fake fingerprint scam
-
GHMC: యూ ట్యూబ్‌లో సెర్చ్ చేసి.. ఫెవికాల్+ఎంసీల్= ఫింగర్ ప్రింట్
-
GHMC: యూ ట్యూబ్‌లో సెర్చ్ చేసి.. ఫెవికాల్+ఎంసీల్= ఫింగర్ ప్రింట్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో చోటు చేసుకున్న కృత్రిమ వేలిముద్రల వ్యవహారాన్ని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ స్కామ్‌కు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లుగా పని చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతోంది? ఇంకా ఎందరి పాత్ర ఉంది? తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. గోషామహల్ సహా మరికొన్ని ప్రాంతాలకు చెందిన జీహెచ్ఎంసీ శానిటరీ విభాగం ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఉండే పారిశుద్ధ్య కార్మికుల వద్దకు ప్రతి రోజూ వెళ్లి బయోమెట్రిక్ మిషన్ల ద్వారా వారి హాజరును తీసుకుంటారు. ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేసే ఒక్కో కార్మికుడికీ నిర్దేశిత పని వేళలు ఉంటాయి. పని ప్రారంభించే ముందు బయోమెట్రిక్ మిషన్‌లో లాగ్ ఇన్, పూర్తయ్యాక లాగ్ ఔట్ నిర్దేశిస్తూ వీళ్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. దీన్ని గమనించిన కొందరు ఉద్యోగులు భారీ స్కెచ్ వేశారు. కొందరు పరిచయస్తుల్ని శానిటరీ వర్కర్లుగా ఎన్రోల్ చేశారు. వీరిని ప్రతి రోజూ ఫీల్డ్‌లోకి తీసుకువెళ్లడం, అక్కడే వారితో వేలిముద్రలు వేయించి హాజరు తీసుకోవడం సాధ్యం కాదు. దీంతో కృత్రిమ వేలిముద్రలు తయారు చేయడంపై దృష్టి పెట్టారు. యూ ట్యూబ్‌లో సెర్చ్ చేయడం ద్వారా ఫెవికాల్, ఎంసీల్ తదితరాలు కలపడం ద్వారా ఓ రకమైన సింథటిక్ పదార్థం తయారు చేయవచ్చని తెలుసుకున్నారు. దీనిపై డమ్మీ కార్మికుల వేలిముద్రల్ని సేకరించారు. ఆ సింథటిక్ పదార్థాన్ని వేలిముద్రల ఆకారంలో కట్ చేశారు. వీటిని తమ జేబులో వేసుకుని ఫీల్డ్‌కు వెళ్తున్న ఉద్యోగులు అదును చూసుకుని లాగ్ ఇన్, లాగ్ ఔట్ కోసం వీటితో వేలిముద్రలు వేసేస్తున్నారు. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో వలపన్నిన అధికారులు స్కామ్ గుట్టరట్టు చేయడంతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని 21 కృత్రిమ వేలిముద్రలు స్వాధీనం చేసుకున్నారు. ఒకటిరెండు రోజుల్లో ఈ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులపై స్పష్టత వస్తుందని, ఆపై అందరినీ అరెస్టు చేస్తామని టాస్క్‌ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. -
జీహెచ్ఎంసీలో మరోసారి ఫింగర్ ప్రింట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి ఫింగర్ ప్రింట్ల స్కామ్ కలకలం రేగింది. శానిటైజేషన్ కార్మికుల హాజరులో గోల్మాల్ వెలుగు చూసింది. కార్మికులు విధులకు హాజరు కాకపోయినా హాజరైనట్లు చేసిన వైనం బయటపడింది. సింథటిక్ ఫింగర్ ప్రింట్లు వాడి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు గోషామహల్ సర్కిల్ శానిటరీ సూపర్వైజర్ వెంకటరెడ్డి. పోలీసులు సుమారు 21 మంది ఫింగర్ ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్‌కు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. -
నెలలోనే 2,500 నకిలీ వేలిముద్రలు.. రూ. 40 లక్షలు హాంఫట్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు తెలివిమీరి పోయారు. క్రెడిట్, డెబిట్ కార్డ్ మోసాలు, ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్లు, ఆన్లైన్ సర్వీస్‌లు ఇలా రకరకాలుగా మోసాలు చేస్తున్న వీరు.. తాజాగా వేలిముద్రలతో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయడం మొదలుపెట్టారు. నెల రోజుల్లోనే 2,500 నకిలీ ఫింగర్ ప్రింట్స్ సృష్టించి రూ.40 లక్షల కాజేశారు. రెండున్నరేళ్లుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా కొట్టేసిన సొమ్ము రూ.వందల కోట్లలోనే ఉంటుందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ శింగెనవర్తో కలిసి గురువారం వివరాలు వెల్లడించారు. వెబ్సైట్లోకి వెళ్లి.. ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన నల్లగల్ల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేశ్‌కు రిజిస్ట్రేషన్, బ్యాంకింగ్ రంగంలో అపారమైన అనుభవం ఉంది. ఈ క్రమంలో తన మకాంను నగరంలోని బీరంగూడకు మార్చాడు. ఆధార్ నంబర్, వేలిముద్రల సహాయంతో బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును ఎలా కాజేయవచ్చో పరిశోధించిన వెంకటేశ్.. నకిలీ గుర్తింపు కార్డ్‌తో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) లైసెన్స్‌ను పొందాడు. ఏఈపీఎస్ సేవలను పొందేందుకు అవసరమైన ఆధార్ నంబర్, ఫింగర్ ప్రింట్స్‌ను పక్క రాష్ట్రానికి చెందిన రిజిస్ట్రేషన్, స్టాంప్స్ వెబ్సైట్లోకి వెళ్లి.. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునేవాడు. నకిలీ వేలి ముద్రల తయారీ ఇలా.. రిజిస్ట్రేషన్ విభాగం నుంచి డౌన్లోడ్ చేసుకున్న డాక్యుమెంట్లలోని వేలి ముద్రలను ఎక్స్ఎల్, వర్డ్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుని ఫొటో షాప్‌లో వేలిముద్రలు స్పష్టంగా వచ్చేలా డెవలప్ చేసి, దాన్ని బటర్ పేపర్ మీద ప్రింట్ తీసి.. పాలీమర్ లిక్విడ్ పోస్తారు. లిక్విడ్ ఎండిపోవటం కోసం నెయిల్ డ్రయ్యర్ యూవీ లైట్ ల్యాంప్ అనే మిషన్ కింద నకిలీ ముద్రలను ఉంచుతారు. దీంతో నాలుగు నిమిషాల్లో నకిలీ రబ్బర్ వేలిముద్రలు తయారవుతాయి. నకిలీ గుర్తింపు కార్డ్‌లతో ఏఈపీఎస్ లైసెన్స్.. రాయ్‌నెట్ అనే కంపెనీ బ్యాంక్‌లకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) సేవలను అందిస్తుంది. దీని నుంచి 2019లో కొందరు వ్యక్తులు ఈపాయింట్ ఇండియా పేరుతో ఫ్రాంచైజీ తీసుకున్నారు. బిజినెస్ కరస్పాండెట్లను నియమించుకొని గ్రామాల్లో యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, బ్యాంకింగ్ సేవలను అందించడం వీళ్ల పని. ఈ క్రమంలో వెంకటేశ్ నకిలీ గుర్తింపు కార్డ్‌లను సమర్పించి గత నెల 4న ఏఈపీఎస్ లైసెన్స్ పొందాడు. దీంతో ఇతనికి ఈపాయింట్ ఇండియా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కేటాయించింది. దీని ద్వారా ఎవరైనా సరే యూటిలీటీ బిల్లుల చెల్లింపులు, నగదు డ్రా, బదిలీ వంటి అన్ని రకాల బ్యాంక్ సేవలను వినియోగించుకోవచ్చు. నగదు ఎలా కొట్టేస్తారంటే.. ఈపాయింట్ ఇండియా యాప్‌లో ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, నకిలీ రబ్బర్ వేలిముద్రను పెడతారు. ఒకవేళ ఆధార్ నంబర్‌కు బ్యాంక్ ఖాతా నమోదై ఉంటే ప్రొసీడింగ్ అని వస్తుంది. లేకపోతే రాదు. ఇలా నిందితులు అన్ని బ్యాంక్‌లను పరిశీలించుకుంటూ పోతారు. ఎప్పుడైతే ప్రొసీడింగ్ అని వస్తుందో ఓకే నొక్కగానే ఆ ఆధార్ నంబర్‌కు లింకై ఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్, పేరు, ఎంత బ్యాలెన్స్ ఉందో అన్ని వివరాలు తెలిసిపోతాయి. వెంటనే ఆ బ్యాంక్ ఖాతా నుంచి నిందితులకు చెందిన అకౌంట్లకు నగదును బదిలీ చేసుకుంటారు. సాధారణంగా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీ చేయాలంటే ఓటీపీ, డబుల్ అథంటికేషన్ ఉంటుంది. కానీ ఏఈపీఎస్‌లో అలా ఉండదు. ఇదే నిందితులకు వరంగా మారింది. కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో కేసులు.. ప్రస్తుతానికి ఈ గ్యాంగ్‌పై సైబరాబాద్‌లో రెండు, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లోని ఒక్కో కేసు నమోదయ్యాయి. సైబరాబాద్‌లో 149 బ్యాంక్ ఖాతాల నుంచి రూ.14,64,679 నగదును నిందితులు కాజేశారు. వెంకటేశ్‌తో పాటు అతనికి సహకరించిన మేఘావత్ శంకర్ నాయక్, రత్నం శ్రీనివాస్, దర్శనం సామేలు, చల్లా మణికంఠ, షేక్ ఖాసిం, విశ్వనాథుల అనిల్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.3.4 లక్షల నగదు, ల్యాప్‌టాప్, కారుతో పాటు 2,500 నకిలీ వేలిముద్రలు, 121 సిమ్ కార్డ్‌లు, 20 ఫోన్లు, 13 డెబిట్ కార్డ్‌లు, పాన్ కార్డ్, రెండు ఆధార్ కార్డ్‌లు, 3 రూటర్లు, 4 బయోమెట్రిక్ ఫ్రింగర్ ప్రింట్ స్కానర్లు, 3 పెన్ డ్రైవ్‌లు, 4 కిలోల పాలీమర్ లిక్విడ్, 3 కిలోల ప్రీమర్ లిక్విడ్ బాటిళ్లు, యూవీ నెయిల్ ల్యాంప్, రెండు ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్స్ ఇతరత్రా వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
‘సింథటిక్’తో సింపుల్‌గా దోచేశారు..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పారిశుధ్య కార్మికుల హాజరులో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు అవకతవకలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. కార్మికుల బయోమెట్రిక్ హాజరులో అక్రమాలు జరిగినట్లు తేలింది. నకిలీ (సింథటిక్) వేలిముద్రలు తయారు చేసి వాటితో పారిశుధ్య కార్మికులు హాజరు కాకపోయినా హాజరు వేసి వారి వేతనాలు కాజేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తనిఖీలు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ విభాగం చాలా కాలంగా జరుగుతున్న గుట్టును రట్టు చేసింది. ఏకంగా 84 మంది నకిలీ వేలి ముద్రలను స్వాధీనం చేసుకున్నారు. 9 మందిపై వేటు.. క్రిమినల్ కేసులు.. జీహెచ్ఎంసీలో నకిలీ వేలిముద్రలతో పారిశుధ్య కార్మికుల హాజరు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగం బృందాలు దాదాపు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి హైదరాబాద్‌లోని 12 ప్రాంతాల్లో ఎస్‌ఎఫ్‌ఏలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. 84 కృత్రిమ (సింథటిక్) వేలిముద్రలు స్వాధీనం చేసుకున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం)డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. 17 మంది ఎస్ఎఫ్ఏలను తనిఖీ చేయగా, 9 మంది వద్ద ఈ నకిలీ ఫింగర్ ప్రింట్స్‌ను గుర్తించినట్లు తెలిపారు. 9 మంది ఎస్ఎఫ్ఏలను విధుల నుంచి తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. నకిలీ వేలిముద్రలతోపాటు 12 బయోమెట్రిక్ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. పది రూపాయల్లోపే తయారీ: కొవ్వొత్తిని కాల్చగా వచ్చిన ద్రవాన్ని అట్టముక్కపై వేస్తారు. కొద్దిగా ఆరిన ద్రవంపై వేలిముద్ర వేయిస్తారు. తర్వాత కొంచెం ఫెవికాల్ వేస్తారు. అది గట్టిపడ్డాక దిగువనున్న పేపర్‌ను తొలగిస్తే ఫింగర్‌ప్రింట్ మిగులుతుంది. దీనితో బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తున్నారు. నకిలీ వేలిముద్రల ద్వారా భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి తయారీకి రూ.5 నుంచి రూ.10 లోపే ఖర్చు కావడం గమనార్హం. బయోమెట్రిక్ హాజరును ఆధార్ అనుసంధానంతో పాటు జీపీఎస్‌నూ జత చేయడంతో అవకతవకలకు పాల్పడే వీలుండదని భావించిన అధికారులు.. తాజా ఉదంతంతో ఖంగు తిన్నారు. 2017 మేలో జీహెచ్ంఎసీ బయోమెట్రిక్ హాజరు ప్రారంభించింది. ఒక్క నెలలోనే రూ.2.86 కోట్లు మిగులు కనిపించింది. విధులకు గైర్హాజరైన వారిపేరిట జరిగిన స్వాహా అది. అలా ఏడాదికి రూ.35 కోట్ల మిగులు కనిపించింది. మే 21 నుంచి జూన్ 20 వరకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించారు. దీంతో ఒక్క నెలలోనే రూ.2,86,34,946 తేడా కనిపించింది. బయోమెట్రిక్ హాజరు లేనప్పుడు 2016 డిసెంబర్ 21 నుంచి 2017 జనవరి 20 వరకు రూ.34,64,22,282 వేతనాలుగా చెల్లించగా, బయోమెట్రిక్ హాజరు అమలు చేశాక 2017 మే 21 నుంచి జూన్ 20 వరకు రూ.31,77,87,336 మాత్రమే చెల్లించారు. అధికారులపై చర్యలు: మేయర్ పారిశుధ్య కార్మికుల బోగస్ హాజరు నమోదు చేస్తున్న 9 మంది ఎస్ఎఫ్ఏలను విధుల నుంచి తొలగించి వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా మేయర్ బొంతురామ్మోహన్ అధికారులను ఆదేశించారు. -
‘సాఫ్ట్‌గా’ చిక్కిన సంతోష్!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానంతో బయోమెట్రిక్ వ్యవస్థనే చాలెంజ్ చేస్తూ నకిలీ వేలి ముద్రలు సృష్టించిన పాత సంతోష్ కుమార్‌ను పట్టించింది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నకిలీ ముద్రలే. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీ ఏఐ).. వేలిముద్రలతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంచడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఆధార్ కార్డు కలిగిన వారు తమ వేలిముద్రలు లాక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ద్వారా అవకాశం ఇచ్చింది. దీన్ని నగరానికి చెందిన, ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సద్వినియోగం చేసుకున్నారు. ఈయన గతంలో వరంగల్ సమీపంలో కొంత భూమి ఖరీదు చేయడంతో రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోకి ఆ డాక్యుమెంట్ చేరింది. సిమ్‌కార్డుల టార్గెట్ కోసం పేరు, ఆధార్ వివరాలతో పాటు వేలిముద్రలు ఉండే డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ శాఖ సైట్ నుంచి సంతోష్ డౌన్లోడ్ చేసుకున్న వాటిలో సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌వి కూడా ఉన్నాయి. వీటిని వినియోగించి తయారు చేసిన నకిలీ వేలిముద్రల ద్వారా సంతోష్ కొన్ని సిమ్‌కార్డులు యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఫలానా సిమ్‌కార్డుల యాక్టివేషన్‌కు మీ బయోమెట్రిక్ వినియోగించే ప్రయత్నం జరిగిందంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఆధార్ సర్వర్ నుంచి అలర్ట్ మెసేజ్ వచ్చింది. తన వేలిముద్రలు పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని ఈ–కేవైసీ యంత్రంలో వేయడమేంటని ఆయనకు సందేహం వచ్చి ఢిల్లీలోని ఆధార్ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతుగా ఆరా తీయడంతో పాటు కేంద్ర నిఘావర్గాలకు సమాచారం ఇచ్చారు. కాగా, సంతోష్ కస్టడీ ముగియడంతో గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. మరో 3 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు. నకిలీ వేలిముద్రల తయారీపై విచారణ సాక్షి, పెద్దపల్లి/ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారంలో నకిలీ వేలిముద్రలు తయారు చేసిన కేసులో అరెస్టు అయిన సంతోష్‌కుమార్ ఇంట్లో, దుకాణంలో శుక్రవారం క్రైమ్ స్పెషల్ బ్రాంచి పోలీసులు, క్లూస్‌టీం సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వొడాఫోన్‌కు సంబంధించిన సిమ్‌కార్డులు, నకిలీ వేలిముద్రలు తయారు చేసే రబ్బర్ స్టాంపులు, వోచర్ డాక్యుమెంట్లు, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8.30 గంటలకే ధర్మారంలోని సంతోష్‌కుమార్ ఇంటికి చేరుకుని, దాదాపు గంటసేపు సోదాలు నిర్వహించారు. ఇంట్లో దాచి ఉంచిన దాదాపు మూడు వేల సిమ్‌కార్డులు వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. నకిలీ వేలిముద్రలతో బియ్యం స్వాహా ధర్మారం: నకిలీ వేలిముద్రల కేసు పలు మలుపులు తిరుగుతోంది. నకిలీ వేలిముద్రలతో రేషన్‌బియ్యాన్ని అక్రమంగా స్వాహా చేశారనే ఆరోపణలు వచ్చిన అనుమానితులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ధర్మారం, వెల్గటూర్ మండలాల్లోని డీలర్లతో సంతోష్ కుమ్మక్కై రేషన్ బియ్యాన్ని దారి మళ్లించినట్లు తెలిసింది. దీంతో నలుగురు డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రకంపనలు సృష్టిస్తున్న నకిలి వేలిముద్రల స్కామ్