
ముంబై: ఆర్థిక మోసాలపై కస్టమర్లలో అవగాహన పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. ప్రముఖులతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటికోసం తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను ప్రచారకర్తగా నియమించుకుంది. ‘ఆర్‌బీఐ సేస్’ పేరిట రిజర్వ్ బ్యాంక్‌కు ఉన్న మరో ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. ‘అవగాహన పెంచుకోవడానికి పైసా ఖర్చు కాదు .. కానీ అజ్ఞానానికి మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది‘ అని సందేశం పోస్ట్ చేశారు.
లాక్‌డౌన్ కాలంలో డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ బచ్చన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్‌బీఐ ఏడాది కాలంగా కస్టమర్లలో అవగాహన పెంచేందుకు ఇంగ్లిష్, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లోనూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవల ఏప్రిల్‌లో ఫేస్‌బుక్ పేజ్ కూడా ప్రారంభించింది. ట్విట్టర్‌లో ఫాలోవర్ల సంఖ్యాపరంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌ను కూడా అధిగమించి, అత్యంత ప్రాచుర్యంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్‌గా ఆర్‌బీఐ నిల్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ట్విట్టర్ హ్యాండిల్‌కు 6.64 లక్షల ఫాలోవర్లు ఉండగా, ఆర్‌బీఐకి ఏకంగా 9.66 లక్షల మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment