
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు నానాటికీ రెచ్చిపోతున్నారు. తాము టార్గెట్ చేసిన వారిని ఏదో ఒక రకంగా బురిడీ కొట్టిస్తున్నారు. ఈ వ్యవహారంలో చిన్నారులు ఎదురొచ్చినా తగ్గట్లేదు. ఇలాంటి ఓ ఉదంతమే నగరంలో చోటు చేసుకుంది. బాధితులు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యక్తిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఉద్యోగుల మాదిరిగా మాట్లాడారు. కేవైసీ అప్‌డేట్ పేరుతో ఆయన డెబిట్ కార్డుకు సంబంధించిన వివరాలు సంగ్రహించారు. ఓటీపీల కోసం నేరగాళ్లు కాల్ చేసే సమయానికి ఆయన తన ఫోన్ ఇంట్లో వదిలి బయటకు వెళ్లారు. అదే సమయంలో ఆన్‌లైన్ క్లాస్‌లు వింటోన్న ఆయన కుమార్తె (ఐదో తరగతి విద్యార్థిని) ఆ కాల్ అందుకుంది. ‘అంకుల్ డాడీ లేరు... బయటకు వెళ్లారు..’ అని చెప్పి ఫోన్ పెట్టేయడానికి ప్రయత్నించింది. ఈలోపు సైబర్ నేరగాళ్లు ‘తెలుసమ్మా... ఆ ఫోన్‌కు ఓటీపీలు వస్తాయి చెప్పమ్మా’ అంటూ హిందీలో సంభాషించారు. ఇలా రెండుసార్లు ఆమె నుంచి ఓటీపీలు తీసుకుని బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.32 వేలు కాజేశారు.
బ్యాంకు అధికారుల మాదిరిగానే మూసారాంబాగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కాల్ చేసిన సైబర్‌నేరగాళ్లు రూ.1.15 లక్షలు కాజేశారు. వివిధ కారణాలతో కొన్ని సంస్థల కస్టమర్ కేర్ నెంబర్ల కోసం ప్రయత్నించిన ఇద్దరు నగర వాసులు ఇంటర్‌నెట్‌లో ఉన్న నకిలీ నెంబర్లకు కాల్ చేశారు. అవతలి వారు చెప్పినట్లే చేసి తమ ఖాతాల్లోని రూ.81 వేలు, రూ.96 వేలు పోగొట్టుకున్నారు. మరో ఉదంతంలో ఓఎల్‌ఎక్స్‌లో ఉన్న వాహన విక్రయ ప్రకటన చూసిన నగర వాసి అందులోని నెంబర్లో సంప్రదించాడు. ఆర్మీ అధికారిగా చెప్పుకున్న సైబర్ నేరగాడు అడ్వాన్స్ సహా వివిధ పేర్లతో రూ.4 లక్షలు కాజేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: గసగసాల సాగు వెనుక డ్రగ్ మాఫియా!
Comments
Please login to add a commentAdd a comment