పాలీమర్ లిక్విడ్, ప్రీమర్ లిక్విడ్ బాటిళ్లను పరిశీలిస్తున్న సీపీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు తెలివిమీరి పోయారు. క్రెడిట్, డెబిట్ కార్డ్ మోసాలు, ఇన్వెస్ట్‌మెంట్, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్‌లు, ఆన్‌లైన్ సర్వీస్‌లు ఇలా రకరకాలుగా మోసాలు చేస్తున్న వీరు.. తాజాగా వేలిముద్రలతో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయడం మొదలుపెట్టారు. నెల రోజుల్లోనే 2,500 నకిలీ ఫింగర్ ప్రింట్స్ సృష్టించి రూ.40 లక్షల కాజేశారు. రెండున్నరేళ్లుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా కొట్టేసిన సొమ్ము రూ.వందల కోట్లలోనే ఉంటుందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ శింగెనవర్‌తో కలిసి గురువారం వివరాలు వెల్లడించారు.
వెబ్‌సైట్‌లోకి వెళ్లి..
ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన నల్లగల్ల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేశ్‌కు రిజిస్ట్రేషన్, బ్యాంకింగ్ రంగంలో అపారమైన అనుభవం ఉంది. ఈ క్రమంలో తన మకాంను నగరంలోని బీరంగూడకు మార్చాడు. ఆధార్ నంబర్, వేలిముద్రల సహాయంతో బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును ఎలా కాజేయవచ్చో పరిశోధించిన వెంకటేశ్.. నకిలీ గుర్తింపు కార్డ్‌తో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) లైసెన్స్‌ను పొందాడు. ఏఈపీఎస్ సేవలను పొందేందుకు అవసరమైన ఆధార్ నంబర్, ఫింగర్ ప్రింట్స్‌ను పక్క రాష్ట్రానికి చెందిన రిజిస్ట్రేషన్, స్టాంప్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకునేవాడు.
నకిలీ వేలి ముద్రల తయారీ ఇలా..
రిజిస్ట్రేషన్ విభాగం నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న డాక్యుమెంట్లలోని వేలి ముద్రలను ఎక్స్‌ఎల్, వర్డ్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకుని ఫొటో షాప్‌లో వేలిముద్రలు స్పష్టంగా వచ్చేలా డెవలప్ చేసి, దాన్ని బటర్ పేపర్ మీద ప్రింట్ తీసి.. పాలీమర్ లిక్విడ్ పోస్తారు. లిక్విడ్ ఎండిపోవటం కోసం నెయిల్ డ్రయ్యర్ యూవీ లైట్ ల్యాంప్ అనే మిషన్ కింద నకిలీ ముద్రలను ఉంచుతారు. దీంతో నాలుగు నిమిషాల్లో నకిలీ రబ్బర్ వేలిముద్రలు తయారవుతాయి.
నకిలీ గుర్తింపు కార్డ్‌లతో ఏఈపీఎస్ లైసెన్స్..
రాయ్‌నెట్ అనే కంపెనీ బ్యాంక్‌లకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) సేవలను అందిస్తుంది. దీని నుంచి 2019లో కొందరు వ్యక్తులు ఈపాయింట్ ఇండియా పేరుతో ఫ్రాంచైజీ తీసుకున్నారు. బిజినెస్ కరస్పాండెట్లను నియమించుకొని గ్రామాల్లో యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, బ్యాంకింగ్ సేవలను అందించడం వీళ్ల పని. ఈ క్రమంలో వెంకటేశ్ నకిలీ గుర్తింపు కార్డ్‌లను సమర్పించి గత నెల 4న ఏఈపీఎస్ లైసెన్స్ పొందాడు. దీంతో ఇతనికి ఈపాయింట్ ఇండియా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కేటాయించింది. దీని ద్వారా ఎవరైనా సరే యూటిలీటీ బిల్లుల చెల్లింపులు, నగదు డ్రా, బదిలీ వంటి అన్ని రకాల బ్యాంక్ సేవలను వినియోగించుకోవచ్చు.
నగదు ఎలా కొట్టేస్తారంటే..
ఈపాయింట్ ఇండియా యాప్‌లో ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, నకిలీ రబ్బర్ వేలిముద్రను పెడతారు. ఒకవేళ ఆధార్ నంబర్‌కు బ్యాంక్ ఖాతా నమోదై ఉంటే ప్రొసీడింగ్ అని వస్తుంది. లేకపోతే రాదు. ఇలా నిందితులు అన్ని బ్యాంక్‌లను పరిశీలించుకుంటూ పోతారు. ఎప్పుడైతే ప్రొసీడింగ్ అని వస్తుందో ఓకే నొక్కగానే ఆ ఆధార్ నంబర్‌కు లింకై ఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్, పేరు, ఎంత బ్యాలెన్స్ ఉందో అన్ని వివరాలు తెలిసిపోతాయి. వెంటనే ఆ బ్యాంక్ ఖాతా నుంచి నిందితులకు చెందిన అకౌంట్లకు నగదును బదిలీ చేసుకుంటారు. సాధారణంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీ చేయాలంటే ఓటీపీ, డబుల్ అథంటికేషన్ ఉంటుంది. కానీ ఏఈపీఎస్‌లో అలా ఉండదు. ఇదే నిందితులకు వరంగా మారింది.
కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో కేసులు..
ప్రస్తుతానికి ఈ గ్యాంగ్‌పై సైబరాబాద్‌లో రెండు, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లోని ఒక్కో కేసు నమోదయ్యాయి. సైబరాబాద్‌లో 149 బ్యాంక్ ఖాతాల నుంచి రూ.14,64,679 నగదును నిందితులు కాజేశారు. వెంకటేశ్‌తో పాటు అతనికి సహకరించిన మేఘావత్ శంకర్ నాయక్, రత్నం శ్రీనివాస్, దర్శనం సామేలు, చల్లా మణికంఠ, షేక్ ఖాసిం, విశ్వనాథుల అనిల్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.3.4 లక్షల నగదు, ల్యాప్‌టాప్, కారుతో పాటు 2,500 నకిలీ వేలిముద్రలు, 121 సిమ్ కార్డ్‌లు, 20 ఫోన్లు, 13 డెబిట్ కార్డ్‌లు, పాన్ కార్డ్, రెండు ఆధార్ కార్డ్‌లు, 3 రూటర్లు, 4 బయోమెట్రిక్ ఫ్రింగర్ ప్రింట్ స్కానర్లు, 3 పెన్ డ్రైవ్‌లు, 4 కిలోల పాలీమర్ లిక్విడ్, 3 కిలోల ప్రీమర్ లిక్విడ్ బాటిళ్లు, యూవీ నెయిల్ ల్యాంప్, రెండు ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ ప్లేట్స్ ఇతరత్రా వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment