వోచర్ డాక్యుమెంట్ (ఇన్‌సెట్‌లో) సంతోష్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానంతో బయోమెట్రిక్ వ్యవస్థనే చాలెంజ్ చేస్తూ నకిలీ వేలి ముద్రలు సృష్టించిన పాత సంతోష్ కుమార్‌ను పట్టించింది ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నకిలీ ముద్రలే. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీ ఏఐ).. వేలిముద్రలతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంచడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఆధార్ కార్డు కలిగిన వారు తమ వేలిముద్రలు లాక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ ద్వారా అవకాశం ఇచ్చింది. దీన్ని నగరానికి చెందిన, ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సద్వినియోగం చేసుకున్నారు. ఈయన గతంలో వరంగల్ సమీపంలో కొంత భూమి ఖరీదు చేయడంతో రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లోకి ఆ డాక్యుమెంట్ చేరింది.
సిమ్‌కార్డుల టార్గెట్ కోసం పేరు, ఆధార్ వివరాలతో పాటు వేలిముద్రలు ఉండే డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ శాఖ సైట్ నుంచి సంతోష్ డౌన్‌లోడ్ చేసుకున్న వాటిలో సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌వి కూడా ఉన్నాయి. వీటిని వినియోగించి తయారు చేసిన నకిలీ వేలిముద్రల ద్వారా సంతోష్ కొన్ని సిమ్‌కార్డులు యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఫలానా సిమ్‌కార్డుల యాక్టివేషన్‌కు మీ బయోమెట్రిక్ వినియోగించే ప్రయత్నం జరిగిందంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఆధార్ సర్వర్ నుంచి అలర్ట్ మెసేజ్ వచ్చింది. తన వేలిముద్రలు పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని ఈ–కేవైసీ యంత్రంలో వేయడమేంటని ఆయనకు సందేహం వచ్చి ఢిల్లీలోని ఆధార్ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతుగా ఆరా తీయడంతో పాటు కేంద్ర నిఘావర్గాలకు సమాచారం ఇచ్చారు. కాగా, సంతోష్ కస్టడీ ముగియడంతో గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. మరో 3 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు.
నకిలీ వేలిముద్రల తయారీపై విచారణ
సాక్షి, పెద్దపల్లి/ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారంలో నకిలీ వేలిముద్రలు తయారు చేసిన కేసులో అరెస్టు అయిన సంతోష్‌కుమార్ ఇంట్లో, దుకాణంలో శుక్రవారం క్రైమ్ స్పెషల్ బ్రాంచి పోలీసులు, క్లూస్‌టీం సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వొడాఫోన్‌కు సంబంధించిన సిమ్‌కార్డులు, నకిలీ వేలిముద్రలు తయారు చేసే రబ్బర్ స్టాంపులు, వోచర్ డాక్యుమెంట్లు, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8.30 గంటలకే ధర్మారంలోని సంతోష్‌కుమార్ ఇంటికి చేరుకుని, దాదాపు గంటసేపు సోదాలు నిర్వహించారు. ఇంట్లో దాచి ఉంచిన దాదాపు మూడు వేల సిమ్‌కార్డులు వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.
నకిలీ వేలిముద్రలతో బియ్యం స్వాహా
ధర్మారం: నకిలీ వేలిముద్రల కేసు పలు మలుపులు తిరుగుతోంది. నకిలీ వేలిముద్రలతో రేషన్‌బియ్యాన్ని అక్రమంగా స్వాహా చేశారనే ఆరోపణలు వచ్చిన అనుమానితులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ధర్మారం, వెల్గటూర్ మండలాల్లోని డీలర్లతో సంతోష్ కుమ్మక్కై రేషన్ బియ్యాన్ని దారి మళ్లించినట్లు తెలిసింది. దీంతో నలుగురు డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment