రెండోరోజు మరో కేసు.. భాగస్వామి పేరుతో.. | Cyber Criminals Cheat Another Company With Email | Sakshi
Sakshi News home page

భాగస్వామి పేరుతో బాదేశారు..

Published Sat, Feb 1 2020 8:58 AM | Last Updated on Sat, Feb 1 2020 8:58 AM

Cyber Criminals Cheat Another Company With Email - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు వరుసగా రెండో రోజు అకౌంట్‌ టేకోవర్‌పై మరో ఫిర్యాదు అందింది. బంజారాహిల్స్‌కు చెందిన రిఫ్రిజిరేషన్‌ సంస్థ 15 వేల డాలర్లు (దాదాపు రూ.10.7 లక్షలు) పోగొట్టుకుని గురువారం ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా అన్నట్లు శుక్రవారం వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. తమ వ్యాపార భాగస్వామి పేరుతో ఈ–మెయిల్‌ పంపిన దుండగులు రూ.4.4 లక్షలను వారి ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫ్రాడ్స్‌కు ‘కీ–లాగర్స్‌’ కారణమని భావిస్తున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

భాగస్వామి పేరుతో
వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కొందరు వ్యాపార భాగస్వాములు ఉన్నారు. వీరిలో ఒకరు  గత నెలలో దుబాయ్‌ వెళ్లాడు. అయితే గత నెల 27న సంస్థ అధికారిక మెయిల్‌ ఐడీకి దుబాయ్‌ వెళ్లిన భాగస్వామి పంపినట్లు ఓ ఈ–మెయిల్‌ వచ్చింది. తాను అనుకోకుండా ఓ ఇబ్బందిలో చిక్కుకున్నానని, అర్జంటుగా రూ.4.4 లక్షలు కావాలని అందులో ఉంది. తాను దుబాయ్‌లో ఉన్న నేపథ్యంలో రెగ్యులర్‌ ఖాతాకు కాకుండా ఫలానా ఖాతాకు బదిలీ చేయమంటూ నంబర్‌ ఇచ్చారు. ఈ మెయిల్‌ అందుకున్న సంస్థ ప్రతినిధులు దుబాయ్‌ నుంచి తమ భాగస్వామి పంపినట్లే భావించి రూ.4.4 లక్షలు సదరు ఖాతాలోకి బదిలీ చేశారు. గత నెల 30న నగరంలో ఉంటున్న భాగస్వామికి దుబాయ్‌ వెళ్లిన వ్యక్తి ఫోన్‌ చేయగా, మాటల సందర్భంలో నగదు పంపిన విషయం చర్చకు వచ్చింది. తాను ఆ ఈ–మెయిల్‌ పంపలేదని ఆయన చెప్పడంతో అసలు సంగతి బయటపడింది. దీంతో సంస్థ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సైబర్‌  క్రైమ్‌ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకున్నారు. 

‘కీ–లాగర్స్‌’పై అనుమానం
సైబర్‌ నేరగాళ్లు చేసే అకౌంట్‌ టేకోవర్‌ ఫ్రాడ్స్‌కు మూలం బాధితుల ఈ–మెయిల్‌ అకౌంట్‌గా అధికారులు చెబుతున్నారు. ఆయా సంస్థలకు చెందిన మెయిల్‌ ఐడీలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటాయి. వీటి ఆధారంగా వారికి మెయిల్స్‌ పంపిస్తున్న సైబర్‌ నేరగాళ్లు ‘కీ–లాగర్స్‌’ వంటి వైరస్‌ను పంపిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇవి వినియోగదారుడి కంప్యూటర్లలో నిక్షిప్తమైపోతున్నాయి. ఆ తర్వాత అతడికి తెలియకుండానే ఆ కంప్యూటర్‌ ద్వారా చేసే ప్రతి అంశమూ నేరగాడి మెయిల్‌కు అందుతుంది. ఇలా సదరు మెయిల్‌ ఐడీల పాస్‌వర్డ్స్‌ను సంగ్రహిస్తున్న సైబర్‌ నేరగాళ్లు వాటి ద్వారా మెయిల్‌ తెరుస్తున్నారు. సాధారణంగా నిత్యం వాడేది కాకుండా మరో కంప్యూటర్, ఫోన్‌ నుంచి ఎవరైనా ఓ మెయిల్‌ ఐడీని యాక్సస్‌ చేస్తే... వెంటనే జీ–మెయిల్‌ నుంచి అలెర్ట్‌ వస్తుంది. ఇది కూడా వినియోగదారుల కంట పడకుండా ఉండేందుకు సైబర్‌ నేరగాళ్లు అర్థరాత్రి, తెల్లవారుజాము వేళల్లో ఆయా మెయిల్స్‌ను యాక్సస్‌ చేస్తున్నారు. అందులోని సమాచారంతో పాటు అలెర్ట్‌ను డిలీట్‌ చేసేస్తున్నారు. ఫోన్లు, కంప్యూటర్లలో అశ్లీల వెబ్‌సైట్లు చూసే వారికి ‘కీ–లాగర్స్‌’ ముప్పు అధికంగా ఉంటుందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పేర్కొన్నారు. 

దుబాయ్‌ వెళ్తున్నట్లు గుర్తించి...
వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన సంస్థ మెయిల్‌ను ఇలానే యాక్సస్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు అందులో ఉన్న వివరాల ఆధారంగా వ్యాపార భాగస్వామి దుబాయ్‌ టూర్‌ విషయం గుర్తించారు. ఆయన అక్కడ ఉన్న తేదీల్లోనే ఆయన యూజర్‌ నేమ్‌తోనే మరో నకిలీ మెయిల్‌ సృష్టించారు. దీనిని అందుకున్న సంస్థ ప్రతినిధులు కేవలం యూజర్‌ నేమ్‌ పరిశీలించి అది తమ భాగస్వామి నుంచి వచ్చినదిగా భావించారు. కాస్తా పరిశీలనగా చూసి ఉంటే ఆ మెయిల్‌ తమ అధికారిక డొమైన్‌ నుంచి కాకుండా ‘ఐఎన్‌ఎం మెయిల్‌’ అనే ప్రైవేట్‌ డొమైన్‌ నుంచి వచ్చినట్లు గుర్తించేవారు. వీరు దానిని పరిశీలించకుండా నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సైబర్‌ క్రైమ్‌           ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ గంగాధర్‌ నేతృత్వంలోని బృందం డబ్బు బదిలీ అయిన ఖాతా నోయిడాకు చెందినదిగా గుర్తించారు. దీని ఆధారంగా  దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహా నేరాలు వరుసగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  

రూ.10.7 లక్షలూ గాయబ్‌...
బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన  రిఫ్రజిరేషన్‌ సంస్థ  లండన్‌లోని లాయిడ్‌ బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేసిన 15 వేల డాలర్లు (దాదాపు రూ.10.7 లక్షలు) నేరగాడు మళ్లించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం లాయిడ్‌ బ్యాంక్‌ను సంప్రదించగా.. బంజారాహిల్స్‌ సంస్థకు చెందిన ఖాతా ఉన్న సిండికేట్‌ బ్యాంక్‌ నుంచి అధికారిక సమాచారం రావాలని కోరింది. దీంతో పోలీసులు, బాధిత సంస్థ సిండికేట్‌ బ్యాంక్‌కు ఈ మేరకు లేఖ రాశారు. సిండికేట్‌ బ్యాంక్‌నకు చెందిన సంబంధిత అధికారులు ఆ మేరకు లాయిడ్‌ బ్యాంక్‌కు మెయిల్‌ పంపించారు. ఈలోపే సైబర్‌ నేరగాడు తమ ఖాతాలోని డబ్బును మళ్లించేశాడని, ప్రస్తుతం ఆ ఖాతాలో ఆ మొత్తం లేదని లాయిడ్‌ బ్యాంక్‌ సమాధానం ఇచ్చింది. నిందితులను పట్టుకోవడానికి కేసును కొలిక్కి తీసుకురావడానికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కృషి చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement