బ్లాక్ బాక్స్ దొరికింది..
కైరో: ఈజిప్టులోని సినాయి పర్వతం వద్ద కూలిపోయిన రష్యా విమానం బ్లాక్ బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం వెనుక ఎలాంటి విద్రోహ చర్యా లేదని, సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే విమానం కూలిపోయిందని నిపుణులు పేర్కొన్నారు. అయితే విమానం బయల్దేరడానికి ముందే సమస్యను గుర్తించినప్పటికీ సిబ్బంది అలక్ష్యం చేశారని, అతి విశ్వాసంతో టేకాఫ్ తీసుకున్నట్లు సమాచారం.
దీంతో ఎయిర్ బస్ ఏ-321ను ఆపరేట్ చేస్తున్న కొగల్మావియా ఎయిర్లైన్స్పై రష్యా ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం వల్లే సిబ్బందితోపాటు 224 ప్రాణాలు పోయినట్లు నిర్ధారించింది. కాగా, ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు 100 మృతదేహాలను వెలికి తీసినట్లు ఈజిప్ట్ సహాయక బృందాలు పేర్కొన్నాయి. రష్యా బలగాలు కూడా ప్రమాద స్థలికి బయలుదేరాయి.
ఎర్ర సముద్ర తీరంలోని షార్మ్ అల్ షేక్ కు పర్యటనకు వచ్చిన రష్యన్ల తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన సంభవించింది. 17 మంది చిన్నారులు, ఏడుగురు సిబ్బంది సహా మొత్తం 224 మంది విమానంలో ప్రయాణించారు. రష్యాలోని పీటర్స్ బర్గ్ కు విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన 23 నిమిషాల తర్వాత.. విమానం 31 వేల అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం నేలకూలింది.