Bangladesh elections
-
Bangladesh: ఎన్నికలవేళ హసీనా తిరిగొస్తారు: సాజీబ్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగొస్తారని ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ వెల్లడించారు. ‘‘ బంగ్లా మధ్యంతర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన మరుక్షణమే ఆమె భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తారు’ అని వాజెద్ అన్నారు. ప్రస్తుతం హసీనా న్యూఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె బ్రిటన్‌లో ఆశ్రయం పొందాలని యోచిస్తున్నట్లు భారత మీడియా కథనాలు ప్రచురించింది. అయితే బ్రిటన్ హోం శాఖ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. బంగ్లాదేశ్ గురించి బ్రిటన్ విదేశాంగ మంత్రితో మాట్లాడానని, ఆయన ఎలాంటి వివరాలను పంచుకోలేదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం చెప్పారు. ఈ నేపథ్యంలో వాజెద్ మీడియాతో మాట్లాడారు. అనివార్య పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వాజెద్ ప్రకటించారు. -
బంగ్లాదేశ్: కొన్ని గంటల్లో ఎన్నికలు.. పోలింగ్ బూత్‌లు, స్కూళ్లకు నిప్పు
ఢాకా: బంగ్లాదేశ్‌లో జనవరి 7(ఆదివారం) రోజు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తున్నారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు బంగ్లాదేశ్‌లో ఆందోళనకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ అధికారులు ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్ కేంద్రాలు, ఐదు స్కూల్స్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దేశ రాజధాని ఢాకా శివారు ప్రాంతాలు, ఘాజీపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాద ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం జరగబోయే సార్వత్రిక ఎన్నికల విఘాతం కలిగించాలనే లక్ష్యంతో గుర్తు తెలియని దుండుగులు పొలింగ్ బూత్‌లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాము ఈ ఘటనను పరిశీలించామని, పూర్తిగా అప్రమత్తతతో ఉన్నామని ఘాజీపూర్ పోలీసు ఉన్నతాధికారి ఖాజీ షఫీకుల్ ఆలం తెలిపారు. దీనికంటే ముందు ఓ రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే మరోవైపు దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (BNP) వరుసగా మూడోసారి బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రధానమంత్రి షేక్ హసీనా ఈసారి కూడా తన అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు పోలింగ్ అనే సమయంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలు తీవ్ర ఉద్రిక్తతతలకు దారితీస్తోంది. ఇక.. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. చదవండి: బంగ్లా సుస్థిరత కొనసాగేనా? -
బంగ్లా సుస్థిరత కొనసాగేనా?
భారత్‌కు సన్నిహిత పొరుగుదేశం, నమ్మదగిన భాగస్వామి అయిన బంగ్లాదేశ్‌లో జనవరి 7న ఎన్నికలు జరగనున్నాయి. 2009 నుంచి దేశ ప్రధానిగా అప్రతిహతంగా కొనసాగుతున్న షేక్ హసీనా ఈసారి కూడా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. అయితే, ఎన్నికలు స్వేచ్ఛగా జరగడం లేదనీ, హసీనా ఇటీవలి సంవత్సరాలలో నియంతగా మారిందనీ ఆమె విమర్శకులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఆమె పదవీకాలం బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరతను తెచ్చిపెట్టింది. గత దశాబ్దంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. గడచిన 20 ఏళ్లలో 2.5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. జనవరి 7న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పాలక అవామీ లీగ్ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఎన్నికలను బహిష్కరించడం వల్ల ఈ పని మరింత సులభమవుతోంది. స్వతంత్ర అభ్యర్థులతో పాటు కొన్ని చిన్న, పెద్దగా పేరులేని రాజకీయ పార్టీలు అధికార పక్షానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నప్పటికీ, అవి పెద్ద సవాలుగా మారే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి అఖండ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే, బీఎన్ పీ ఈ ఎన్నికలలో పాల్గొనక పోవడం అనేది అవామీ లీగ్ సాధించనున్న విజయంలోని ఆకర్షణను అయితే కచ్చితంగా తగ్గిస్తుంది. బేగమ్‌ల పోరు బంగ్లాదేశీయులు దేశ పితామహుడిగా భావించే షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె అయిన షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. సైనిక నియంత జియావుర్ రెహమాన్ భార్య ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సారథ్యం వహిస్తు న్నారు. ఈ ఇద్దరు మహిళలను బంగ్లాదేశ్‌లోని పరస్పరం పోరాడు తున్న బేగమ్‌లు (‘బ్యాట్లింగ్ బేగమ్స్’) అని కూడా పిలుస్తారు. బంగ్లాదేశ్‌లో 1990లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ తర్వాత జరి గిన తొలి మూడు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వంతులవారీగా అధికారంలో ఉన్నాయి. అయితే 2009 నుంచి దేశానికి హసీనా సారథ్యం వహిస్తున్నారు. గత దశాబ్దపున్నర కాలంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని విమర్శకులు ఆరోపించారు. 2014 ఎన్నికలను బహిష్కరించడం బీఎన్ పీ చేసిన తప్పిదమనీ, అవామీ లీగ్ భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకోవడానికి అది వీలు కల్పించిందనీ కొందరు అంటున్నారు. ఈ నిర్ణయం బీఎన్ పీనీ, దాని అగ్రనేతలనూ పార్లమెంటుకు చాలాకాలం పాటు దూరంగా ఉంచింది. ఖలీదా, తారిఖ్ రెహమాన్ (ఖలీదా కుమారుడు, రాజకీయ వారసుడు) సహా చాలా మంది నాయకులు అవినీతి కేసుల్లో చిక్కు కోవడంతో పార్టీ మరింత అపఖ్యాతి పాలైంది. వారి అక్రమాలకు సంబంధించి విచారణ జరిపి వారికి శిక్ష విధించారు. రెహమాన్ బంగ్లాదేశ్ రాజకీయాలతో సంబంధం లేకుండా లండన్‌లో ఉంటు న్నారు. ఖలీదా గృహనిర్భంధంలో ఉన్నారు; పైగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆమె తన పార్టీ రాజకీయ అదృష్టాన్ని పునరుద్ధరించడం కష్టమైపోయింది. మునుపటి ఎన్నికలకు ముందు బీఎన్ పీ హింసాత్మక చర్యల్లో పాల్గొంది. ఇది బీఎన్ పీకి చెందిన మరికొందరు అగ్రనేతలను విచారించే అవకాశాన్ని కూడా అవామీ లీగ్‌కు ఇచ్చింది. ఫలితంగా పార్టీ ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది. అవామీ లీగ్‌ను ఏ విధంగానూ ఎదుర్కొనే స్థితిలో లేదు. ఆపద్ధర్మం స్థానంలో... బీఎన్ పీ కూటమి కీలక భాగస్వామి అయిన బంగ్లాదేశ్ జమాత్– ఎ–ఇస్లామీని ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించారు. పార్లమెంటరీ చట్టాలపై తమకు నమ్మకం లేదనీ, ఇస్లామిక్ చట్టం, పాలనకు మాత్రమే కట్టుబడి ఉన్నామనీ ఆ పార్టీ పదేపదే ప్రకటించింది. దీంతో బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం జమాత్ పార్టీ రిజిస్ట్రేషన్ ని రద్దు చేసింది. హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన యుద్ధ నేరాల విచారణ నేపథ్యంలో జమాతే ఇస్లామీ అగ్రనేతలకు ఉరిశిక్షలు పడ్డాయి. దాంతో పార్టీ మరింత నష్టపోయింది. సార్వత్రిక ఎన్నికలను తటస్థ మధ్యంతర ప్రభుత్వం నిర్వహించాలని బీఎన్ పీ డిమాండ్ చేస్తోంది. హసీనా ప్రభుత్వం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించదని ఆ పార్టీ భయపడుతోంది. అయితే ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించడం లేదు. 2018 ఎన్నికలలో పాల్గొనడం ద్వారా తాము తప్పు చేశామని బీఎన్ పీ ఇప్పుడు నమ్ముతోంది. 2011లో 15వ రాజ్యాంగ సవరణ ద్వారా తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటును అవామీ లీగ్ ప్రభుత్వం తొలగించింది. అంతకు ముందు ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన పార్టీకి అధికారాన్ని అప్పగించేది. ఏది ఏమైనప్పటికీ, తాత్కాలిక ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు (2007–09) కొనసాగింది, సాధారణ ప్రభుత్వం వలె పనిచేయడమే కాకుండా దాని అధికార పరిధికి మించిన అనేక చర్యలు కూడా తీసుకుంది. అలాగే హసీనా, ఖలీదాలను కూడా విచారించింది. స్పష్టంగా, ఆపద్ధర్మ ప్రభుత్వం తప్పు చేయలేని వ్యవస్థ అయితే కాదు. అందుకే బంగ్లాదేశ్ ఇతర ప్రజా స్వామ్య దేశాలలో మాదిరిగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించగల సంస్థలతో ముందుకు రావాలి. నిశ్శబ్ద విజయాలు ఉన్నప్పటికీ... షేక్ హసీనా ఇటీవలి సంవత్సరాలలో నియంతగా మారిందని ఆమె విమర్శకులు ఆరోపిస్తుండగా, ఆమె పదవీకాలం బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరతను తెచ్చిపెట్టిందన్నది మరో నిజం. ఇది బంగ్లాదేశ్‌కూ, దాని ప్రజలకూ ప్రయోజనకరంగా నిరూపితమైంది. దేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని చవిచూస్తోంది. దక్షిణాసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో బంగ్లాదేశ్ ఒకటి. గత దశాబ్దంలో దాని తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. గత 20 ఏళ్లలో 2.5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అనేక ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా హసీనా ప్రభుత్వం అమలు చేసింది. దేశ సొంత ఆర్థిక వనరులు, రుణాలు, అభివృద్ధి సహాయాల కలయికతో, కీలకమైన 2.9 బిలియన్ డాలర్ల పద్మ వంతెనను గంగానదిపై నిర్మించారు. ఈ వంతెన ఒక్కటే దేశ జీడీపీని 1.23 శాతం పెంచడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. ఈ విజయాలు ఉన్నప్పటికీ, కోవిడ్ –19 మహమ్మారి నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. నవంబరులో ద్రవ్యోల్బణం 9.5 శాతానికి చేరుకోవడంతో పెరుగుతున్న జీవన వ్యయంతో దేశం పోరాడుతోంది. విదేశీ మారక నిల్వలు ఆగస్టు 2021లో రికార్డు స్థాయిలో 48 బిలియన్ల డాలర్ల నుండి ఇప్పుడు దాదాపు 20 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇవి మూడు నెలల దిగుమతులకు కూడా సరిపోవు. అదనంగా, దాని విదేశీ రుణం 2016 నుండి రెట్టింపు అయింది. అయితే, భారతదేశం అవసరమైన వస్తువులను సరఫరా చేయడం ద్వారా బంగ్లాదేశ్‌కు సహాయం చేసింది. దశాబ్దపున్నర కాలంగా బంగ్లాదేశ్‌లో ఉన్న రాజకీయ సుస్థిరత ఆర్థికాభివృద్ధికి కారణమైందనడంలో సందేహం లేదు. భారతదేశం, బంగ్లాదేశ్ ఇప్పుడు మరింతగా ఎక్కువ స్థాయి విశ్వాసాన్ని కలిగివున్న భాగస్వామ్య పక్షాలు. దీని ఫలితంగా ఇరు దేశాల మధ్య మెరుగైన రైలు కనెక్టివిటీ, ద్వైపాక్షిక వాణిజ్యం ఏర్పడింది. అయితే, చైనా నేతృత్వంలోని అంతర్జాతీయ వాణిజ్య కూటమి, రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో బంగ్లాదేశ్ ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో పొరుగుదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలపై భారత్‌ను జాగ్రత్తగా నడుచుకునేలా చేసింది. భారతదేశం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించాక పరిస్థితులు తనకు అనుకూలంగా పని చేస్తాయని ఆశిస్తోంది. ఆనంద్ కుమార్ వ్యాసకర్త అసోసియేట్ ఫెలో, మనోహర్ పారీకర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసెస్, న్యూఢిల్లీ -
హసీనా అఖండ విజయం
గత ఏడాది దక్షిణాసియాలోని మూడు దేశాల్లో–పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్– చట్టసభలకు ఎన్నికలు జరిగాయి. ఎవరు గెలిచి అధికారంలోకొచ్చినా సైన్యానిదే పైచేయి అయ్యే పాకిస్తాన్ సంగతలా ఉంచితే, మాల్దీవుల్లో అడుగడుగునా భారత వ్యతిరేకతను ప్రదర్శించిన అబ్దుల్లా యామీన్ ఓడిపోయి, విపక్ష కూటమి అభ్యర్థి సోలిహ్ దేశాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఆదినుంచీ మనకు మిత్ర దేశంగా ఉన్న బంగ్లాదేశ్‌లో సైతం ఇప్పుడు ప్రధాని షేక్ హసీనా వాజెద్ నేతృత్వంలోని అవామీ లీగ్ కూటమి అఖండ విజయం సాధించింది. ఇప్పటికే వరసగా రెండు దఫాలనుంచి అధికారంలో కొనసాగుతున్న హసీనా మూడోసారి కూడా విజేత కావడం మనకు అనుకూల పరిణామం. బంగ్లాదేశ్‌లో మిలిటెన్సీ బలపడితే దాని ప్రభావం పశ్చిమ బెంగాల్‌పైనా, ఈశాన్య రాష్ట్రాలపైనా ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అందుకోసం తెగ ప్రయత్నిస్తోంది. మన దేశం బంగ్లా ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతోపాటు ఉగ్రవాదంపై ఎప్పటికప్పుడు దాన్ని అప్రమత్తం చేస్తూ ఆ ప్రయత్నాలను వమ్ము చేస్తోంది. బంగ్లా సైతం మూడో దేశం ప్రమేయానికి తావీయకుండా మనకు చెక్కుచెదరని మిత్ర దేశంగా ఉంటున్నది. అవామీ లీగ్ కూటమికి వచ్చిన విజయం అసాధారణమైనది. ఊహకందనిది. పార్లమెంటులోని 300 స్థానాల్లో ఆ కూటమి 299 చోట్ల పోటీచేయగా ఏకంగా 96 శాతం సీట్లు...అంటే 288 వచ్చాయి. ఈ సందర్భంగా హసీనా గెలుపును గురించి చెప్పుకోవాలి. ఆమెకు మొత్తం 2,29,539 ఓట్లు రాగా, ప్రత్యర్థి పక్షమైన బంగ్లా నేషనల్ పార్టీ(బీఎన్పీ) అభ్యర్థికి కేవలం 123 ఓట్లు లభించాయి. మరో అభ్యర్థికి 71 ఓట్లు వచ్చాయి. మొన్న డిసెంబర్ 30న పోలింగ్ పూర్తయిన వెంటనే ‘నిశ్శబ్ద ప్రజా వెల్లువ’ బ్యాలెట్ పెట్టెల్ని ముంచెత్తిందని అభివర్ణించిన బీఎన్పీ ఆధ్వర్యంలోని జాతీయ ఐక్య ఫ్రంట్ చివరకు ఏడంటే ఏడు స్థానాలకు పరిమితమై అందరినీ విస్మయపరచడంతోపాటు తానూ అయోమయంలో పడిపోయింది. అధికార అవామీ లీగ్ ‘ఇది ప్రజా తీర్పు’ అంటుంటే...‘అంతా మోసం, దగా’ అని విపక్షాలు ఆక్రోశిస్తున్నాయి. తిరిగి ఎన్నికలు జరపాలని డిమాండు చేస్తున్నాయి. ఈ ఫలితాలను న్యాయస్థానాల్లో సవాలు చేస్తామంటున్నాయి. ఈ ఎన్నికల్లో హింస విస్తృతంగా జరిగిన మాట వాస్తవం. అయితే 18మంది మృతుల్లో అవామీ పార్టీ కార్యకర్తలే అధికం. బంగ్లా ఎన్నికల్లో రివాజుగా ఉండే భారత వ్యతిరేక ప్రచారం ఈసారి లేకపోవడం గమనించదగ్గది. భారత్‌ను దూరం చేసుకోవడం మంచిది కాదని విపక్ష బీఎన్పీ కూడా భావించడంవల్లే ఈ మార్పు. ఈ ఎన్నికల్లో తొలిసారి ప్రయోగాత్మకంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలు ఉపయోగించారు. మన దేశంతోసహా వేర్వేరు దేశాలకు చెందిన 175మంది నిపుణులు ఈ ఎన్నికలకు పరిశీలకులుగా వచ్చారు. వీరంతా వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్టు ఎక్కడా తమ దృష్టికి రాలేదని చెప్పారు. కానీ ఒక మీడియా ప్రతినిధికి రెండు మూడుచోట్ల పోలింగ్ కేంద్రాల్లో అసలు విపక్షాల ఏజెంట్లే కనబడలేదు. వాస్తవానికి ఈ స్థాయిలో హసీనా నేతృత్వంలోని కూటమికి అసాధారణ మెజారిటీ రావడంపై అనుమానాలున్నాయి తప్ప ఆమె నెగ్గే అవకాశమే లేదని ఎవరూ అనడం లేదు. విపక్షాలు క్రితంసారి ఎన్నికలను బహిష్కరించినప్పుడు సైతం ఆ కూటమి 234 స్థానాలు గెల్చుకుంది. ఇప్పుడు ఆ పక్షాలన్నీ రంగంలో ఉన్నాయి గనుక మెజారిటీ తగ్గొచ్చునని కొందరు అంచనాలు వేశారు. కానీ అందుకు భిన్నంగా రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకోవడమే అందరినీ అయోమయానికి గురిచేసింది. తమ పార్టీ గెలుపును సమర్థించుకోవడానికి హసీనా మన బీజేపీ, కాంగ్రెస్‌లను ఉదహరిస్తున్నారు. నాయకుడెవరో తెలియని పార్టీలకు ఓట్లేయరని వివరిస్తున్నారు. ఈ పోలికల మాటెలా ఉన్నా గత పదేళ్లుగా హసీనా అవలంబించిన ఆర్థిక విధానాలు బంగ్లా ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకొచ్చాయన్నది వాస్తవం. పేదరికం గణనీయంగా తగ్గింది. ఆహారభద్రత ఏర్పడింది. సార్వత్రిక ప్రాథమిక విద్య వంటి అంశాల్లో దేశం ముందంజలో ఉంది. అతి తక్కువ అభివృద్ధి సాధించిన దేశాల జాబితా నుంచి బంగ్లాదేశ్ తప్పుకుని వర్ధమాన దేశాల జాబితాలో చేరింది. అవినీతి నిర్మూలనలో, ఛాందసవాద మిలిటెంట్ల ఆగడాలను అదుపు చేయడంలో కఠినంగా వ్యవహరించింది. అలాగని అంతా సవ్యంగా ఉన్నదని చెప్పడం అవాస్తవమవుతుంది. భావప్రకటనా స్వేచ్ఛకు ఆటంకాలు, విచ్చలవిడి ఎన్కౌంటర్లు, మనుషుల్ని అదృశ్యం చేయడం వంటివి ప్రభుత్వ తీరుతెన్నుల్ని ప్రశ్నార్థకం చేశాయి. బీఎన్పీ అధినేత ఖలీదాతోసహా ఎందరో నేతల్ని అవినీతి కేసుల్లో శిక్షలు పడేలా చేయగలిగామని చెబుతున్నా...స్వపక్షం అవినీతి విషయంలో హసీనా సర్కారు ఉదాసీనంగా ఉంటోంది. భూ కబ్జాలు, మెగా ప్రాజెక్టుల్లో స్వాహాలు, పబ్లిక్ రంగ సంస్థల్లో అవినీతి, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో విచ్చలవిడిగా రుణాల మంజూరు, ఎగవేతదార్లపై చర్యలు తీసుకోకపోవడం వగైరాలు ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నాయి. మిలిటెన్సీని అణిచేస్తున్నామని చెబుతున్నా సెక్యులర్ విలువలున్న కళాకారులు, రచయితలపై ఆ సంస్థల దాడులు తగ్గలేదు. ఏదో ఒక సాకుతో విపక్ష నేతల్ని, వారి మద్దతుదార్లను జైళ్లలోకి నెట్టి ఆ పార్టీలకు నాయకత్వమే లేకుండా చేసిన తీరు ఎన్నికల ప్రక్రియపైనే సందేహాలు రేకెత్తించింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సంయమనం పాటించాలని తమ శ్రేణులకు హసీనా పిలుపునిచ్చారు. మంచిదే. కానీ వచ్చే అయిదేళ్లలో ప్రభుత్వం సైతం అదే రీతిలో మెలగాలి. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు జనం మనసుల్ని గెల్చుకుని ఉండొచ్చుగానీ, ప్రభుత్వం అదే పనిగా నియంతృత్వ పోకడలకు పోతున్నదన్న అభిప్రాయం కలిగిస్తే మున్ముందు అది ఆమె పార్టీపైన మాత్రమే కాదు...మొత్తంగా ప్రజాస్వామిక వ్యవస్థపైనే అవిశ్వాసాన్ని ఏర్పరుస్తుంది. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా చూస్తేనే, అందరినీ కలుపుకొని వెళ్తేనే బంగ్లాదేశ్ చరిత్రలో హసీనా సమర్థ ప్రధానిగా శాశ్వతంగా నిలిచిపోతారు. -
ఎంపీగా గెలిచిన బంగ్లా కెప్టెన్
ఢాకా : బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ మష్రఫె మొర్తజా రాజకీయ ఇన్నింగ్స్ ఆరంభించాడు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందాడు. ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ పార్టీ తరఫున నరైల్-2 లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈ బంగ్లా కెప్టెన్ ఘన విజయం సాధించాడు. 35 ఏళ్ల మొర్తాజాకు మొత్తం 2,74,418 ఓట్లు రాగా, అతడి సమీప ప్రత్యర్థికి 8,006 ఓట్లు వచ్చాయి. తద్వారా క్రికెట్ ఆడుతూనే ఎంపీగా గెలిచిన వ్యక్తిగా మొర్తాజా చరిత్రకెక్కాడు. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో అధికార అవామీ లీగ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దేశంలోని మొత్తం 300 స్థానాలకు గాను అవామీ లీగ్ ఏకంగా 288 స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన మొర్తజా.. విండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు చిన్న హింట్ ఇచ్చాడు. అనుకున్నట్లే అవామీ లీగ్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందాడు. దీంతో 2019 ప్రపంచకప్ తర్వాత ఈ పేసర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఇక క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదే కొత్తకాదు. కానీ వచ్చిన వారంతా రిటైర్మెంట్ అనంతరమే రాజకీయ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. కానీ మొర్తజా మాత్రం కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు. -
ఎన్నికల బరిలో క్రికెటర్!
ఢాకా : బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ మష్రఫె మొర్తజా రాజకీయ ఇన్నింగ్స్ ఆరంభించబోతున్నాడు. వచ్చే నెల బంగ్లాదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో మొర్తజా పోటీ చేస్తున్నట్లు సోమవారం ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న బంగ్లాదేశ్‌లో మొర్తజాకు విపరీతమైన క్రేజ్ ఉంది. అధికార పార్టీ అయిన అవామీ లీగ్ తరుపునే మొర్తజా బరిలోకి దిగుతున్నాడు. రాజకీయాల్లోకి రావాలన్న మొర్తజా నిర్ణయానికి ప్రధాని హసీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవామీ లీగ్ అధికార ప్రతినిధి మహబూబుల్ అలం హనీఫ్ తెలిపారు. మొర్తజా తన సొంత జిల్లా అయిన పశ్చిమ బంగ్లాదేశ్‌లోని నరైలీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక రాజకీయాల్లోకి వెళ్లాలన్న క్రికెటర్ల ప్రయత్నాన్ని అడ్డుకోబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అటు రాజకీయాలు, ఇటు కెరీర్‌ను మోర్తాజా బ్యాలెన్స్ చేసుకోగలడని తాము విశ్వసిస్తున్నట్టు బోర్డు అధికార ప్రతినిధి జలాల్ యూనుస్ తెలిపారు. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన మొర్తజా 2019 ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రాజకీయాల్లోకి రావాలనే అతని నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అభిమానులు మోర్తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. ఇక క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదే కొత్తకాదు. కానీ వచ్చిన వారంతా రిటైర్మెంట్ అనంతరమే రాజకీయ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. కానీ మొర్తజా మాత్రం కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నాడు. -
బంగ్లా బ్యాలెట్‌పై నెత్తుటి మరక
విశ్లేషణ: పిళ్లా వెంకటేశ్వరరావు ‘అవామీ లీగ్ గెలిస్తే షేక్ హసీనాతోపాటూ ఓ గుప్పెడు మంది గెలుస్తారు, ఓడిపోతే మొత్తంగా బంగ్లాదేశ్ ఓడిపోతుంది’ అని ప్రముఖ బంగ్లా కవి, రచయిత, విమర్శకుడు అహ్మద్ సోఫా అపుడెప్పుడో అన్నారు. అవామీ లీగ్, హసీనాలు గెలిచినా బంగ్లాదేశ్ ఓడిపోయే ప్రమాదం ఉన్నదనే చేదు నిజాన్ని గుర్తించడానికి నేడు ఆయన లేరు. జనవరి 5న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని హసీనా, ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ ఘన విజయాన్ని సాధించాయి. విజయోత్సవ వేడుకలు మాత్రం లేవు. 2009లోలాగా ఓటింగ్ రోజున పోలింగ్ స్టేషన్లవద్ద బారులు తీరిన ఓటర్లు లేరు. వచ్చిన వారు కూడా భయం భయంగానే వచ్చారు. రాని వారిలో చాలా మంది భయంతోనే రాలేదు. రాజ ధాని ఢాకాలో సైతం ఎన్నికల సందడి లేదు. అక్కడున్న 20 పార్లమెంటరీ స్థానాలకు ఐదు చోట్లే ఎన్నికలు జరిగాయి. మిగతా అన్నీ ‘ఏకగ్రీవ’ ఎన్నికలే. మొత్తం 300 స్థానాల్లో 154 ఏకగ్రీవ ఎన్నికలు. అందులో 127, మొత్తం స్థానాల్లో నాలుగింట మూడువంతులు అధికార పార్టీ ఖాతాలోనే. అయినా అవామీ నేతలు విజయోత్సవాలు జరుపుకోడానికి సిగ్గుపడుతున్నారు. దాదాపు పాతికేళ్లుగా బంగ్లా రాజకీయాలను శాసిస్తున్న అవామీ, బీఎన్‌పీలు బరిలోకి దిగి కలబడకుండానే... దక్కిన విజయం అతి చప్పగా అనిపించడం సహజమే. దేశవ్యాప్తంగా ఎన్నికల తదుపరి చెలరేగుతున్న హింసాకాండలో ఇప్పటికే 30 మందికి పైగా మరణించారు. అఖండ విజయం దక్కించుకున్న ఆ పార్టీ అధికారంలో ఉండేదెన్నాళ్లనేది అప్పుడే చర్చనీయాంశంగా మారింది. ఏకపక్ష ఎన్నికల ‘సంప్రదాయం’ మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఎన్నికలను బహిష్కరించింది. మూడో అతిపెద్ద పక్షమైన జాతీయ పార్టీ అధినేత, మాజీ ప్రధాని, నియంత మొహ్మద్ హుస్సేన్ ఎర్షాద్... హసీనా, ఖలీదాల మధ్య అటూ ఇటూ మూడు మొగ్గలేసి... బహిష్కరణ మంత్రం పఠించారు. పర్యవసానంగా ఎన్నికలు ముగిసే వరకు సైనిక ఆసుపత్రిలో ‘విశ్రాంతి’ తీసుకోవాల్సి వచ్చింది. నాలుగో అతి పెద్ద రాజకీయ పక్షం జమాతే ఇస్లామీ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరణకు గురైన పార్టీ. 1971 నాటి యుద్ధ నేరస్తుల నేతృత్వంలోని పార్టీ. బీఎన్పీ నేతృత్వంలోని 17 ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరిస్తుండటంతో అమెరికా, రష్యా, ఈయూలు ఎన్నికల పరిశీలకులను పంపడానికి నిరాకరించాయి. అయితే ఏకపక్ష ఎన్నికలు బంగ్లాకు కొత్తేమీ కాదు. ఒకప్పటి స్నేహితులు, నేటి బద్ధ శత్రువులు హసీనా, ఖలీదాలు ఈ ఎన్నికలతో మూడుసార్లు ప్రధాని పీఠం దక్కించుకున్న సమ ఉజ్జీలయ్యారు. కానీ హసీనా 1996 నాటి ఖలీదా రికార్డును అందుకోలేక పోయారు. బీఎన్పీ అప్పుడు 300 స్థానాలకు 300 దక్కించుకోగలిగింది! నేడు హసీనా 232 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో మాజీ ప్రధాని ఎర్షాద్కు సైతం ఏకపక్ష ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఖ్యాతి ఉంది. ఇలాంటి ఎన్నికల ప్రహసనాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయనడంలో సందేహం లేదు. అంతమాత్రాన హసీనాను నియంతగానూ, ఖలీదాను ప్రజాస్వామ్య యోధురాలుగానూ జమకట్టేయలేం. బహిష్కరణ రాజకీయం ఖలీదా నేతృత్వంలోని పార్టీలు ఎన్నికలను ఎందుకు బహిష్కరించినట్టు? సార్వత్రిక ఎన్నికలను తాత్కాలిక ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్వహించే పద్ధతికి హసీనా ప్రభుత్వం స్వస్తి పలికారు. ఆమె అధికారంలో ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని ఖలీదా ఆరోపణ. 15వ రాజ్యాంగ సవరణతో ఆపద్ధర్మ ప్రభుత్వం పద్ధతిని హసీనా రద్దు చేసిన మాట నిజమే. కానీ ప్రజలు ఎన్నుకోని వారు ప్రభుత్వాధికారాన్ని చలాయించడం రాజ్యాంగ విరుద్ధం. సదరు ఆపద్ధర్మ ప్రభుత్వ పద్ధతి సైతం బీఎన్పీ మిత్ర పక్షాల సభ్యులతో నిండిన ఏకపక్ష పార్లమెంటు 1996లో చేసిన రాజ్యాంగ సవరణ ఫలితమే. ఆపద్ధర్మ ప్రభుత్వ నిర్వహణలో ఎన్నికలు జరిగితే ఖలీదా చేతిలో హసీనా చిత్తయ్యేవారా? అలాంటి పరిస్థితే ఉంటే ఖలీదా నోట బహిష్కరణ మాటే వచ్చేదే కాదు. హసీనా పాలన సంతృప్తికరమని ప్రజలు భావించడం లేదు నిజమే. అలా అని ప్రజలు బీఎన్పీకి పట్టంగట్టే పరిస్థితి లేదు. ‘దొంగల పార్టీ’గా బీఎన్పీ ఖ్యాతి ఇసుమంతైనా తగ్గలేదు. అవామీ, హసీనాలు అవినీతి మరక అంటక పరమ పవిత్రంగా ఉన్నవారూ కారు. ఈ ఐదేళ్ల కాలంలో హసీనా సన్నిహిత బంధువుల ఆస్తులు విపరీతంగా పెరిగాయని అందరికీ తెలి సిందే. అయినా అవామీకి ఇంకా ‘దొంగల పార్టీ’ బిరుదు దక్కలేదు. అంతకు మించి ఆ పార్టీ లౌకికవాద, ప్రజాస్వామిక స్వభావం దాని సానుకూలాంశం. 1971 నాటి యుద్ధ నేరస్తులకు మరణశిక్షలను విధించాలనే డిమాండుతో గత ఏడాది మొదట్లో పెల్లుబికిన షాబాగ్ ఉద్యమం... మతోన్మాద జమాతేకి, దాని అంగబలంతోనే హింసాత్మక రాజకీయాలను నడిపే బీఎన్పీకి కంటగింపయింది. ప్రత్యేకించి జమాతే మనుగడ కోసం బరితెగించి, హింసాకాండకు దిగింది. దాని ముసుగు సంస్థ హిఫాజత్ ఇస్లాం గత ఏడాది మే నుంచి దేశ వ్యాప్తంగా హింసాకాండను సృష్టిస్తోంది. అవామీ కార్యకర్తలపైనే గాక లౌకికవాదులందరిపైనా దాడులను సాగిస్తోంది. గత ఏడాది కాలంగా జమాతే, బీఎన్‌పీలు రేకెత్తించిన హింసాకాండలో కనీసం 500 మంది పౌరులు మరణించారు. ఎన్నికల ఫలితాల తర్వాత మరి 40 మంది బలయ్యారు. రాజ్యాంగ నిపుణులు తానియా అన్వర్ అన్నట్టు ‘‘నేడు మనం చూస్తున్న హింసాకాండలో, దాడుల్లో అత్యధిక భాగం రాజకీయ హింస కానే కాదు. కీలకమైన, వ్యూహాత్మక నిర్మాణాలపైన, కేంద్రాలపైన, మైనారిటీలపైన పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి. ఇది ఉగ్రవాదం. ఈ ఉగ్రవాద శక్తులతో బీఎన్పీ తెగదెంపులు చేసుకుని ముందుకు సాగాలి’’ ఖలీదా అలాంటి హిత వచనాలను వినే స్థితిలో లేరు. సాధ్యమైనంత త్వరగా హసీనా ప్రభుత్వాన్ని కూల్చే అరాటంలో ఉన్నారు. జమాతే, హిఫాజత్‌లను వదిలి.. మైనారిటీలపై దాడులకు అవామీయే కారణమంటూ మంగళవారం సైతం ఆమె ప్రత్యారోపణకు దిగారు. గెలిచి ఓడిన హసీనా భారత్, అమెరికాలు తూర్పు, పడమరల్లా పరస్పర విరుద్ధ వైఖరులను ప్రదర్శించే అరుదైన సందర్భాన్ని బంగ్లా ఎన్నికలు కల్పించాయి. ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని. తిరిగి ఎన్నికలు జరపాలని అమెరికా అంటే... పూర్తిగా నిబంధనలకు లోబడే జరిగాయి, ‘రాజ్యాంగపరమైన ఆవశ్యకతను’ నెరవేర్చాయి అంటూ భారత్ హసీనా గెలుపుకు ఆమోద ముద్ర వేసింది. తొమ్మిదవ పార్లమెంటు పదవీ కాలం ముగిసేసరికి ఎన్నికలు జరగాల్సిన రాజ్యాంగపరమైన ఆవశ్యకత ఉన్నా... హసీనా రాజకీయ సయోధ్యకు తగు కృషి చేసి ఉండాల్సిందని పలువురు విమర్శకులు భావిస్తున్నారు. పార్లమెంటు పదవీ కాలం ముగిశాక ఎన్నికలకు 90 రోజుల గడువు రాజ్యాంగబద్ధంగా వీలవుతుం దని బంగ్లా రాజ్యాంగ నిపుణులు ఆసిఫ్ నజ్రుల్, రఫీఖుల్ హఖ్, తానియా అన్వర్ వంటి వారు భావిస్తున్నారు. భారత్ అంటున్నట్టు నిబంధనల ప్రకారమే హసీనా ఎన్నికలు జరిపారు. కానీ లౌకికతత్వం, ప్రజాస్వామ్యం ముప్పును ఎదుర్కొంటున్న సమయంలో హసీనా అదే పనిగా ఇస్లామిక్ మతోన్మాదం బూచిని చూపి భయపెట్టి గెలవాలని ప్రయత్నించారు. అంతేగానీ జమాతే, హిఫాజత్‌లను ఏకాకులను చేసే రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించలేకపోయారు. ఒకవంక జమాతేపై 1971 నాటి యుద్ధ నేరాల విచారణకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి తేనె తుట్టెను కదిపారు. మరోవంక ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటును రద్దు చేసి మతతత్వవాదులకు, ఖలీదాకు ప్రజాస్వామ్య పరిరక్షకుల వేషం గట్టే అవకాశం కల్పించారు. అవామీ మద్దతుదార్లయిన ప్రజలు సైతం హసీనా ఆ విషయంలో తప్పు చేశారని భావిస్తున్నారు. తద్వారా ఆమె ఎన్నికలను బహిష్కరించడానికి సాకును సృష్టించి ఇచ్చారు. చివరికి హసీనా లౌకికవాద, ప్రజాస్వామ్యశక్తులకు దూరమై ఏకాకి అయ్యే పరిస్థితికి చేరువయ్యారు. ఖలీదా ఊహించని విధంగా తన బహిష్కరణ ఎత్తుగడలో ఇరుక్కుపోయారు. బయటపడే దారి కోసం అన్వేషిం చారు. దక్షిణ ఆసియాలో ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని హసీనా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న భారత్ చొరవ జూపి ఖలీదా గౌరవప్రదంగా ఆ ఇరకాటంలోంచి బయటపడేలా వారిద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించాల్సింది. హసీనా గెలుపంటేనే బంగ్లా ప్రజాస్వామ్యం, లౌకికతత్వాలు పదిలం కావడమన్నట్టు ప్రవర్తించిన మన విదేశాంగా శాఖ హ్రస్వ దృష్టికి మూల్యం చెల్లించక తప్పదు. ఈ ఎన్నికల్లో నిజమైన విజయం సాధించిన పక్షం ఏదైనా ఉందంటే జమాతే, హిఫాజత్ల మత ఛాందసవాదమే. ఎన్నికల తదుపరి హింసాకాండ, అస్థిరత ఇప్పట్లో సమసిపోయేలా లేవు. ఇప్పటికే అవి భారత వ్యతిరేక ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మనం తూర్పు సరిహద్దుల నుంచి కూడా సీమాంతర ఉగ్రవాదం సమస్యను ఎదుర్కోవాల్సిరావచ్చు. ఏది ఏమైనా ఇప్పటికైతే సైన్యం తటస్థంగానే ఉంది, అధికారం పగ్గాలు పట్టాలని ఆరట పడటం లేదు. అదే ఉన్న కాసింత ఊరట.