ పలు రాష్ట్రాలకు చెందిన మహిళల్ని ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకుంటూ తనకు స్వచ్ఛంద సేవాసంస్థ ఉందని, వచ్చే జీతంలో సగానికిపైగా దానధర్మాల కోసం ఖర్చుచేస్తున్నానని ఫోన్‌లో చెప్పేవాడు.

పేదలకు సాయం చేసే తన సంస్థకు సాయం చేయాలంటూ పలువురు యువతుల నుంచి డబ్బు వసూలు చేశాడు. కొందరు అనుమానం వచ్చి పశుసంవర్ధకశాఖ డీడీ ప్రభాకర్‌కి ఫోన్‌ చేశారు. తన పేరును మరొకరు దుర్వినియోగం చేస్తున్నారని గ్రహించి ప్రభాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రెడ్డిప్రసాదే ఇదంతా చేస్తున్నట్లు గుర్తించారు.

అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వందమందికిపైగా యువతుల నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు చెప్పాడు. 2019లో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో డాలర్లు తెస్తుంటే కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారని చెప్పి చిత్తూరుకు చెందిన యువతి వద్ద రూ.2.45 లక్షలు కాజేసింది తానేనని అంగీకరించాడు. నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు రూ.50 వేల నగదు సీజ్‌ చేశారు. యువతులు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు మోసపోవడంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకురాలేదు. ఇతడి ద్వారా మోసపోయినవాళ్లు చిత్తూరు పోలీసులను సంప్రదించాలని డీఎస్పీ కోరారు. కేసును ఛేదించడంలో ప్రతిభచూపిన ఎస్‌ఐలు మల్లికార్జున, లోకేష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement