చిదంబర పలుకులు
రోజూ చచ్చేవాడి కోసం ఏడ్చేవాడు ఎవడు అన్నట్టు... ఏళ్ల తరబడి అనునిత్యం అనుభవించక తప్పని శిక్షగా మారిన ధరల పరుగు పందేన్ని ఎవరూ పట్టించుకున్నట్టు లేరు. అందుకేనేమో పట్టించుకోవాల్సిన వారు ఎట్టకేలకు పెదవి విరిచి ‘చిదంబర’ రహస్యాన్ని విడమరిచారు. చిల్లర ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం కాదు కదా, వాటి పరుగు జోరుకు కళ్లెం వేయడం కూడా తమ వల్ల కాదని, ఆ మాట కొస్తే ఎవరి వల్లా కాదని ఆర్థిక మంత్రి చిదంబరం గురువారం తేల్చేసారు. వినియోగదారుల ధరల సూచీపై ఆధారపడి లెక్కగట్టే రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో అంతకు ముందటి మాసంతో పోలిస్తే 10.09 శాతం పెరిగింది. హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 7 శాతం పెరి గింది. ఈ ఒక్క నెల్లోనే కాదు గత ఐదేళ్లుగా నెలకు 10 శాతం ఎక్కువ ధరలు చెల్లించి ప్రజలు నిత్యజీవితావర వస్తువులను కొసుక్కోవాల్సి వస్తోంది. ధరలతో పాటూ పరుగు తీసి ఎంత ధరంటే అంతా చెల్లించి చస్తున్నారు. చెల్లించనే లేని వాళ్లు కొనుక్కోలేక చస్తున్నారు. ఎవరికి ఏ చావు రాసి పెట్టి ఉంటే అదే.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి మన ప్రధాని మన్మోహన్‌సింగ్ వరకు అంతా మనలాంటి వర్థమాన దేశాల ప్రజలు ఆదాయాలు పెరిగి, తెగ తినడమే ఆహార ధర ల పెరుగుదలకు కారణమని తేల్చారు. మనసులోని మాట పైకి చెప్పకూడని ఎన్నికల కాలం కాబట్టో ఏమో చిదంబరం ఆ మాట అనలేదు. కానీ ఆహార ధరల పెరుగుదలే ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమని చెప్పుకొచ్చారు. ఇక విశ్లేషకులంతా ఉల్లి, కూరగాయల ధరలదే ఈ పాపమంతా అని నిర్ధారించారు. కూరగాయల ధరలు అసాధారణంగా 45.67 శాతం పెరిగిన మాట నిజమే. మరి తిండిగింజలు గత నెల కంటే 12.01 శాతం ఎందుకు పెరిగినట్టు? ముద్దంటూ ఉంటేగా నంజుకోడానికి కూర ముక్క కావాల్సింది? గంజి కాసుకోడానికైనా ఇన్ని గింజలుండాలే? పళ్లు ఇప్పటికే ధనవంతుల విలాసంగా మారి వెక్కిరిస్తున్నాయి. కూరగాయలు వాటి పక్కకే రెక్కలు కట్టుకు పోతున్నాయి. ఇది పట్టదా? అని అడగడానికి లేకుండా చిల్లర ధరల పెరుగుదల జోరు తగ్గించడం తేలికేమీ కాదని, ఆ మాటకొస్తే అసలు ఇప్పట్లో సాధ్యం కాదనేది చిదంబరం చెప్పిన రహస్యం. మరో ఐదేళ్లో, పదేళ్లో సామాన్యుల అరికాళ్ల కింద మంటలు భగభగ మండుతూనే ఉంటాయని ఆయన తేల్చేసారు. ఆ మంటలు ఆర్పే ఫైరింజన్లు మోడీ దగ్గర కూడా లేవని చెప్పకుండానే అర్థమై పోయేలా అసలు సంగతి కూడా చెప్పారు.
ఆహార పదార్థాల గిరాకీతో పోలిస్తే సరఫరా తక్కువగా ఉండటమే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు కార ణమని, కాబట్టి అది తగ్గాలంటే ఉత్పత్తిని పెంచడమే పరిష్కారమని సెలవిచ్చారు. సరఫరా పెరగడానికి ‘పెద్ద ఎత్తున పెట్టుబడులు, మదుపులు, ఉత్పత్తి, సరఫరా సదుపాయాలు వగైరా’ అవవసరమని అన్నారు. నిజమే ఉత్పత్తి పెరగనిదే సరఫరా పెరగదు. కానీ చిదంబరం చెబుతున్నట్టుగా ఉల్లి ధర రూ. 100, రూ.150 కి చేరడానికి కారణం సరఫరా తగ్గడమేనా? తగ్గిన సరఫరాతో పోలిస్తే ధర పది రెట్లకు పైగా ఎందుకు పెరిగింది? నిన్నిటి ఉల్లి సరే ఇప్పుడు బీహార్, పశ్చిమబెంగాల్‌లో పలు ప్రాంతాల్లో ఉప్పును రూ. 100 నుంచి 150లకు అమ్మేసి సొమ్ముచేసుకుంటున్నవారి సంగతేమిటి? దొంగ నిల్వదారులే, వ్యాపారులే ఏలికలకు రాజపోషకులనేది బహిరంగ రహస్యమే కాబట్టి ఈ ఎన్నికల విరాళాల కాలంలో వారు అసలే కనబడకపోవడం ‘న్యాయమే’.
ఏదేమైతేనేం, అధిక ధరల గుదిబండ దించడానికి మనకు చిదంబరం దీర్ఘకాలిక పరిష్కారం చూపారు. అందుకోసమే చిందంబరం ఇప్పటికే ఇచ్చిన సంస్కరణల డోసులతోనూ, విదేశీ బ్యాంకుల రాకతోనూ, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతోనూ వచ్చిన విదేశీ పెట్టుబడులు ఉత్పత్తి రంగంలోకి పోలేదెందుకు? గత ఏడాది 1 శాతం నామాత్రపు వృద్ధిని సాధించిన పారిశ్రాకమిక రంగం ఆగస్టులో 0.5 శాతం వృద్ధితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకో ఆర్థిక మంత్రి చెప్పరు. దీపావళికి అమ్మకాలు లేక కళ తప్పిన అధిక ఆదాయ వర్గాల వినియోగవస్తు మార్కెట్లు చెబుతాయి. ఈ పండుగల సీజన్లో పేద వర్గాల్లాగే, అధిక ఆదాయవర్గాలను కూడా కొనుగోళ్లకు దూరంగా ఉంచినది ద్రవ్యోల్బణమేనని పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తేల్చి చెప్పింది. అది దాని లెక్కల్లో సిగరెట్లు, ఎల్‌పీజీ వ్యంట గ్యాస్ వంటి వస్తువులను కూడా అధిక ఆదాయవర్గాల వస్తువులుగా లెక్కించింది. అంటే మధ్యతరగతిలోని ఉన్నత వర్గాల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరికీ నేడు ద్రవ్యోల్బణం సెగ తగులుతున్నదన్న మాటే. చిదంబరం చిలుక పలుకులు బాగున్నా, సార్వత్రిక ఎన్నికల వైతరణిని దాటించ లేవు.
- పిళ్లా వెంకటేశ్వరరావు