sinai
-
చెల్లాచెదురుగా మృతదేహాలు, విమాన శకలాలు
కైరో: ఈజిప్ట్ లోని సినాయి పర్వతంపై రష్యా విమానం కూలిపోయిన సంఘటనలో ఇప్పటి వరకు 163 మృతదేహాలను వెలికితీశారు. 31 వేల అడుగుల ఎత్తు నుంచి కూలిపోవడంతో విమానం చిత్తుచిత్తయింది. మృతదేహాల్లో కొన్ని ఛిద్రం కాగా, మరికొన్ని విమాన ప్రధాన భాగాలు పడిపోయిన ప్రదేశానికి దూరంగా చెల్లాచెదురుగా పడిపోయాయి. శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 224 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. విమానం కూలిపోయిన ప్రదేశం నుంచి అన్నివైపులా గాలింపు కొనసాగుతోంది. మొదట 5 కిలోమీటర్ల పరిధిలో సాగిన వెతుకులాట చేపట్టారు. అయితే ప్రమాద స్థలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఓ మూడేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. దీంతో 15 కిలోమీటర్ల పరిధిలో గాలింపు చేపట్టాలని సహాయక బృందానికి నేతృత్వం వహిస్తున్న అధికారులు నిర్ణయించారు. రష్యా, ఫ్రాన్స్ నుంచి వచ్చిన అధికారులు ఈజిప్టు బృందాలకు తోడుకావడంతో దర్యాప్తు ముమ్మరమైంది. విమానాన్ని కూల్చింది తామేనని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ఐఎస్ అనుబంధ ఈజిప్ట్ ఉగ్రవాద సంస్థ.. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. తగలబడుతూ కూలిపోతున్న విమానం దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. అయితే అవి రష్యా విమానానికి సంబంధించినవి అయి ఉండకపోవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. 31 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేసేంతటి సామర్థ్యం ఐఎస్ కు లేదని ఈజిప్ట్ పౌరవిమానయాన శాఖ మంత్రి హోసమ్ కామల్ మీడియాతో అన్నారు. ఇదిలా ఉండగా కోపైలట్ భార్య వాగ్మూలం సంచలనాన్ని రేపుతోంది. ఎయిర్‌బస్ ఏ321-23 విమానం ఇంజన్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని, ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం పట్టించుకోవటంలేదని తనకు చెప్పినట్లు కోపైలట్ భార్య పేర్కొన్నారు. రష్యాకు చెందిన ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. విమానంలో ప్రయాణిస్తున్నవారిలో అత్యధికులు రష్యన్లేకాగా, నలుగురు ఉక్రేనియన్లు, ఒకరు బెలారస్ పౌరుడు. ప్రమాద స్థలం నుంచి సేకరించిన మృతదేహాలను కైరోలోని ఓ ఆసుపత్రిలో భద్రపరుస్తున్నట్లు, వచ్చే ఆదివారం నాటికి అవి రష్యాకు చేరుకునే అవకాశమున్నట్లు రష్యా అధికారులు చెప్పారు. -
ఆ విమానాన్ని కూల్చేసింది మేమే
- రష్యా విమాన దుర్ఘటనపై ఐఎస్ ప్రకటన కైరో: రష్యా విమాన ప్రమాదంలో మరో మలుపు. ముందుగా ఊహిస్తూ వస్తున్నట్లే విమానాన్ని కూల్చింది తామేనంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. సినాయి ద్వీపకల్పంలో శనివారం విమానాన్ని కూల్చింది తామేనంటూ ఐఎస్ ప్రకటించుకున్నదని ఏఎఫ్ పీ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఈజిప్ట్ అధికారులు మాత్రం విమానం కూల్చివేతను కొట్టిపారేస్తున్నారు. సాంకేతిక లోపం తలెత్తడంవల్లే విమానం కూలిందని స్పష్టం చేస్తున్నారు. ఈ ఇరువురి పరస్పర విరుద్ధ ప్రకటన నడుమ రష్యా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుంటేగానీ అసలు విషయం తేలేలాలేదు. సిరియాలో జరుగుతున్న అంత్యర్యుద్ధంలో అధ్యక్షుడు అల్ బషీర్ కు అండగా సైన్యాన్ని పంపినందుకు ప్రతీకారంగానే రష్యా విమానంపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. -
గాల్లోనే కలిసిపోతున్నాయి...
సాంకేతిక లోపాలు, ప్రతికూల పరిస్థితులు, ఉగ్రవాదుల దాడులు... కారణాలేవైతేనేం ఎయిర్‌బస్సులు గాలిలోనే పేలిపోతున్నాయి. వందల సంఖ్యలో ప్రాణాలను హరిస్తున్నాయి. గత ఏడాది నాలుగు ఘోర విమాన ప్రమాదాలు జరిగాయి. ఆ ఏడాది మార్చి 8న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం-370 కనిపించకుండా పోయింది. కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తున్న ఆ విమానం మార్గ మధ్యంలోనే సముద్రంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 227మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు. మరో 4 నెలలకే మరో ప్రమాదం చోటు చేసుకుంది. జులై 17న మలే సియా విమానం ఉగ్రవాదుల ఘాతుకానికి బలైంది. ఆమ్స్టర్డ్యామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తుండగా టెర్రరిస్టులు విమానాన్నిఉక్రెయిన్లో కూల్చివేశారు. ఈ ప్రమాదంలో 283 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది బలయ్యారు. వారం గడిచిందో లేదో మరో విమాన ప్రమాదం. జులై 24న ఎయిర్ అల్జీరియా విమానం ప్రమాదానికి గురైంది. బుర్కినా ఫాసో నుంచి అల్జియర్స్కు వెళ్తుండగా మాలి ఉత్తర ప్రాంతంలో విమానం కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో.... 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృతిచెందారు. డిసెంబరు 28న ఇండోనేషియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం.... సముద్రంలో కూలిపోయింది. ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళ్తుండగా బోర్నియో వద్ద సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 155 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే 3 విమాన ప్రమాదాలు సంభవించాయి. ఫిబ్రవరి 4న ట్రాన్స్ ఏషియా ఎయిర్వేస్ విమానం తైవాన్ సమీపంలో కూలడంతో 43 మంది మృతిచెందారు. మార్చి 24న జర్మన్ వింగ్స్ ఫ్లైట్ స్పెయిన్‌లోని బార్సిలోనా నుంచి జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌కు వెళ్తుండగా ఫ్రాన్స్‌లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 144 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృతి చెందారు. ఆగస్టు 16న త్రిగనా ఎయిర్ సర్వీసెస్ విమానం ప్రమాదానికి గురైంది. ఇండోనేషియాలో సెంతని విమానాశ్రయం నుంచి ఒస్కిబిల్ విమానాశ్రయానికి వెళ్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 49 మంది ప్రయాణికులు, అయిదుగురు సిబ్బంది మృతి చెందారు. *2014 మార్చి 8న మలేషియా విమానంలో ప్రమాదం 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది జలసమాధి *2014 జులై 17న మలేసియా విమానంపై ఉగ్రవాదుల దాడి 283 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది బలి *2014 జులై 24న ఎయిర్ అల్జీరియా విమానంలో ప్రమాదం 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృతి *2014 డిసెంబరు 28న కూలిపోయిన ఇండోనేషియా విమానం 155 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది దుర్మరణం *2015 ఫిబ్రవరి 4న కూలిపోయిన ట్రాన్స్ ఏషియా విమానం 43 మంది మృతి *2015 మార్చి 24న జర్మన్ వింగ్స్ విమానంలో ప్రమాదం 144 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృత్యువాత *2015 ఆగస్టు 16న త్రిగనా ఎయిర్ సర్వీసెస్ విమాన ప్రమాదం 49 మంది ప్రయాణికులు, అయిదుగురు సిబ్బంది మృతి -
బ్లాక్ బాక్స్ దొరికింది..
కైరో: ఈజిప్టులోని సినాయి పర్వతం వద్ద కూలిపోయిన రష్యా విమానం బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం వెనుక ఎలాంటి విద్రోహ చర్యా లేదని, సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే విమానం కూలిపోయిందని నిపుణులు పేర్కొన్నారు. అయితే విమానం బయల్దేరడానికి ముందే సమస్యను గుర్తించినప్పటికీ సిబ్బంది అలక్ష్యం చేశారని, అతి విశ్వాసంతో టేకాఫ్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఎయిర్ బస్ ఏ-321ను ఆపరేట్ చేస్తున్న కొగల్మావియా ఎయిర్‌లైన్స్‌పై రష్యా ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం వల్లే సిబ్బందితోపాటు 224 ప్రాణాలు పోయినట్లు నిర్ధారించింది. కాగా, ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు 100 మృతదేహాలను వెలికి తీసినట్లు ఈజిప్ట్ సహాయక బృందాలు పేర్కొన్నాయి. రష్యా బలగాలు కూడా ప్రమాద స్థలికి బయలుదేరాయి. ఎర్ర సముద్ర తీరంలోని షార్మ్ అల్ షేక్ కు పర్యటనకు వచ్చిన రష్యన్ల తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన సంభవించింది. 17 మంది చిన్నారులు, ఏడుగురు సిబ్బంది సహా మొత్తం 224 మంది విమానంలో ప్రయాణించారు. రష్యాలోని పీటర్స్ బర్గ్ కు విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన 23 నిమిషాల తర్వాత.. విమానం 31 వేల అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం నేలకూలింది. -
13 మంది ఉగ్రవాదులు హతం
కైరో: ఈజిప్టు సైన్యం ఉగ్రవాదులను మట్టుబెట్టింది. సినాయ్‌లో 13 మందిని వెంటాడి వేటాడి హతమార్చింది. ఓ భారీ విధ్వంసానికి వారు పాల్పడేందుకు ప్రయత్నిస్తుండగా కనిపెట్టి మరీ వారి వ్యూహాన్ని సమర్థంగా తిప్పికొట్టింది. అక్కడి ఓ పత్రిక వివరాల ప్రకారం పశ్చిమ ఆరిశ్లోని జువెయిడ్ నగరంలోని విమానాశ్రయంలో భారీ పేలుళ్లకు పాల్పడేందుకు ప్రయత్నించారు. దాంతోపాటు ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ రెండింటిని ముందే పసిగట్టిన సైన్యం ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టడంతోపాటు విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న ఉగ్రవాదులను వెంబడించి మొత్తం 13 మందిని హతమార్చింది. చనిపోయిన ఉగ్రవాదులు అల్ కాయిదా ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ అన్సార్ బయత్ మాక్దిస్(ఏబీఎం)కు చెందిన వారిగా భావిస్తున్నారు. ముందు నుంచే ఉగ్రవాదులను అణిచే విషయంలో ఈజిప్టు చాలా క్రీయాశీలకంగా పనిచేస్తోంది.