russian plane crash
-
సోడాక్యాన్ బాంబుతో ఆ విమానాన్ని పేల్చేశారు!
కైరో: ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఇటీవల కూలిన రష్యా విమానంలోకి బాంబును ఎలా అమర్చామో వివరిస్తూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. పేలుడు పదర్థాలను దాచి తరలించిన వస్తువుల చిత్రాలను తన ఆన్లైన్ మ్యాగజీన్ దబిఖ్లో వెల్లడించింది. ఈ చిత్రాలను బట్టి సోడాక్యాన్లో పేలుడు పదార్థాలను పెట్టి.. దానిని విమానంలోకి తరలించినట్టు తెలుస్తున్నది. గత నెల 31న ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో రష్యా విమానం కూలిన ఘటనలో 224 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతిచెందిన కొందరు ప్రయాణికుల పాస్‌పోర్టుల చిత్రాలను కూడా ఐఎస్ఐఎస్ ఈ కథనంలో ప్రచురించింది. ఈజిప్టులోని రెడ్ సీ రిసార్ట్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్ వెళుతున్న ఈ విమానాన్ని తామే కూల్చేశామని ఐఎస్ఐఎస్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. సిరియా, ఇరాక్‌లో వైమానిక దాడులు జరుపుతున్న అమెరికా మిత్రరాజ్యాలకు చెందిన విమానాలను కూల్చాలని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మొదట భావించారు. అయితే రష్యా కూడా సిరియాలోని తమ ఫైటర్లపై వైమానిక దాడులు ప్రారంభించడంతో ఆ దేశానికి చెందిన విమానాన్ని లక్ష్యంగా చేసుకొని పేల్చేసినట్టు తెలిపింది. బాంబు పేలడం వల్లే విమానం కూలిందని ప్రకటించిన రష్యా.. ఇందుకు కారకులను పట్టుకొని శిక్షిస్తామని ప్రతిన బూనిన సంగతి తెలిసిందే. -
విమానంలో పేలుడు: రష్యా 'రెడ్ అలర్ట్'
పారిస్/మాస్కో: బాంబు పేలుడు వల్లే రష్యా విమానం.. ఈజిప్టులోని సీనాయి పర్వతంపై కుప్పకూలిందనే అమెరికా, బ్రిటన్ల వాదనకు మరింత బలం చేకూరింది. సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్సుకు పారిస్‌లో నిర్వహించిన పరీక్షల్లో ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తేలినట్లు విశ్వసనీయ సమాచారం. ఎర్రసముద్రం తీరంలోని షార్మ్ అల్ షేక్ నుంచి రష్యాలోని పీటర్స్ బర్గ్ కు టేక్ ఆఫ్ అయిన 24 నిమిషాల తర్వాత విమానం కూలిపోయింది. అయితే ఆ 24 నిమిషాల్లో విమానంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, అంతవరకు ప్రయాణం సజావుగా సాగినట్లు తెలిసింది. అయితే 24 నిమిషంలో మాత్రం ఒక్కసారిగా ఏదో భారీ విస్పోటనం జరిగిన ఆనవాళ్లు బ్లాక్‌బాక్స్‌లో రికార్డయ్యాయని నిపుణుల బృందం పేర్కొన్నట్లు తెలిసింది. విమానాన్ని తామే పేల్చేశామని ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడం, అటు అమెరికా, బ్రిటన్లు కూడా బాంబు పేలుడు వల్లే విమానం కూలిపోయిందని నిర్ధారించడం తాజా పరీక్షలకు బలం చేకూర్చాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రష్యా ఫెడరల్ ఏవియేషన్ ఈజిప్టుకు వెళ్లే అన్ని సర్వీసులను రద్దుచేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలమేరకు అన్ని సర్వీసులు రద్దుచేసి, అలర్ట్ ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే ఈజిప్టులోని పర్యాటక ప్రాంతాల్లో ఉన్న రష్యన్లను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. 'రెడ్ సీ లోని షార్మ్ అల్ షేక్ సహా ఈజిప్ట్ లోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో దాదాపు 40 వేల మంది రష్యన్లు ఉండిఉంటారని అంచనా. ఆమేరకు వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించాం' అని అని రష్యా రక్షణ విభాగం చీఫ్ అలెగ్జాండర్ బోర్ట్నికోవ్ చెప్పారు. ప్రమాదానాకి అసలు కారణం అధికారికంగా నిర్ధారణ అయిన తర్వాతే ఈజిప్ట్ కు విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఆలోచిస్తామన్నారు. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో అధ్యక్షుడు అసద్ కు మద్దతు తెలిపిన రష్యా.. ఐఎస్ ఉగ్రవాదులు, తిరుగుబాటు దళాలపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారంగా రష్యన్లను టార్గెట్ చేసుకున్న తీవ్రవాదులు.. భీకర ప్రతిదాడులు చేయాలని భావిస్తున్నట్లు, ఆ క్రమంలోనే రష్యా విమానాన్ని పేల్చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కంటెయినర్ లో కాకుండా నేరుగా తానే బాంబులు తీసుకెళ్లిన ప్రయాణికుడు తనను తాను పేల్చుకోవటం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. అక్టోబర్ 31న జరిగిన విమాన పేలుడులో 224 మంది చనిపోయిన సంగతి విదితమే. -
చెల్లాచెదురుగా మృతదేహాలు, విమాన శకలాలు
కైరో: ఈజిప్ట్ లోని సినాయి పర్వతంపై రష్యా విమానం కూలిపోయిన సంఘటనలో ఇప్పటి వరకు 163 మృతదేహాలను వెలికితీశారు. 31 వేల అడుగుల ఎత్తు నుంచి కూలిపోవడంతో విమానం చిత్తుచిత్తయింది. మృతదేహాల్లో కొన్ని ఛిద్రం కాగా, మరికొన్ని విమాన ప్రధాన భాగాలు పడిపోయిన ప్రదేశానికి దూరంగా చెల్లాచెదురుగా పడిపోయాయి. శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 224 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. విమానం కూలిపోయిన ప్రదేశం నుంచి అన్నివైపులా గాలింపు కొనసాగుతోంది. మొదట 5 కిలోమీటర్ల పరిధిలో సాగిన వెతుకులాట చేపట్టారు. అయితే ప్రమాద స్థలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఓ మూడేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. దీంతో 15 కిలోమీటర్ల పరిధిలో గాలింపు చేపట్టాలని సహాయక బృందానికి నేతృత్వం వహిస్తున్న అధికారులు నిర్ణయించారు. రష్యా, ఫ్రాన్స్ నుంచి వచ్చిన అధికారులు ఈజిప్టు బృందాలకు తోడుకావడంతో దర్యాప్తు ముమ్మరమైంది. విమానాన్ని కూల్చింది తామేనని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ఐఎస్ అనుబంధ ఈజిప్ట్ ఉగ్రవాద సంస్థ.. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. తగలబడుతూ కూలిపోతున్న విమానం దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. అయితే అవి రష్యా విమానానికి సంబంధించినవి అయి ఉండకపోవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. 31 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేసేంతటి సామర్థ్యం ఐఎస్ కు లేదని ఈజిప్ట్ పౌరవిమానయాన శాఖ మంత్రి హోసమ్ కామల్ మీడియాతో అన్నారు. ఇదిలా ఉండగా కోపైలట్ భార్య వాగ్మూలం సంచలనాన్ని రేపుతోంది. ఎయిర్‌బస్ ఏ321-23 విమానం ఇంజన్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని, ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం పట్టించుకోవటంలేదని తనకు చెప్పినట్లు కోపైలట్ భార్య పేర్కొన్నారు. రష్యాకు చెందిన ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. విమానంలో ప్రయాణిస్తున్నవారిలో అత్యధికులు రష్యన్లేకాగా, నలుగురు ఉక్రేనియన్లు, ఒకరు బెలారస్ పౌరుడు. ప్రమాద స్థలం నుంచి సేకరించిన మృతదేహాలను కైరోలోని ఓ ఆసుపత్రిలో భద్రపరుస్తున్నట్లు, వచ్చే ఆదివారం నాటికి అవి రష్యాకు చేరుకునే అవకాశమున్నట్లు రష్యా అధికారులు చెప్పారు. -
ఈజిప్టులో కూలిన రష్యా విమానం