కళా సాంస్కృతిక సారస్వత పిపాసిగా, ప్రజా తంత్రవాదిగా పేరొందిన పిఠాపురం మహారాజా రావువెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్ (1885–1965) తెలుగు నేల మీద సాంస్కృతిక పునరుజ్జీవనానికి జీవితాంతం తోడ్పడిన మహామనీషి. అణగారిన వర్గాల ప్రజల కోసం అహర్నిశలు ఆలోచించిన అరుదైన మానవతావాది. యావత్ దేశానికి తన సేవలు అందించిన అజరామర కృషీవలుడు. స్వయంగా కవి, రచయిత, రసజ్ఞుడు, తత్వవేత్త అయిన సూర్యారావు జీవితం నిజానికి ఒక మహా సముద్రం.
కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి, రఘుపతి వెంకటరత్నం నాయుడు, మొక్కపాటి సుబ్బారాయుడు మొదలగు ఉద్దండుల సార«థ్యంలో అనేక రంగాల్లో సూర్యారావు చేసిన సేవలు ఎన్నదగ్గవి. దక్షిణాఫ్రికాలోని భారతీయుల కోసం గాంధీజీ విరాళాల కోసం ప్రపంచవ్యాప్తంగా పిలుపు ఇచ్చినపుడు పాతిక వేలు పంపిన రాజావారి పేరు ఆనాడే దేశవ్యాప్తంగా మారుమోగింది. రవీంద్రనాథ్ టాగోర్ శాంతినికేతన్, కలకత్తాలోని సిటీ కాలేజి మొదలు రాజ మండ్రిలోని ఆస్తిక కళాశాల, టౌన్ హాలు వరకూ ఆర్థికంగా ఆయన వితరణ పొందని చోటు లేదంటే అతిశయోక్తి కాదు.
ఆధునిక సంఘ సంస్కరణోద్యమానికి గొప్ప తోడ్పాటు నిచ్చిన బ్రహ్మసమాజోద్యమ చరిత్రలో చెరగని ముద్ర సూర్యారావుది. దక్షిణ భారతదేశంలో ఈ ఉద్యమానికి ఎనలేని సేవచేసిన వ్యక్తి ఆయన. యావత్ దేశంలోనే తలమానికమనే విధంగా ఎంతో ఖర్చుపెట్టి కాకినాడలో బ్రహ్మసమాజ మందిరాన్ని నిర్మించి హేమచంద్ర సర్కార్ వంటి నేతని బెంగాల్ నుండి ముఖ్య అతిథిగా తీసుకు వచ్చిన రాజాగారు, వంగదేశ మేధావి పండిత శివనాథ శాస్త్రిగారు రచించిన ‘బ్రహ్మ సమాజ చరిత్ర’ అనే బృహత్తర గ్రంథాన్ని కాకుండా, 1933లో రాజారామ్మోహన్ రాయ్ శతవర్ధంతిని జరిపి ఎన్నో మత సామరస్య, మానవీయ గ్రంథాల్ని ప్రచురించారు.
ఆధ్యాత్మిక సమానత్వాన్ని ఇతోధికంగా ప్రచారం చేసిన సూర్యారావు నాలుగవ అంతర్జాతీయ సర్వమత సమ్మేళనానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బరోడా మహారాజు మినహా ఈ ఖ్యాతిని అందుకున్న ఏకైక భారతీయ మహారాజు ఈయన మాత్రమే. వైజ్ఞానిక ప్రగతిని మనçస్ఫూర్తిగా ఆహ్వానించి తూర్పు, పాశ్చాత్య దేశాల సమన్వయాన్ని ఆకాంక్షించారు. అసంఖ్యాక విశిష్ట గ్రంథాలను ప్రచురించడం, అనేకమంది బుద్ధి జీవులకు తోడ్పాటును అందించడం చేసిన సూర్యారావు ఆంధ్ర సాహిత్య పరిషత్తును మద్రాసులో స్థాపించి దానికి శాశ్వత నిధిని ఏర్పాటు చేశారు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ వంటిది తెలుగులో కూడా తీసుకురావాలనే సంకల్పంతో సూర్యరాయాంధ్ర నిఘంటువు వంటి అనితరసాధ్యమైన మహత్కార్యాన్ని చేబట్టి సుసాధ్యం చేసారు.
ఆర్థికత కంటే ఆత్మగౌరవమే ప్రధానమని నమ్మిన సూర్యారావు ఆఖరు క్షణం వరకూ అలానే బతికారు. అనాథల కోసం దక్షిణ భారతదేశం లోనే మొట్టమొదటి ఆశ్రమంగా ‘కరుణాలయం’ స్థాపించారు. బహుజనుల కోసం కంటి తుడుపు చర్యలు కాకుండా, ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, బహుజనుల్ని పేరు చివర గాడు అని చేర్చి హీనంగా సంబోధించే సమాజంలో లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఎంతోమంది ఛాందస సాంప్రదాయవాదులు వ్యతిరేకించినప్పటికీ గ్రామాల్లో ‘గాడు’ అనే పదంతో ఉత్పత్తి కులాల వార్ని, ముఖ్యంగా దళిత బహుజనుల్ని పిలవడాన్ని నిషేధించాలనే బిల్లును ప్రవేశపెట్టి దుమారం రేపారు. భాష, సాహిత్యం, సంగీతం, చిత్రకళ, తర్కం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత, క్రీడలు, రాజకీయాలు, సేవా రంగం, సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా అనేకానేక అంశాల్లో కృషిచేసి ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎంతో కృషిచేసిన పిఠాపురం మహా రాజా సూర్యారావు కృషిని స్మరించుకోవడం సాంస్కృతిక పునర్వికాసాన్ని స్వాగతిస్తున్న ఆలోచనాపరులందరి కర్తవ్యం.
(నేడు పిఠాపురం మహారాజా సూర్యారావు బహదూర్ జయంతి సందర్భంగా...)
– గౌరవ్
Comments
Please login to add a commentAdd a comment