బంగ్లా బ్యాలెట్‌పై నెత్తుటి మరక | Violence in Bangladesh elections | Sakshi
Sakshi News home page

బంగ్లా బ్యాలెట్‌పై నెత్తుటి మరక

Published Thu, Jan 9 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

బంగ్లా బ్యాలెట్‌పై నెత్తుటి మరక

బంగ్లా బ్యాలెట్‌పై నెత్తుటి మరక

 విశ్లేషణ: పిళ్లా వెంకటేశ్వరరావు
 
 ‘అవామీ లీగ్ గెలిస్తే షేక్ హసీనాతోపాటూ ఓ గుప్పెడు మంది గెలుస్తారు, ఓడిపోతే మొత్తంగా బంగ్లాదేశ్ ఓడిపోతుంది’ అని ప్రముఖ బంగ్లా కవి, రచయిత, విమర్శకుడు అహ్మద్ సోఫా అపుడెప్పుడో అన్నారు. అవామీ లీగ్, హసీనాలు గెలిచినా బంగ్లాదేశ్ ఓడిపోయే ప్రమాదం ఉన్నదనే చేదు నిజాన్ని గుర్తించడానికి నేడు ఆయన లేరు. జనవరి 5న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని హసీనా, ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ ఘన విజయాన్ని సాధించాయి. విజయోత్సవ వేడుకలు మాత్రం లేవు. 2009లోలాగా ఓటింగ్ రోజున పోలింగ్ స్టేషన్లవద్ద బారులు తీరిన ఓటర్లు లేరు. వచ్చిన వారు కూడా భయం భయంగానే వచ్చారు. రాని వారిలో చాలా మంది భయంతోనే రాలేదు.
 
  రాజ ధాని ఢాకాలో సైతం ఎన్నికల సందడి లేదు. అక్కడున్న 20 పార్లమెంటరీ స్థానాలకు ఐదు చోట్లే ఎన్నికలు జరిగాయి. మిగతా అన్నీ ‘ఏకగ్రీవ’ ఎన్నికలే. మొత్తం 300 స్థానాల్లో 154 ఏకగ్రీవ  ఎన్నికలు. అందులో 127, మొత్తం స్థానాల్లో నాలుగింట మూడువంతులు అధికార పార్టీ ఖాతాలోనే. అయినా అవామీ నేతలు విజయోత్సవాలు జరుపుకోడానికి సిగ్గుపడుతున్నారు. దాదాపు పాతికేళ్లుగా బంగ్లా రాజకీయాలను శాసిస్తున్న అవామీ, బీఎన్‌పీలు బరిలోకి దిగి కలబడకుండానే... దక్కిన విజయం అతి చప్పగా అనిపించడం సహజమే. దేశవ్యాప్తంగా ఎన్నికల తదుపరి చెలరేగుతున్న హింసాకాండలో ఇప్పటికే 30 మందికి పైగా మరణించారు. అఖండ విజయం దక్కించుకున్న ఆ పార్టీ అధికారంలో ఉండేదెన్నాళ్లనేది అప్పుడే చర్చనీయాంశంగా మారింది.

 ఏకపక్ష ఎన్నికల ‘సంప్రదాయం’

 మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఎన్నికలను బహిష్కరించింది. మూడో అతిపెద్ద పక్షమైన జాతీయ పార్టీ అధినేత, మాజీ ప్రధాని, నియంత మొహ్మద్ హుస్సేన్ ఎర్షాద్... హసీనా, ఖలీదాల మధ్య అటూ ఇటూ మూడు మొగ్గలేసి... బహిష్కరణ మంత్రం పఠించారు. పర్యవసానంగా ఎన్నికలు ముగిసే వరకు  సైనిక ఆసుపత్రిలో ‘విశ్రాంతి’ తీసుకోవాల్సి వచ్చింది. నాలుగో అతి పెద్ద రాజకీయ పక్షం జమాతే ఇస్లామీ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరణకు గురైన పార్టీ. 1971 నాటి యుద్ధ నేరస్తుల నేతృత్వంలోని పార్టీ. బీఎన్‌పీ నేతృత్వంలోని 17 ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరిస్తుండటంతో అమెరికా, రష్యా, ఈయూలు ఎన్నికల పరిశీలకులను పంపడానికి నిరాకరించాయి.
 
 అయితే ఏకపక్ష ఎన్నికలు బంగ్లాకు కొత్తేమీ కాదు. ఒకప్పటి స్నేహితులు, నేటి బద్ధ శత్రువులు హసీనా, ఖలీదాలు ఈ ఎన్నికలతో మూడుసార్లు ప్రధాని పీఠం దక్కించుకున్న సమ ఉజ్జీలయ్యారు. కానీ హసీనా 1996 నాటి ఖలీదా రికార్డును అందుకోలేక పోయారు. బీఎన్‌పీ అప్పుడు 300 స్థానాలకు 300 దక్కించుకోగలిగింది! నేడు హసీనా 232 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో మాజీ ప్రధాని ఎర్షాద్‌కు సైతం ఏకపక్ష ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఖ్యాతి ఉంది. ఇలాంటి ఎన్నికల ప్రహసనాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయనడంలో సందేహం లేదు. అంతమాత్రాన హసీనాను నియంతగానూ, ఖలీదాను ప్రజాస్వామ్య యోధురాలుగానూ జమకట్టేయలేం.  
 
 బహిష్కరణ రాజకీయం

 ఖలీదా నేతృత్వంలోని పార్టీలు ఎన్నికలను ఎందుకు బహిష్కరించినట్టు? సార్వత్రిక ఎన్నికలను తాత్కాలిక ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్వహించే పద్ధతికి హసీనా ప్రభుత్వం స్వస్తి పలికారు. ఆమె అధికారంలో ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని ఖలీదా ఆరోపణ. 15వ రాజ్యాంగ సవరణతో ఆపద్ధర్మ ప్రభుత్వం పద్ధతిని హసీనా రద్దు చేసిన మాట నిజమే. కానీ ప్రజలు ఎన్నుకోని వారు ప్రభుత్వాధికారాన్ని చలాయించడం రాజ్యాంగ విరుద్ధం.
 
  సదరు ఆపద్ధర్మ ప్రభుత్వ పద్ధతి సైతం బీఎన్‌పీ మిత్ర పక్షాల సభ్యులతో నిండిన ఏకపక్ష పార్లమెంటు 1996లో చేసిన రాజ్యాంగ సవరణ ఫలితమే. ఆపద్ధర్మ ప్రభుత్వ నిర్వహణలో ఎన్నికలు జరిగితే ఖలీదా చేతిలో హసీనా చిత్తయ్యేవారా? అలాంటి పరిస్థితే ఉంటే ఖలీదా నోట బహిష్కరణ మాటే వచ్చేదే కాదు. హసీనా పాలన  సంతృప్తికరమని ప్రజలు భావించడం లేదు నిజమే. అలా అని ప్రజలు బీఎన్‌పీకి పట్టంగట్టే పరిస్థితి లేదు. ‘దొంగల పార్టీ’గా బీఎన్‌పీ ఖ్యాతి ఇసుమంతైనా తగ్గలేదు. అవామీ, హసీనాలు అవినీతి మరక అంటక పరమ పవిత్రంగా ఉన్నవారూ కారు. ఈ ఐదేళ్ల కాలంలో హసీనా సన్నిహిత బంధువుల ఆస్తులు విపరీతంగా పెరిగాయని అందరికీ తెలి సిందే. అయినా అవామీకి ఇంకా ‘దొంగల పార్టీ’ బిరుదు దక్కలేదు. అంతకు మించి ఆ పార్టీ లౌకికవాద, ప్రజాస్వామిక స్వభావం దాని సానుకూలాంశం. 1971 నాటి యుద్ధ నేరస్తులకు మరణశిక్షలను విధించాలనే డిమాండుతో గత ఏడాది మొదట్లో పెల్లుబికిన షాబాగ్ ఉద్యమం... మతోన్మాద జమాతేకి, దాని అంగబలంతోనే హింసాత్మక రాజకీయాలను నడిపే బీఎన్‌పీకి కంటగింపయింది. ప్రత్యేకించి జమాతే మనుగడ కోసం బరితెగించి, హింసాకాండకు దిగింది. దాని ముసుగు సంస్థ హిఫాజత్ ఇస్లాం గత ఏడాది మే నుంచి దేశ వ్యాప్తంగా హింసాకాండను సృష్టిస్తోంది. అవామీ కార్యకర్తలపైనే గాక లౌకికవాదులందరిపైనా దాడులను సాగిస్తోంది. గత ఏడాది కాలంగా జమాతే, బీఎన్‌పీలు రేకెత్తించిన హింసాకాండలో కనీసం 500 మంది పౌరులు మరణించారు.
 
 ఎన్నికల ఫలితాల తర్వాత మరి 40 మంది బలయ్యారు. రాజ్యాంగ నిపుణులు తానియా అన్వర్ అన్నట్టు ‘‘నేడు మనం చూస్తున్న హింసాకాండలో, దాడుల్లో అత్యధిక భాగం రాజకీయ హింస కానే కాదు. కీలకమైన, వ్యూహాత్మక నిర్మాణాలపైన, కేంద్రాలపైన, మైనారిటీలపైన పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి. ఇది ఉగ్రవాదం. ఈ ఉగ్రవాద శక్తులతో బీఎన్‌పీ తెగదెంపులు చేసుకుని ముందుకు సాగాలి’’ ఖలీదా అలాంటి హిత వచనాలను వినే స్థితిలో లేరు. సాధ్యమైనంత త్వరగా హసీనా ప్రభుత్వాన్ని కూల్చే అరాటంలో ఉన్నారు. జమాతే, హిఫాజత్‌లను వదిలి.. మైనారిటీలపై దాడులకు అవామీయే కారణమంటూ మంగళవారం సైతం ఆమె ప్రత్యారోపణకు దిగారు.
 
 గెలిచి ఓడిన హసీనా

 భారత్, అమెరికాలు తూర్పు, పడమరల్లా పరస్పర విరుద్ధ వైఖరులను ప్రదర్శించే అరుదైన సందర్భాన్ని బంగ్లా ఎన్నికలు కల్పించాయి. ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని. తిరిగి ఎన్నికలు జరపాలని అమెరికా అంటే... పూర్తిగా నిబంధనలకు లోబడే జరిగాయి, ‘రాజ్యాంగపరమైన ఆవశ్యకతను’ నెరవేర్చాయి అంటూ భారత్ హసీనా గెలుపుకు ఆమోద ముద్ర వేసింది.
 
 
 తొమ్మిదవ పార్లమెంటు పదవీ కాలం ముగిసేసరికి ఎన్నికలు జరగాల్సిన రాజ్యాంగపరమైన ఆవశ్యకత ఉన్నా... హసీనా రాజకీయ సయోధ్యకు తగు కృషి చేసి ఉండాల్సిందని పలువురు విమర్శకులు భావిస్తున్నారు. పార్లమెంటు పదవీ కాలం ముగిశాక ఎన్నికలకు 90 రోజుల గడువు రాజ్యాంగబద్ధంగా వీలవుతుం దని బంగ్లా రాజ్యాంగ నిపుణులు ఆసిఫ్ నజ్రుల్, రఫీఖుల్ హఖ్, తానియా అన్వర్ వంటి వారు భావిస్తున్నారు. భారత్ అంటున్నట్టు నిబంధనల ప్రకారమే హసీనా ఎన్నికలు జరిపారు. కానీ లౌకికతత్వం, ప్రజాస్వామ్యం ముప్పును ఎదుర్కొంటున్న సమయంలో హసీనా అదే పనిగా ఇస్లామిక్ మతోన్మాదం బూచిని చూపి భయపెట్టి గెలవాలని ప్రయత్నించారు. అంతేగానీ జమాతే, హిఫాజత్‌లను ఏకాకులను చేసే రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించలేకపోయారు.
 
 ఒకవంక జమాతేపై 1971 నాటి యుద్ధ నేరాల విచారణకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి తేనె తుట్టెను కదిపారు. మరోవంక ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటును రద్దు చేసి మతతత్వవాదులకు, ఖలీదాకు ప్రజాస్వామ్య పరిరక్షకుల వేషం గట్టే అవకాశం కల్పించారు. అవామీ మద్దతుదార్లయిన ప్రజలు సైతం హసీనా ఆ విషయంలో తప్పు చేశారని భావిస్తున్నారు. తద్వారా ఆమె ఎన్నికలను బహిష్కరించడానికి సాకును సృష్టించి ఇచ్చారు. చివరికి హసీనా లౌకికవాద, ప్రజాస్వామ్యశక్తులకు దూరమై ఏకాకి అయ్యే పరిస్థితికి చేరువయ్యారు. ఖలీదా ఊహించని విధంగా తన బహిష్కరణ ఎత్తుగడలో ఇరుక్కుపోయారు. బయటపడే దారి కోసం అన్వేషిం చారు.
 
 దక్షిణ ఆసియాలో ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని హసీనా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న భారత్ చొరవ జూపి ఖలీదా గౌరవప్రదంగా ఆ ఇరకాటంలోంచి బయటపడేలా వారిద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించాల్సింది. హసీనా గెలుపంటేనే బంగ్లా ప్రజాస్వామ్యం, లౌకికతత్వాలు పదిలం కావడమన్నట్టు ప్రవర్తించిన మన విదేశాంగా శాఖ హ్రస్వ దృష్టికి మూల్యం చెల్లించక తప్పదు.
 
 ఈ ఎన్నికల్లో నిజమైన విజయం సాధించిన పక్షం ఏదైనా ఉందంటే జమాతే, హిఫాజత్‌ల మత ఛాందసవాదమే. ఎన్నికల తదుపరి హింసాకాండ, అస్థిరత ఇప్పట్లో సమసిపోయేలా లేవు. ఇప్పటికే అవి భారత వ్యతిరేక ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మనం తూర్పు సరిహద్దుల నుంచి కూడా సీమాంతర ఉగ్రవాదం సమస్యను ఎదుర్కోవాల్సిరావచ్చు. ఏది ఏమైనా ఇప్పటికైతే సైన్యం తటస్థంగానే ఉంది, అధికారం పగ్గాలు పట్టాలని ఆరట పడటం లేదు. అదే ఉన్న కాసింత ఊరట.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement