31 వేల అడుగుల ఎత్తు నుంచి కూలడంతో చిత్తుచిత్తయిన విమాన భాగాలు
కైరో: ఈజిప్ట్ లోని సినాయి పర్వతంపై రష్యా విమానం కూలిపోయిన సంఘటనలో ఇప్పటి వరకు 163 మృతదేహాలను వెలికితీశారు. 31 వేల అడుగుల ఎత్తు నుంచి కూలిపోవడంతో విమానం చిత్తుచిత్తయింది. మృతదేహాల్లో కొన్ని ఛిద్రం కాగా, మరికొన్ని విమాన ప్రధాన భాగాలు పడిపోయిన ప్రదేశానికి దూరంగా చెల్లాచెదురుగా పడిపోయాయి. శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 224 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.
విమానం కూలిపోయిన ప్రదేశం నుంచి అన్నివైపులా గాలింపు కొనసాగుతోంది. మొదట 5 కిలోమీటర్ల పరిధిలో సాగిన వెతుకులాట చేపట్టారు. అయితే ప్రమాద స్థలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఓ మూడేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. దీంతో 15 కిలోమీటర్ల పరిధిలో గాలింపు చేపట్టాలని సహాయక బృందానికి నేతృత్వం వహిస్తున్న అధికారులు నిర్ణయించారు.
రష్యా, ఫ్రాన్స్ నుంచి వచ్చిన అధికారులు ఈజిప్టు బృందాలకు తోడుకావడంతో దర్యాప్తు ముమ్మరమైంది. విమానాన్ని కూల్చింది తామేనని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ఐఎస్ అనుబంధ ఈజిప్ట్ ఉగ్రవాద సంస్థ.. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. తగలబడుతూ కూలిపోతున్న విమానం దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. అయితే అవి రష్యా విమానానికి సంబంధించినవి అయి ఉండకపోవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. 31 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేసేంతటి సామర్థ్యం ఐఎస్ కు లేదని ఈజిప్ట్ పౌరవిమానయాన శాఖ మంత్రి హోసమ్ కామల్ మీడియాతో అన్నారు.
ఇదిలా ఉండగా కోపైలట్ భార్య వాగ్మూలం సంచలనాన్ని రేపుతోంది. ఎయిర్‌బస్ ఏ321-23 విమానం ఇంజన్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని, ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం పట్టించుకోవటంలేదని తనకు చెప్పినట్లు కోపైలట్ భార్య పేర్కొన్నారు. రష్యాకు చెందిన ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. విమానంలో ప్రయాణిస్తున్నవారిలో అత్యధికులు రష్యన్లేకాగా, నలుగురు ఉక్రేనియన్లు, ఒకరు బెలారస్ పౌరుడు. ప్రమాద స్థలం నుంచి సేకరించిన మృతదేహాలను కైరోలోని ఓ ఆసుపత్రిలో భద్రపరుస్తున్నట్లు, వచ్చే ఆదివారం నాటికి అవి రష్యాకు చేరుకునే అవకాశమున్నట్లు రష్యా అధికారులు చెప్పారు.