మోసగాడి చెర నుంచి 22 మందికి విముక్తి  | 22 people released from fraudulent prison in Visakha | Sakshi
Sakshi News home page

మోసగాడి చెర నుంచి 22 మందికి విముక్తి 

Published Sun, Feb 6 2022 4:52 AM | Last Updated on Sun, Feb 6 2022 4:52 AM

22 people released from fraudulent prison in Visakha - Sakshi

నక్కపల్లి/పాయకరావుపేట: విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలో ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్‌ పేరిట సంస్థను నిర్వహిస్తూ యువతీ, యువకుల్ని బందీలుగా మార్చుకున్న మోసగాడి ఆట కట్టింది. అతని చెరలో ఉన్న వారందరికీ విముక్తి కల్పించిన అధికారులు అతడి భవంతికి శనివారం తాళం వేశారు. కొందరు బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది యువతులు, నలుగురు యువకులు అతడి భవంతిలో బందీలుగా ఉన్నట్టు గుర్తించారు. తమ ఇళ్లకు పంపమని కోరిన 8 మందిని శుక్రవారమే ప్రత్యేక వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య వారి స్వస్థలాలకు పంపించారు.

మిగతా 14 మంది తాము భవనం ఖాళీ చేసే ప్రసక్తి లేదని, ఇక్కడే ఉంటామని మొండికేయడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్‌ ఇచ్చి శనివారం వారిని కూడా విశాఖ కేజీహెచ్‌లోని దిశ షెల్టర్‌ హోమ్‌కు తరలించారు. వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వధార్‌ హోమ్‌కు తరలిస్తామని, మరోసారి కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు చెప్పారు. సంస్థ నిర్వాహకుడైన అనిల్‌కుమార్‌ అలియాస్‌ ప్రేమదాసు, అతనికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుల నుంచి కొన్ని ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమదాస్‌కు సహకరించిన రాజేశ్వరి అలియాస్‌ లిల్లీ పరారీలో ఉంది. ఆమె కోసం గాలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement