గాల్లోనే కలిసిపోతున్నాయి...
సాంకేతిక లోపాలు, ప్రతికూల పరిస్థితులు, ఉగ్రవాదుల దాడులు... కారణాలేవైతేనేం ఎయిర్‌బస్సులు గాలిలోనే పేలిపోతున్నాయి. వందల సంఖ్యలో ప్రాణాలను హరిస్తున్నాయి. గత ఏడాది నాలుగు ఘోర విమాన ప్రమాదాలు జరిగాయి. ఆ ఏడాది మార్చి 8న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం-370 కనిపించకుండా పోయింది. కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తున్న ఆ విమానం మార్గ మధ్యంలోనే సముద్రంలో కూలిపోయింది.
ఈ దుర్ఘటనలో 227మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు. మరో 4 నెలలకే మరో ప్రమాదం చోటు చేసుకుంది. జులై 17న మలే సియా విమానం ఉగ్రవాదుల ఘాతుకానికి బలైంది. ఆమ్‌స్టర్‌డ్యామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తుండగా టెర్రరిస్టులు విమానాన్నిఉక్రెయిన్‌లో కూల్చివేశారు. ఈ ప్రమాదంలో 283 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది బలయ్యారు.
వారం గడిచిందో లేదో మరో విమాన ప్రమాదం. జులై 24న ఎయిర్ అల్జీరియా విమానం ప్రమాదానికి గురైంది. బుర్కినా ఫాసో నుంచి అల్జియర్స్‌కు వెళ్తుండగా మాలి ఉత్తర ప్రాంతంలో విమానం కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో.... 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృతిచెందారు. డిసెంబరు 28న ఇండోనేషియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం.... సముద్రంలో కూలిపోయింది. ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళ్తుండగా బోర్నియో వద్ద సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 155 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది మృత్యువాతపడ్డారు.
ఈ ఏడాది ఇప్పటికే 3 విమాన ప్రమాదాలు సంభవించాయి. ఫిబ్రవరి 4న ట్రాన్స్ ఏషియా ఎయిర్‌వేస్ విమానం తైవాన్ సమీపంలో కూలడంతో 43 మంది మృతిచెందారు. మార్చి 24న జర్మన్ వింగ్స్ ఫ్లైట్ స్పెయిన్‌లోని బార్సిలోనా నుంచి జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌కు వెళ్తుండగా ఫ్రాన్స్‌లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 144 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృతి చెందారు. ఆగస్టు 16న త్రిగనా ఎయిర్ సర్వీసెస్ విమానం ప్రమాదానికి గురైంది. ఇండోనేషియాలో సెంతని విమానాశ్రయం నుంచి ఒస్కిబిల్ విమానాశ్రయానికి వెళ్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 49 మంది ప్రయాణికులు, అయిదుగురు సిబ్బంది మృతి చెందారు.
*2014 మార్చి 8న మలేషియా విమానంలో ప్రమాదం
227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది జలసమాధి
*2014 జులై 17న మలేసియా విమానంపై ఉగ్రవాదుల దాడి
283 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది బలి
*2014 జులై 24న ఎయిర్ అల్జీరియా విమానంలో ప్రమాదం
110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృతి
*2014 డిసెంబరు 28న కూలిపోయిన ఇండోనేషియా విమానం
155 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది దుర్మరణం
*2015 ఫిబ్రవరి 4న కూలిపోయిన ట్రాన్స్ ఏషియా విమానం 43 మంది మృతి
*2015 మార్చి 24న జర్మన్ వింగ్స్ విమానంలో ప్రమాదం
144 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృత్యువాత
*2015 ఆగస్టు 16న త్రిగనా ఎయిర్ సర్వీసెస్ విమాన ప్రమాదం
49 మంది ప్రయాణికులు, అయిదుగురు సిబ్బంది మృతి