సాక్షి, అమరావతి: దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల్లో యూపీఐ మోసాలే అత్యధికంగా ఉంటున్నాయి. డిజిటలీకరణ పెరుగుతున్న కొద్దీ అధికమవుతున్న ఆర్థిక నేరాల్లో యూపీఐ మోసాలదే అగ్రస్థానం. ‘అనాటమీ ఆఫ్ ఫ్రాడ్స్–2023’ పేరిట కాన్పూర్ ఐఐటీ, డిజిటల్ బ్యూరో కన్సల్టెన్సీ ప్రక్సీస్ సంస్థ విడుదల చేసిన నివేదిక యూపీఐ మోసాల తీవ్రతను వెల్లడించింది.
దేశంలో రోజుకు సగటున 23 వేల డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు పెరుగుతుండటాన్ని సైబర్ ముఠాలు అవకాశంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయని ఆ నివేదిక చెప్పింది. ప్రస్తుతం దేశంలో 90.50 కోట్ల మందిగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు 2027నాటికి 100.14 కోట్లకు చేరతారని అంచనా వేసింది.
2019లో దేశంలో డిజిటల్ చెల్లింపులు 36 శాతం ఉండగా 2023 ఏప్రిల్ నాటికి 57 శాతానికి పెరిగాయి. 2027నాటికి డిజిటల్ చెల్లింపులు 74 శాతానికి చేరుతాయని అంచనా. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు ప్రధానంగా యూపీఐ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తగిన అవగాహన కల్పించాలని పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం..
అప్రమత్తతే రక్షా కవచం
సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తతే రక్షా కవచం. వినియోగదారులు తగిన అవగాహన కలిగి ఉండాలని సీఐడీ ఎస్పీ (సైబర్ క్రైమ్ విభాగం) హర్షవర్ధన్ రాజు చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ఆయన చేసిన సూచనలు ఇవీ...
► డిజిటల్ చెల్లింపులు చేసే డివైజ్‌ల ‘పిన్’ నంబర్ల గోప్యత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పిన్ నంబర్లుగానీ ఓటీపీ నంబర్లుగానీ ఎవరికి తెలియజేయకూడదు. దీర్ఘకాలంగా ఒకే పాస్‌వర్డ్‌ను కొనసాగించకూడదు. పాస్‌వర్డ్‌ను నియమిత కాలంలో మారుస్తూ ఉండాలి.
► ఫేక్ యూపీఐ సోషల్ మీడియా హ్యాండిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చే అన్ని యూపీఐ హ్యాండిల్స్ విశ్వసనీయమైనవి కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ వినియోగదారుల యూపీఐ వివరాలను తెలపాలని ఆర్‌బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోరవు. ఏదైనా ఆర్థిక సంస్థగానీ యాప్‌గానీ యూపీఐ వివరాలను కోరితే ఆ సంస్థ కచి్చతంగా మోసపూరితమైనదని గుర్తించి వెంటనే బ్లాక్ చేయాలి.
► పబ్లిక్ వైఫై, సురక్షితం కాని నెట్‌వర్క్‌ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయకూడదు.
► మొబైల్ ఫోన్లలో ట్రాన్సాక్షన్ అలెర్ట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మీ బ్యాంకు చెల్లింపులకు సంబంధించిన సమాచారం వెంటనే మీకు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలిసే సౌలభ్యం ఉండాలి. మీ అనుమతిలేకుండా ఏదైనా చెల్లింపు జరిగితే వెంటనే గుర్తించి బ్యాంకును సంప్రదించి తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
►సైబర్/యూపీఐ మోసానికి గురయ్యామని గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయించాలి. ఫిర్యాదు చేయాలి. సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్ పోర్టల్ (నంబర్ 1930)కు గానీ ఏపీ సైబర్ మిత్ర (వాట్సాప్ నంబర్ 9121211100 )కుగానీ ఫిర్యాదు చేయాలి.
భద్రతపై బ్యాంకుల దృష్టి
సైబర్ మోసాలు పెరుగుతుండటంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైబర్ భద్రతపై దృష్టిసారించాయి. సైబర్ భద్రత మౌలిక వసతులను పెంచుకునేందుకు నిధులు వెచి్చస్తున్నాయి. దేశంలో 43 ఆర్థిక సంస్థలు సైబర్ భద్రత కోసం నిధుల వెచ్చింపును భారీగా పెంచగా.. 17 శాతం ఆర్థిక సంస్థలు స్వల్పంగా పెంచాయి. కాగా 35 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. 2 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను స్వల్పంగా తగ్గించగా 3 శాతం సంస్థలు బడ్జెట్‌ను భారీగా తగ్గించాయి.
Comments
Please login to add a commentAdd a comment