భారతీయులూ... బహుపరాక్
మోసగాళ్ల వలలో పడొద్దని ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
దుబాయ్: మోసగాళ్ల వలలో పడొద్దని ఇక్కడి భారతీయులను కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. తాము భారత రాయబార కార్యాలయానికి చెందిన అధికారులమని చెప్పుకుంటూ కాల్స్ చేసేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇమిగ్రేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చినవారిపై స్థానిక అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారంటూ బెదిరించి బాధితుల వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేస్తారని తెలిపింది.
భారతీయ రాయబార కార్యాలయం నియమించిన న్యాయవాది లేదా కన్సల్టెంట్ ఖాతాలోకి డబ్బులు బదిలీ చేయాలని బాధితులకు సూచిస్తారని, అదే సమయంలో ఈ మొత్తాన్ని భారతీయ రాయబార కార్యాలయం రీయింబర్స్ చేస్తుందని చెబుతారని ఓ ప్రకటనలో తెలిపింది. తాము టార్గెట్‌గా ఎంచుకున్నవారి వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు ఈ నయవంచకులు హ్యాకింగ్ స్కిల్స్‌ను వినియోస్తారని, రాయబార కార్యాలయం నుంచే ఫోన్ చేస్తున్నట్టు చెబుతారని తెలిపింది.