విమానంలో పేలుడు: రష్యా 'రెడ్ అలర్ట్' | Russia suspends flights to Egypt, citing security | Sakshi
Sakshi News home page

విమానంలో పేలుడు: రష్యా 'రెడ్ అలర్ట్'

Published Sat, Nov 7 2015 9:35 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

విమానంలో పేలుడు: రష్యా 'రెడ్ అలర్ట్'

విమానంలో పేలుడు: రష్యా 'రెడ్ అలర్ట్'

పారిస్/మాస్కో: బాంబు పేలుడు వల్లే రష్యా విమానం.. ఈజిప్టులోని సీనాయి పర్వతంపై కుప్పకూలిందనే అమెరికా, బ్రిటన్ల వాదనకు మరింత బలం చేకూరింది. సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్సుకు పారిస్లో నిర్వహించిన పరీక్షల్లో ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తేలినట్లు విశ్వసనీయ సమాచారం.


ఎర్రసముద్రం తీరంలోని షార్మ్ అల్ షేక్ నుంచి రష్యాలోని పీటర్స్ బర్గ్ కు టేక్ ఆఫ్ అయిన 24 నిమిషాల తర్వాత విమానం కూలిపోయింది. అయితే ఆ 24 నిమిషాల్లో విమానంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, అంతవరకు ప్రయాణం సజావుగా సాగినట్లు తెలిసింది. అయితే 24 నిమిషంలో మాత్రం ఒక్కసారిగా ఏదో భారీ విస్పోటనం జరిగిన ఆనవాళ్లు బ్లాక్బాక్స్లో  రికార్డయ్యాయని నిపుణుల బృందం పేర్కొన్నట్లు తెలిసింది.

విమానాన్ని తామే పేల్చేశామని  ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడం, అటు అమెరికా, బ్రిటన్లు కూడా బాంబు పేలుడు వల్లే విమానం కూలిపోయిందని నిర్ధారించడం తాజా పరీక్షలకు బలం చేకూర్చాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రష్యా ఫెడరల్ ఏవియేషన్ ఈజిప్టుకు వెళ్లే అన్ని సర్వీసులను రద్దుచేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలమేరకు అన్ని సర్వీసులు రద్దుచేసి, అలర్ట్ ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు.

 

మరోవైపు ఇప్పటికే ఈజిప్టులోని పర్యాటక ప్రాంతాల్లో ఉన్న రష్యన్లను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. 'రెడ్ సీ లోని షార్మ్ అల్ షేక్ సహా ఈజిప్ట్ లోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో దాదాపు 40 వేల మంది రష్యన్లు ఉండిఉంటారని అంచనా. ఆమేరకు వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించాం' అని అని రష్యా రక్షణ విభాగం చీఫ్ అలెగ్జాండర్ బోర్ట్నికోవ్ చెప్పారు. ప్రమాదానాకి అసలు కారణం అధికారికంగా నిర్ధారణ అయిన తర్వాతే ఈజిప్ట్ కు విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఆలోచిస్తామన్నారు.



సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో అధ్యక్షుడు అసద్ కు మద్దతు తెలిపిన రష్యా.. ఐఎస్ ఉగ్రవాదులు, తిరుగుబాటు దళాలపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారంగా రష్యన్లను టార్గెట్ చేసుకున్న తీవ్రవాదులు.. భీకర ప్రతిదాడులు చేయాలని భావిస్తున్నట్లు, ఆ క్రమంలోనే రష్యా విమానాన్ని పేల్చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కంటెయినర్ లో కాకుండా నేరుగా తానే బాంబులు తీసుకెళ్లిన ప్రయాణికుడు తనను తాను పేల్చుకోవటం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. అక్టోబర్ 31న జరిగిన విమాన పేలుడులో 224 మంది చనిపోయిన సంగతి విదితమే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement