సోడాక్యాన్ బాంబుతో ఆ విమానాన్ని పేల్చేశారు!
కైరో: ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఇటీవల కూలిన రష్యా విమానంలోకి బాంబును ఎలా అమర్చామో వివరిస్తూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. పేలుడు పదర్థాలను దాచి తరలించిన వస్తువుల చిత్రాలను తన ఆన్‌లైన్ మ్యాగజీన్ దబిఖ్‌లో వెల్లడించింది. ఈ చిత్రాలను బట్టి సోడాక్యాన్‌లో పేలుడు పదార్థాలను పెట్టి.. దానిని విమానంలోకి తరలించినట్టు తెలుస్తున్నది. గత నెల 31న ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో రష్యా విమానం కూలిన ఘటనలో 224 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతిచెందిన కొందరు ప్రయాణికుల పాస్‌పోర్టుల చిత్రాలను కూడా ఐఎస్ఐఎస్ ఈ కథనంలో ప్రచురించింది.
ఈజిప్టులోని రెడ్ సీ రిసార్ట్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్‌బర్గ్ వెళుతున్న ఈ విమానాన్ని తామే కూల్చేశామని ఐఎస్ఐఎస్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. సిరియా, ఇరాక్‌లో వైమానిక దాడులు జరుపుతున్న అమెరికా మిత్రరాజ్యాలకు చెందిన విమానాలను కూల్చాలని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మొదట భావించారు. అయితే రష్యా కూడా సిరియాలోని తమ ఫైటర్లపై వైమానిక దాడులు ప్రారంభించడంతో ఆ దేశానికి చెందిన విమానాన్ని లక్ష్యంగా చేసుకొని పేల్చేసినట్టు తెలిపింది. బాంబు పేలడం వల్లే విమానం కూలిందని ప్రకటించిన రష్యా.. ఇందుకు కారకులను పట్టుకొని శిక్షిస్తామని ప్రతిన బూనిన సంగతి తెలిసిందే.