సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు పంథా మార్చుకుంటున్నారు. అబ్బాయిలకు అందమైన యువతులతో మీటింగ్, డేటింగ్ కల్పిస్తామంటూ నమ్మించి లక్షల్లో దండుకునే మోసానికి శ్రీకారం చుట్టారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఫిర్యాదులు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు వస్తున్నాయి. ఫిమేల్ ఎస్కాట్ సర్వీస్ పేరుతో చేస్తున్న ఈ మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. లోకాంటో.కామ్, ఇండియా డేట్స్, మింగిల్ తదితర డేటింగ్ సైట్లలో ప్రత్యేక డేటింగ్ ప్యాకేజీ పేరుతో మోసగాళ్లు పోస్టులు చేస్తున్నారు. ఏ ప్రాంతమైనా ఏ సమయమైనా కాల్ గరŠల్స్‌ను పంపిస్తామంటూ...అంతా కస్టమర్ చాయిస్ అంటూ వల విసురుతున్నారు.
అలాగే వివిధ నంబర్లతో మోసగాళ్లు వీడియో కాల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత చాటింగ్ చేస్తున్నారు. కాస్త దగ్గరయ్యాక బాధితులు మాట్లాడిన మాటలతో కూడిన వీడియోను రికార్డు చేస్తున్నారు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి మరీ మరిన్ని డబ్బులు దండుకుంటున్నారు. మరోవైపు అమ్మాయిలు, పెళ్‌లైన యువతులలతో డేటింగ్ చేయిపిస్తామంటూ వారి ఫోన్ నంబర్ కూడా ఇస్తామంటూ బాధితులను నమ్మిస్తున్నారు. ఆ తర్వాత ప్రారంభ చెలింపులు చేయమనడంతో బాధితులు చేస్తున్నారు. ఆ తర్వాత సెక్యూరిటీ ఫీజు, సేఫ్టీ డిపాజిట్ కింద మరిన్ని డబ్బులు లాగుతున్నారు.
మచ్చుకు కేసు ఇలా...
కొన్నిరోజుల క్రితం ఓ బాధితుడి సెల్‌కు క్యూపీ–జెడ్‌ఎక్స్‌సీవీబీఎన్ నుంచి ‘మ్యారీడ్ లేడీస్ నీడ్స్ జిమ్స్ మీటింగ్ అండ్ డేటింగ్...30కే పర్ డేట్. కాల్ టూ సెల్ నంబర్’ అంటూ ఎస్‌ఎంఎస్ వచ్చింది. ఆ నంబర్‌కు బాధితుడు కాల్ చేయగానే ప్రీతి అనే పేరుతో అమ్మాయి మాట్లాడింది. అతని వివరాలు తెలుసుకున్న ఆమె అమ్మాయిను చూపించాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు, ఆ తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫీజు కింద రూ.34,015 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు.ఆ తర్వాత మరొకరు డ్రైవర్‌కు రూ.20,000లు చెల్లించాలనడంతో నో అన్నాడు. అవి చెల్లించకుంటే మిమ్మల్ని చంపుతానంటూ బెదిరించడంతో బాధితుడు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు టెక్నికల్ డాటాతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాదీ హ్యాకర్ కోసం వేట!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని పుణేలో ఉన్న ప్రతిష్టాత్మక దూరవిద్య కేంద్ర సింజయోసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఎస్‌సీడీఎల్) సంస్థకు చెందిన సర్వర్‌ను హ్యాక్ చేసి, 178 మంది విద్యార్థుల మార్కుల్ని ట్యాంపర్ చేసిన స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న హైదరాబాదీ హ్యాకర్ కోసం పుణే సైబర్ క్రైమ్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌లో మరో నిందితుడైన ఆ సంస్థ పరీక్షల నిర్వహణ విభాగం అధిపతి సందీప్ హెంగ్లేను సోమవారం అరెస్టు చేశారు. ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ సేవల్ని అందించే ఎస్‌సీడీఎల్ సంస్థ కొన్ని ప్రత్యేక కేటగిరీలకు చెందిన విద్యార్థులకు అనివార్య పరిస్థితుల్లో గ్రేస్ మార్కులు అందిస్తుంటారు. ఈ మార్కులు పొందే విద్యార్థులు ఆయా పరీక్షలుల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.
ఆ సంస్థకు చెందిన పరీక్షల విభాగాధిపతి కొందరు విద్యార్థులతో కుమ్మక్కయ్యారు. వారికి వచ్చిన మార్కుల్ని పెంచడానికి వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన హ్యాకర్ సహాయంతో సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేయించి 178 మంది విద్యార్థుల మార్కులు ట్యాంపర్ చేయించాడు. 2018 సెప్టెంబర్–2019 డిసెంబర్ మధ్య సాగిన ఈ వ్యవహారంపై ఎస్‌సీడీఎల్ ఫిర్యాదు మేరకు పుణే సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం కేసు నమోదు చేసిన విషయం విదితమే. సాంకేతిక ఆధారాలను బట్టి ఎస్‌సీడీఎల్ సంస్థ పరీక్షల నిర్వహణ విభాగం అధిపతి, హైదరాబాద్ హ్యాకర్ పాత్రలు నిర్థారించారు. వీరి మధ్య జరిగిన కొన్ని వాట్సాప్ చాటింగ్స్‌ను సేకరించారు. సోమవారం పరీక్షల నిర్వహణ విభాగాధిపతి సందీప్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసులో కీలక విషయాలు సంగ్రహించడంతో పాటు హైదరాబాదీ హ్యాకర్‌ను పట్టుకోవడానికి అతడిని కస్టడీలోకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పుణే సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు శనివారం వరకు అనుమతించింది. దీంతో సందీప్‌ను తమ కస్టడీలోకి తీసుకున్న పుణే సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. హైదరాబాదీ హ్యాకర్‌ను పట్టుకోవడానికి ఇతడిని తీసుకుని నగరానికి ఓ ప్రత్యేక బృందాన్ని పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment