‘‘నాన్నగారి (అక్కినేని నాగేశ్వరరావు) శత జయంతి రోజున ఆయన పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు పోస్ట్ మాస్టర్ జనరల్ బీఎస్ రెడ్డిగారికి థ్యాంక్స్. శత జయంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాన్నగారి అభిమానులు రక్తదానం, అన్నదానం లాంటి మంచి కార్యక్రమాలు చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం మర్చిపోలేనిది’’ అని నాగార్జున అన్నారు.
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఎన్‌ఎఫ్‌డీసీ, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా కలిసి ‘ఏఎన్‌ఆర్ 100– కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఏఎన్‌ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో అక్కినేని ఐకానిక్ ఫిలిం ‘దేవదాసు’ స్క్రీనింగ్‌తో ఈ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ఏఎన్నార్ ‘దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యాభర్తలు, ‘గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మనం’ సహా ఏఎన్‌ఆర్ ల్యాండ్‌మార్క్ మూవీస్‌ని దేశవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు.
ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అన్నపూర్ణ స్టూడియోస్ పైన పేర్కొన్న చిత్రాల ప్రింట్‌లను 4కేలో పునరుద్ధరించాయి. ‘దేవదాసు’ స్క్రీనింగ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాన్నగారు నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు. అందుకే ఆయన పేరు తలచుకుంటే నవ్వుతూనే ఉంటాం. 31 సిటీల్లో ఈ ఫెస్టివల్ చేస్తున్నారు. నార్త్‌లో అద్భుతమైన స్పందన వస్తోందని శివేంద్ర చెప్పడం ఆనందాన్నిచ్చింది. గోవా ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నాన్నగారి పేరు మీద ఒక చాప్టర్ చేయడం సంతోషంగా ఉంది.
నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ– ‘‘అక్కినేనిగారితో కలసి నటించే అవకాశం రావడంతో పాటు ఆయన బ్యానర్‌లో నిర్మించిన తొలి సినిమాలో నేను నటించడం నా అదృష్టం. హైదరాబాద్‌కి ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది’’ అని పేర్కొన్నారు. నిర్మాత వెంకట్ అక్కినేని మాట్లాడుతూ– ‘‘నాన్నగారి శత జయంతి రోజున ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. బాపుగారు ఆ ఫొటో గీశారు. దాంట్లో నాన్నగారి లక్షణాలన్నీ కలగలిపి ఉంటాయి’’ అన్నారు.
దర్శకుడు కె. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారు, మా నాన్నగారు, నేను, నాగార్జున కలిసే ప్రయాణం చేశాం. నాగేశ్వరరావుగారు హైదరాబాద్‌కి అన్నపూర్ణ స్టూడియోను తలమానికంగా ఇచ్చి వెళ్లారు. ‘దేవదాసు, కాళిదాస్, విప్రనారాయణ’.. ఇలా ఎన్నో క్లాసిక్ సినిమాలు ఇచ్చారు. తండ్రీ కొడుకులతో సినిమాలు చేసిన అదృష్టం నాకు దొరికింది’’ అని చె΄్పారు. నిర్మాత శివేంద్ర సింగ్ దుంగార్పూర్ మాట్లాడుతూ– ‘‘ఈ ఫెస్టివల్‌ని దేశంలోని 31 సిటీస్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదొక హిస్టారికల్ డే. ఈ మూడు రోజుల్లో అక్కినేనిగారి పది క్లాసిక్ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూడబోతున్నారు’’ అన్నారు.
ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారు 1955లో లక్ష రూపాయలు విరాళం ఇచ్చి గుడివాడలో కళాశాల కట్టించారు. ఆయన దగ్గర పాతిక వేలే ఉంటే 75 వేలు అప్పు తీసుకొచ్చి మరీ లక్ష ఇచ్చారు. 70 ఏళ్ల క్రితమే ఆయన జన్మభూమి కాన్సెప్ట్ అనుకొని ఊర్లో స్కూల్ కట్టించారు. అనేక విద్యాలయాలకు విరాళాలు ఇచ్చారు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు. బుడమేరుపై వంతెన కట్టించిన ఘనత ఆయనది. కానీ, చేసిన సాయం గురించి ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు’’ అని తెలిపారు. జాయింట్ కలెక్టర్ సంజయ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏఎన్‌ఆర్‌గారి శత జయంతిని భారత ప్రభుత్వం తరఫున సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఈ వేడుకలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అక్కినేని అభిమానుల్లో 600 వందల మందికి దుస్తులు బహూకరించారు.
చిరంజీవికి ఏఎన్‌ఆర్ అవార్డు
‘‘ప్రతి రెండేళ్లకు ఏఎన్‌ఆర్ అవార్డు ఇస్తున్నాం. ఈ ఏడాది ఈ అవార్డుని చిరంజీవిగారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం చెప్పగానే చిరంజీవిగారు ఎమోషనల్‌గా నన్ను హత్తుకుని.. ‘ఏఎన్‌ఆర్‌గారి శత జయంతి ఏడాదిలో నాకు అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది. దీనికంటే పెద్ద అవార్డు లేదు’ అని అన్నారు. అక్టోబర్ 28న నిర్వహించే ఈ ఫంక్షన్‌లో అమితాబ్ బచ్చన్‌గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేస్తాం’’ అని నాగార్జున తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment