Cyber Crime: Fraudsters hack Hyderabad company's emails, cheated money - Sakshi
Sakshi News home page

అసలు డౌట్‌ రాలేదు.. అక్షరం మార్చి రూ. కోటి కొట్టేశారు!

Published Sat, Feb 25 2023 11:28 AM | Last Updated on Sat, Feb 25 2023 11:52 AM

Cyber Crime: Fraudsters Hack Company Email Cheats Money Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయిలో లావాదేవీలు చేసే కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు.. అకౌంట్‌ టేకోవర్‌ మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ–మెయిల్‌ ఖాతాలను హ్యాక్‌ చేయడం, చెల్లింపుల సమయం వరకు వేచిచూసి బ్యాంక్‌ ‘ఖాతా’ మార్చేయడం ద్వారా తేలిగ్గా సొమ్మును స్వాహా చేస్తున్నారు. ఈ నేరగాళ్ల బారినపడి 1.39 లక్షల డాలర్లు (రూ.1.15 కోట్లు) చెల్లించి.. అతికష్టం మీద తిరిగి పొందిన హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ సంస్థ శుక్రవారం హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. 

ఎల్రక్టానిక్‌ వస్తువుల కోసమని..
బ్యాటరీలు, పలు రకాల ఎలక్ట్రానిక్‌ పరికరాలను తయారు చేసే హెచ్‌బీఎల్‌ సంస్థ.. పలు రకాల విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలో సింగపూర్‌కు చెందిన ఎక్సెల్‌ పాయింట్‌ అనే సంస్థ నుంచి మైక్రో కంట్రోలర్లు, చిప్‌ల కొనుగోలు కోసం సంప్రదింపులు జరిపింది. ఎక్సెల్‌ పాయింట్‌ సంస్థకు మన దేశంలోని పెద్ద నగరాల్లోనూ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలోని ఓ కార్యాలయంలో పనిచేసే నవ్య అనే ఉద్యోగి.. హెచ్‌బీఎల్‌ సంస్థతో ఫోన్‌ ద్వారా, తన పేరిట ఉన్న ఈ–మెయిల్‌ ఐడీ ద్వారా సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలో ఎక్సెల్‌ సంస్థ విడిభాగాలకు సంబంధించి 1.39 లక్షల డాలర్లను.. ఈనెల 2న సింగపూర్‌ బ్యాంక్‌లోని తమ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటూ వివరాలను హెచ్‌బీఎల్‌కు ఈ–మెయిల్‌ చేసింది.

అదేరోజున సాయంత్రం 4:30 గంటలకు ఎక్సెల్‌ పాయింట్‌ నుంచి వచ్చినట్టుగా హెచ్‌బీఎల్‌ సంస్థకు మరో ఈ–మెయిల్‌ అందింది. అందులో ఐటీ, పలు ఇతర కారణాల వల్ల బ్యాంకు ఖాతాను మార్చాలని, యూఏఈకి చెందిన ఓ బ్యాంకు ఖాతాకు సొమ్ము ట్రాన్స్‌ఫర్‌ చేయాలని అందులో ఉంది. దీంతో హెచ్‌బీఎల్‌ సంస్థ అదేరోజున 1.39 లక్షల డాలర్లను యూఏఈ బ్యాంక్‌ ఖాతాకు బదిలీ చేసింది. కానీ రెండు రోజులు వేచి చూసినా సింగపూర్‌ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పరిశీలించిన హెచ్‌బీఎల్‌ సంస్థ ప్రతినిధులు.. రెండోసారి వచ్చిన ఈ–మెయిల్‌ నకిలీదని, సొమ్ము వేరే ఎవరికో ట్రాన్స్‌ఫర్‌ అయిందని గుర్తించారు. దీనిపై వెంటనే సంస్థ ఖాతా ఉన్న ఎస్‌బీఐకి ఫిర్యాదు చేశారు. ఎస్‌బీఐ సుదీర్ఘ ప్రయత్నాల అనంతరం యూఏఈ బ్యాంకు నుంచి నగదును వెనక్కి రప్పించగలిగింది.  

ఈ–మెయిల్‌ ఐడీని హ్యాక్‌ చేసి.. 
సైబర్‌ నేరగాళ్లు సింగపూర్‌ సంస్థకు చెందిన ఈ–మెయిల్‌ ఐడీని హ్యాక్‌ చేసి ఉంటారని, లావాదేవీలు ఇతర విషయాలను క్షుణ్నంగా పరిశీలించి మోసానికి దిగి ఉంటారని సైబర్‌క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. హెచ్‌బీఎల్‌ సంస్థతో సంప్రదింపుల కోసం ఎక్సెల్‌ సంస్థ వాడిన ఈ–మెయిల్‌ ఐడీని గుర్తించి, కేవలం ఒక్క అక్షరం మార్చి మరో ఈమెయిల్‌ ఐడీని సృష్టించారని.. దీనిని గమనించలేక పోవడంతో డబ్బు వేరేవారికి ట్రాన్స్‌ఫర్‌ అయిందని వివరిస్తున్నారు. ఈ తరహా నేరాల్లో నగదు రికవరీ కావడం కష్టమని.. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

చదవండి   లవర్ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య గొడవ.. మందు తాగుదామని రూమ్‌కి పిలిచి దారుణంగా..


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement