Russian airline plane
-
గాల్లోనే కలిసిపోతున్నాయి...
సాంకేతిక లోపాలు, ప్రతికూల పరిస్థితులు, ఉగ్రవాదుల దాడులు... కారణాలేవైతేనేం ఎయిర్‌బస్సులు గాలిలోనే పేలిపోతున్నాయి. వందల సంఖ్యలో ప్రాణాలను హరిస్తున్నాయి. గత ఏడాది నాలుగు ఘోర విమాన ప్రమాదాలు జరిగాయి. ఆ ఏడాది మార్చి 8న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం-370 కనిపించకుండా పోయింది. కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తున్న ఆ విమానం మార్గ మధ్యంలోనే సముద్రంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 227మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు. మరో 4 నెలలకే మరో ప్రమాదం చోటు చేసుకుంది. జులై 17న మలే సియా విమానం ఉగ్రవాదుల ఘాతుకానికి బలైంది. ఆమ్స్టర్డ్యామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తుండగా టెర్రరిస్టులు విమానాన్నిఉక్రెయిన్లో కూల్చివేశారు. ఈ ప్రమాదంలో 283 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది బలయ్యారు. వారం గడిచిందో లేదో మరో విమాన ప్రమాదం. జులై 24న ఎయిర్ అల్జీరియా విమానం ప్రమాదానికి గురైంది. బుర్కినా ఫాసో నుంచి అల్జియర్స్కు వెళ్తుండగా మాలి ఉత్తర ప్రాంతంలో విమానం కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో.... 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృతిచెందారు. డిసెంబరు 28న ఇండోనేషియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం.... సముద్రంలో కూలిపోయింది. ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళ్తుండగా బోర్నియో వద్ద సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 155 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే 3 విమాన ప్రమాదాలు సంభవించాయి. ఫిబ్రవరి 4న ట్రాన్స్ ఏషియా ఎయిర్వేస్ విమానం తైవాన్ సమీపంలో కూలడంతో 43 మంది మృతిచెందారు. మార్చి 24న జర్మన్ వింగ్స్ ఫ్లైట్ స్పెయిన్‌లోని బార్సిలోనా నుంచి జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌కు వెళ్తుండగా ఫ్రాన్స్‌లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 144 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృతి చెందారు. ఆగస్టు 16న త్రిగనా ఎయిర్ సర్వీసెస్ విమానం ప్రమాదానికి గురైంది. ఇండోనేషియాలో సెంతని విమానాశ్రయం నుంచి ఒస్కిబిల్ విమానాశ్రయానికి వెళ్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 49 మంది ప్రయాణికులు, అయిదుగురు సిబ్బంది మృతి చెందారు. *2014 మార్చి 8న మలేషియా విమానంలో ప్రమాదం 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది జలసమాధి *2014 జులై 17న మలేసియా విమానంపై ఉగ్రవాదుల దాడి 283 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది బలి *2014 జులై 24న ఎయిర్ అల్జీరియా విమానంలో ప్రమాదం 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృతి *2014 డిసెంబరు 28న కూలిపోయిన ఇండోనేషియా విమానం 155 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది దుర్మరణం *2015 ఫిబ్రవరి 4న కూలిపోయిన ట్రాన్స్ ఏషియా విమానం 43 మంది మృతి *2015 మార్చి 24న జర్మన్ వింగ్స్ విమానంలో ప్రమాదం 144 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృత్యువాత *2015 ఆగస్టు 16న త్రిగనా ఎయిర్ సర్వీసెస్ విమాన ప్రమాదం 49 మంది ప్రయాణికులు, అయిదుగురు సిబ్బంది మృతి -
బ్లాక్ బాక్స్ దొరికింది..
కైరో: ఈజిప్టులోని సినాయి పర్వతం వద్ద కూలిపోయిన రష్యా విమానం బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం వెనుక ఎలాంటి విద్రోహ చర్యా లేదని, సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే విమానం కూలిపోయిందని నిపుణులు పేర్కొన్నారు. అయితే విమానం బయల్దేరడానికి ముందే సమస్యను గుర్తించినప్పటికీ సిబ్బంది అలక్ష్యం చేశారని, అతి విశ్వాసంతో టేకాఫ్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఎయిర్ బస్ ఏ-321ను ఆపరేట్ చేస్తున్న కొగల్మావియా ఎయిర్‌లైన్స్‌పై రష్యా ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం వల్లే సిబ్బందితోపాటు 224 ప్రాణాలు పోయినట్లు నిర్ధారించింది. కాగా, ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు 100 మృతదేహాలను వెలికి తీసినట్లు ఈజిప్ట్ సహాయక బృందాలు పేర్కొన్నాయి. రష్యా బలగాలు కూడా ప్రమాద స్థలికి బయలుదేరాయి. ఎర్ర సముద్ర తీరంలోని షార్మ్ అల్ షేక్ కు పర్యటనకు వచ్చిన రష్యన్ల తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన సంభవించింది. 17 మంది చిన్నారులు, ఏడుగురు సిబ్బంది సహా మొత్తం 224 మంది విమానంలో ప్రయాణించారు. రష్యాలోని పీటర్స్ బర్గ్ కు విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన 23 నిమిషాల తర్వాత.. విమానం 31 వేల అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం నేలకూలింది. -
నిమిషానికి 1500 మీటర్లు కిందికి..
ఈజిప్టులో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో 217 మంది ప్రయాణికులతోపాటు ఏడుగురు సిబ్బంది దుర్మరణం చెందారు. రష్యాకు చెందిన కొగల్మావియా ఎయిర్ లైన్స్ విమానం (ఎయిర్ బస్ ఏ-321) సినాయి ద్వీపకల్పం మీదుగా ప్రయాణిస్తూ ఒక్కసారిగా గల్లంతైంది. ఈ ఘటనపై మొదట గందరగోళం నెలకొంది. అయితే విమానం కూలిపోవటం వాస్తవమేనని, ప్రమాద స్థలాన్ని కూడా గుర్తించామని ఈజిప్టు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. ప్రయాణికులలో 90 శాతం మంది రష్యా పర్యాటకులే కావటం గమనార్హం. సినాయి ద్వీపకల్పంపై ప్రస్తుతం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పట్టుండటంతో వారుగానీ ఈ ఘాతుకానికి పాల్పడిఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈజిప్టు అధికారులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన ముఖ్యాంశాలు కొన్ని.. ఎర్రసముద్ర తీరంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం షార్మ్ అల్ షేక్ నుంచి రష్యాలోని పీటర్స్ బర్గ్ కు విమానం బయలుదేరింది. బయలుదేరిన 23 నిమిషాల తర్వాత.. విమానం 31 వేల అడుగుల ఎత్తులో ఉండగా రాడార్ పరిధికి అందకుండాపోయింది. విమానం సైప్రస్ మీదుగా ప్రయాణించి గల్లంతైనట్లు మొదట భావించారు. అంతలోనే సినాయిలోని హోసన్నా ప్రాంతంలో విమాన శకలాలు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. చివరకు ఈజిప్టు ప్రధానమంత్రి షరీఫ్ ఇస్లామ్.. విమానం కూలిపోయినట్లు ప్రకటించారు. సహాయకబృందాలను రంగంలోకి దింపుతున్నట్లు చెప్పారు. ప్రయాణికుల్లో అత్యధికులు మరణించి ఉంటారని ఈజిప్టు అధికారులు నిర్ధారించారు. విమానంలో 217 మంది ప్రయాణికులు (వారిలో 17 మంది చిన్నారులు), ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు రష్యా అధికారగణం పేర్కొంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది రష్యాకు చెందిన టూరిస్టులే. దాదాపు 40 అంబులెన్స్ లు ప్రమాద స్థలికి చేరుకున్నాయని స్థానిక మీడియా తెలిపింది. విమానం ఎందుకు కూలిందనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే సమస్య తలెత్తిన తర్వాత విమానం ఒక్కో నిమిషానికి 1500 మీటర్లు కిందికి పడిపోయినట్లు తెలిసింది. పీటర్స్ బర్గ్ లోని పుల్కోవ్ ఎయిర్ పోర్టులో హెల్స్ లైన్ ను ఏర్పాటుచేసి, ప్రయాణికుల కుటుంబాలకు సమాచారం అందిస్తున్నారు. రష్యా సహాయబృందాలు వెంటనే ఈజిప్టుకు బయలుదేరాల్సిందిగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు.