సూర్యారావు బహదూర్
పిఠాపురం మహారాజారావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్ (1885 –1965) ఆంధ్రదేశపు సంస్కరణ పోషణకు, సాంస్కృతిక కళా వికాసానికీ, సత్పరిపాలనకూ ఎనలేని కృషి చేశారు. తన గురువు దివాన్ మొక్కపాటి సుబ్బారాయుడు చూపిన అభ్యుదయ మార్గంలో అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికై అలుపెరుగక పరిశ్రమించారు. వివిధ రంగాల్లో సూర్యారావు చేపట్టిన కార్యక్రమాలు ఎన్నదగ్గవి.
దక్షిణాఫ్రికాలోని భారతీయుల కోసం గాంధీజీ పిలుపునందుకుని పాతిక వేలు అందించి, ఆనాటి జమీందార్లలో దేశభక్తికి ఊపిరులూదారు. రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన ‘శాంతినికేతన్’ కలకత్తాలోని సిటీ కాలేజి; రాజమండ్రిలోని ఆస్తిక కళాశాల, టౌన్ హాలు నిర్మాణానికీ ఆర్థికంగా ఆయన అందించిన సేవలు అనన్యసామాన్యమైనవి. సంఘ సంస్కరణోద్యమానికి బాటలు వేసిన ‘బ్రహ్మసమాజం’ కార్యక్రమాలకు అన్ని విధాలా సాయం అందించారు.
1933లో బ్రహ్మసమాజ సూత్రధారి రాజా రామ్మోహన్‌రాయ్ శత వర్ధంతిని నిర్వహించారు. ఎన్నో మత సామరస్య, మానవీయ గ్రంథాల్ని ఈ సందర్భంగా ప్రచురించారు. అలాగే నాలుగవ అంతర్జాతీయ సర్వమత సమ్మేళనానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ గౌరవాన్ని పొందిన రెండవ భారతీయ రాజుగా ఘనత సాధించారు. ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ను మద్రాసులో స్థాపించి దానికి శాశ్వత నిధిని ఏర్పాటు చేశారు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ లాంటి సమగ్రమైన నిఘంటువు తెలుగులో కూడా అవసరమనే ఆశయంతో ‘సూర్యరాయాంధ్ర’ నిఘంటువు నిర్మాణాన్ని ఒక బృహత్కార్యంగా చేపట్టి తెలుగుజాతికి అందించారు.
దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అనాథ ఆశ్రమంగా ‘కరుణాలయం’ స్థాపించారు. నిమ్న వర్గాల పురుషుల పేరు చివర ‘గాడు’ను చేర్చి అవమానకరంగా పిలవడాన్ని నిషేధిస్తూ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో బిల్లును ప్రవేశపెట్టి విజయం సాధించారు. గాంధీజీ చేపట్టిన మద్యపాన నిషేధ ఉద్యమం కంటే ముందుగానే పిఠాపురం సంస్థాన పరిధిలో కల్లు తాగడాన్ని నిషేధించారు. కాకినాడలోని పీఆర్ కళాశాల ద్వారా దేశంలో అత్యున్నత విద్యనందించి చరిత్రలో ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎనలేని కృషి చేసిన పిఠాపురం రాజాను స్మరించుకోవడం మన బాధ్యత.
– ర్యాలి ప్రసాద్, చారిత్రక పరిశోధకులు
(అక్టోబర్ 5న పిఠాపురం మహారాజా సూర్యారావు బహదూర్ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment