అక్కినేని శతజయంతి ముగింపు సందర్భంగా
గొప్ప నటుడిగా, మంచి వ్యక్తిగా తనతో కలిసి నటించిన నటీనటులతోనూ, ప్రేక్షకులతోనూ ‘మా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించామని...’ అనిపించుకున్నారు అక్కినేని. ‘‘అంతటి మహానటుడితో కలిసి నటించడం మా అదృష్టం’’ అంటున్నారు ప్రముఖ తారలు. ఈ నట సామ్రాట్ తమకు ఏ విధంగా ఆదర్శంగా నిలిచారో కొందరు నటీమణులు ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ విశేషాలు...
నా మీద నాకు నమ్మకం వచ్చేలా చేశారు: షావుకారు జానకి
నాగేశ్వరరావుగారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా ‘అక్కా–చెల్లెళ్లు’ సినిమా గురించి చెప్పాలి. ఆ సినిమాలో ఫస్ట్ నైట్ సీన్‌లో ‘పాండవులు పాండవులు తుమ్మెద...’ పాటకి డ్యాన్స్ చేయమని దర్శక–నిర్మాత అంటే, ‘పాట వద్దండీ... ఏదైనా డైలాగ్‌తో సీన్ ముగించవచ్చు కదా’ అంటూ వెనక్కి తగ్గాను. కానీ, ఆ చిత్రనిర్మాత రాజేంద్రప్రసాద్‌గారు, నాగేశ్వరరావుగారు పట్టుబట్టి చేయించారు. ‘డెఫినెట్‌గా హైలైట్ అవుతుంది... బాగుంటుందమ్మా చెయ్యి... ఆ తర్వాత చూడు’ అంటూ నాగేశ్వరరావుగారు ఎంతగానో ప్రోత్సహించారు. దాంతో చేశాను. ఆయన అన్నట్లే పాట హిట్ అయింది. ఆ తర్వాత ‘చూశావా... చెయ్యనన్నావు... ఎంత బాగా వచ్చిందో’ అన్నారు. మన మీద మనకు నమ్మకం లేని స్థితిలో అంతటి మహానటుడు ప్రోత్సహించి, చేయించడం అనేది నేను చేసుకున్న అదృష్టం అనిపించింది. మన ప్రతిభను గుర్తించి, ఎవరైనా ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. నా మీద నాకు నమ్మకం వచ్చేలా చేశారు.
అప్పుడు స్టన్నయ్యా...
ఇంకా నన్ను ఆయన అభినందించిన విషయాల్లో ముఖ్యమైనది ఒకటి చెబుతాను. నాగేశ్వరరావుగారిలానే నేనూ పెద్దగా చదువుకోలేదు. మా నాన్నగారి వృత్తిరీత్యా మేం ఎక్కువగా నార్త్‌లో ఉండేవాళ్లం. పదిహేనేళ్లకే పెళ్లయిపోయింది. ఆ తర్వాత మద్రాసులో ఉన్నాం. అనుకోకుండా సినిమాలకు అవకాశం వచ్చింది. నార్త్‌లో ఉన్నప్పటికీ మన తెలుగు భాష మీద ఉన్న ఇష్టంతో చాలా శ్రద్ధగా పట్టు సాధించాను. నేను తెలుగు మాట్లాడే తీరుని నాగేశ్వరరావుగారు బాగా మెచ్చుకునేవారు. ఆ ఉచ్చారణ, ఎక్కడ నొక్కాలి? ఎక్కడ తగ్గించాలి? వంటివి బాగుంటాయని ప్రశంసించేవారు. ఆల్ ఇండియా రేడియోలో చిన్న పిల్లలకు వాయిస్ ఇచ్చేదాన్ని. అప్పట్లో నాకు ఆల్ ఇండియో రేడియోలో ‘ఏ స్టార్’ స్టేటస్.
ఇక కొందరు డైలాగ్స్ మింగేస్తున్నారని, సరిగ్గా పలకడంలేదని, నువ్వెందుకు వాళ్లకు తర్ఫీదు ఇవ్వకూడదని నాగేశ్వరరావుగారు అన్నప్పుడు నేను స్టన్నయ్యా. నా మీద ఆయన ఎంత భరోసా పెట్టుకున్నారో అప్పుడు అర్థమైంది. వహీదా రెహమాన్, కేఆర్ విజయలాంటి హీరోయిన్లకు వాయిస్ ఇచ్చాను. కానీ వారు కనిపించడంలేదు... జానకియే కనబడుతోందనే మాట రావడంతో ఎవర్నీ తక్కువ చేయడం ఇష్టంలేక వేరేవాళ్లకి వాయిస్ ఇవ్వడం మానేశాను. నాకు మంచి డైలాగ్స్ ఇచ్చిన రైటర్లకు, మంచి పాత్రలు ఇచ్చిన దర్శకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నాను.
ఆపరేషన్‌కి వెళుతూ గిఫ్ట్ ఇచ్చారు: లక్ష్మి
మా అమ్మగారు (కుమారి రుక్మిణి) నాగేశ్వరరావుగారికి అమ్మగా, అత్తగా... ఇలా చాలా క్యారెక్టర్లు చేశారు. నా స్కూల్ సెలవులప్పుడు ఆ షూటింగ్స్ చూడ్డానికి అమ్మతో లొకేషన్‌కి వెళ్లేదాన్ని. సారథి స్టూడియోలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌కి వెళ్లినప్పుడు నాగేశ్వరరావుగారిని చూశాను. ‘ఎంత పెద్ద యాక్టర్’ అంటూ అలా చూస్తుండిపోయాను. ‘ఏమ్మా... ఇవాళ స్కూల్ లేదా? ఫ్రీయా? వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ’ అంటూ చాలా ప్రేమగా మాట్లాడారు. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)
ఇప్పుడు తలుచుకున్నా ఆయనకు నేను హీరోయినా? అనిపిస్తుంది. అప్పట్లో నేను యాక్ట్ చేసిన ఏయన్నార్‌గారు, ఎంజీఆర్‌గారు, శివాజీ గణేశన్‌గారు... వీళ్లంతా వయసులో నాకన్నా చాలా పెద్దవాళ్లు. అంత పెద్దవాళ్లతో సినిమాలు చేయడం వల్ల చాలా నేర్చుకోగలిగాను. నాగేశ్వరరావుగారితో నా ఫస్ట్ సినిమా ‘సుపుత్రుడు’. కొడైకెనాల్‌లో షూటింగ్. మధురై నుంచి ఫ్లైట్‌లో వెళ్లాం. ఫ్లైట్‌లో కూర్చున్నాక ‘ఏమ్మా ఎలా ఉన్నావ్... ఇన్నాళ్లూ షూటింగ్‌కి వచ్చి నన్ను చూసేదానివి. ఇప్పుడు నువ్వే హీరోయిన్‌వా? ఇప్పటిదాకా ఏం బేబీ అన్నాను... ఇప్పట్నుంచి ఏం హీరోయిన్ అనాలి’ అని నవ్వారు. (కళ్లు లేకున్నాక్యాన్సర్ చూపుతారు)
నన్ను ‘పెరుగన్నం’ అని పిలిచేవారు
ఫ్లైట్‌లో వెళుతున్నప్పుడు ‘నువ్వు చాలా ఇష్టపడి తినేవి ఏంటి’ అని అడిగితే ‘పెరుగన్నం సార్’ అన్నాను. అది కాదమ్మా... ‘జనరల్‌గా ఏం ఇష్టపడతావు’ అంటే ‘పెరుగన్నం’ అన్నాను. అప్పట్నుంచి నన్ను ఆయన ‘ఏయ్ పెరుగన్నం’ అని పిలిచేవారు. ఎక్కడ కనిపించినా ఇదే పిలుపు. అంతెందుకు ‘మిథునం’ ఫంక్షన్‌కి హైదరాబాద్ వచ్చినప్పుడు, ఆ తర్వాత నాగేశ్వరరావుగారి అవార్డు ఫంక్షన్ ఉండటంతో వెళ్లాను. నేను, బాలు సార్, చంద్రమోహన్ అందరం వెళ్లాం. ‘నైట్ డిన్నర్ ఉంది... నీ పెరుగన్నం నీకు రెడీ... వస్తావా’ అంటే, బాలూగారూ ‘అవునండీ... మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడైనా పెరుగన్నమే...’ అంటూ ‘పెరుగు లక్ష్మి’ అని పేరు పెట్టారాయన.
మా అమ్మతో షూటింగ్‌కు వెళ్లిప్పటి (పన్నెండేళ్ల వయసు) నుంచి ఏఎన్నార్ గారిలో నేను గమనించిన ఒక విషయం ఏంటంటే... మనం కొన్ని విషయాలు మర్చిపోతుంటాం... కానీ ఆయన మాత్రం ఏదీ మర్చిపోరు. వాట్ ఎ మెమరీ అంటే... ఓ సినిమా షూటింగ్ కోసం గోవా వెళ్లినప్పుడు నా స్కూల్ టైమ్‌లో నేను చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని, మాట్లాడితే ఆశ్చర్యపోయాను. ఇక సెన్సాఫ్ హ్యూమర్ అయితే సూపర్. నేను, వహీదా రెహమాన్‌గారు ఆయన కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నప్పుడు ఆయన ఇంటికి మమ్మల్ని డిన్న ర్‌కి పిలిచారు. అన్నపూర్ణమ్మ (ఏయన్నార్ సతీమణి), ఇంకా ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడిన విధానం చాలా బాగా అనిపించింది. నాగేశ్వరరావుగారి పిల్లలకు ఆయన క్లాస్ బిహేవియర్ వచ్చింది.
నాగార్జునని చిన్నప్పుడు నేను సెట్లో చూసి, ‘ఏయ్ హీరో... నేనే నీ హీరోయిన్‌ని... డ్యూయెట్ పాడాలి’ అంటే సిగ్గు పడిపోయి పారిపోయేవాడు. ‘రేయ్ రారా... నీ హీరోయిన్ వచ్చింది’ అని నాగేశ్వరరావుగారు నవ్వేవారు. ఆయన నవ్వేటప్పుడు చక్కని పలువరుస, పెద్ద కళ్లు చూడముచ్చటగా ఉండేవి. ‘పల్లెటూరి బావ’లో యాక్ట్ చేసేటప్పుడు నా కూతురు (నటి ఐశ్వర్య) లొకేషన్‌కి వస్తే... ‘నాకు ఇంకో హీరోయిన్ రెడీ అయిపోయింది’ అని తనని ఎత్తుకున్నారు. నాతోనే ఆయన అంత చనువుగా మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని. కానీ ఓ షూటింగ్‌లో సుమిత్ర నాతో ‘అక్కా... ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన. ఇంత బాగా మాట్లాడతారనుకోలేదు’ అని నాతో అంది. అందరితోనూ ఆయన ఆ΄్యాయంగా మాట్లాడేవారు... సరదాగా ఉండేవారు. సెట్లో ఎవరూ టెన్షన్ పడని వాతావరణాన్ని క్రియేట్ చేసేవారు.
‘నా హీరోయిన్’ అంటూ...
అప్పట్లో మదరాసులో నాకు ‘కళా సాగర్’ అవార్డు ఇచ్చారు. ఆ ఫంక్షన్‌కి వచ్చిన నాగేశ్వరరావుగారు, శివాజీ గణేశన్‌గారు ‘నా హీరోయిన్’ అంటూ నా చేయి పట్టుకుని, స్టేజి మీదకు తీసుకెళ్లి, అవార్డు ఇచ్చిన సంఘటన నాకెప్పటికీ గుర్తే. ఒక ఆర్టిస్ట్‌గా నాకు ఇంతకన్నా ఏం కావాలి? అప్పట్లో మొబైల్ ఫోన్ లేదు... సెల్ఫీ తీసుకోవడానికి. ఇక నాగేశ్వరరావుగారి మనోధైర్యం గురించి చెప్పాలి. 1973లో అనుకుంటా ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి యూఎస్ వెళుతున్నారు. ‘పల్లెటూరి బావ’ సినిమా చేస్తున్నాం. ఆయన తల్లిగా సుకుమారిగారు నటిస్తున్నారు. ఆపరేషన్‌కి వెళ్లే ముందు ‘నేను మళ్లీ రావాలి.. ఐ విల్ కమ్‌బ్యాక్ పాజిటివ్లీ. కానీ ఏదైనా జరగకూడనిది జరిగితే... అందుకే నా గుర్తుగా ఏదైనా ఇవ్వాలనుకుంటున్నా’ అని చాలా కూల్‌గా అన్నారు. మేం ‘అయ్యో... అలా అనకండి సార్’ అన్నాం. కానీ, గిఫ్ట్ ఇవ్వాల్సిందే అంటూ అమ్మాయిలకు వీఐపీ బ్రాండ్ మేకప్ వ్యానిటీ బాక్స్, అబ్బాయిలకు వీఐపీ బ్రీఫ్‌కేస్ ఇచ్చారు. నాకు రెడ్ కలర్ బాక్స్ ఇచ్చారు... ఇప్పటికీ ఆ గిఫ్ట్ నా దగ్గర భద్రంగా ఉంది.
ఆయన రోజూ ఒక కప్పు మీగడ తినేవారు. ‘ఈ మీగడ తినీ తినీ నేను హాస్పిటల్‌కి వెళుతున్నాను. నువ్వు పెరుగన్నంలో మీగడ వేసుకుని తినకు. మళ్లీ నాలా హాస్పిటల్‌కి వెళ్లాలి’ అన్నారు. ఒకసారి నేను ఒక షూటింగ్‌కి వెళుతూ తాజ్ బంజారా నుంచి కారులో వెళుతుంటే, పంచెకట్టులో ఓ ఐదారుగురు కనిపించారు. ‘మన సార్‌లా ఉందే’ అని కారు ఆపాను. ఆయన, సుబ్బరామి రెడ్డిగారు, ఇంకో ముగ్గురు నలుగురు ఉన్నారు. అప్పుడు టైమ్ ఉదయం ఆరు. నన్ను చూసి, ‘ఏం లక్ష్మి... ఎక్కడికి వెళుతున్నావు? షూటింగ్‌కా?’ అంటే... ‘సార్ మీ స్టూడియోకే వెళుతున్నాను’ అన్నాను. ‘వెరీ గుడ్... మై హీరోయిన్ లక్ష్మి’ అని తన ఫ్రెండ్స్‌కి పరిచయం చేశారు. వాకింగ్ స్టిక్ పట్టుకుని, ఆ పంచెకట్టులో ఆయన రూపాన్ని మర్చిపోలేను. ఆ ఆ΄్యాయంగా మాట్లాడటం అనే లెగసీ ఆయన కూతుళ్లకు, కొడుకులకు, ఆ తర్వాతి జెనరేషన్‌కి వచ్చింది.
నాలోని భయాన్ని తీసేశారు: శారద
నా ఫస్ట్ సినిమా (ఇద్దరు మిత్రులు) ఆయనతోనే. అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘కన్యాశుల్కం’ సినిమాలో ఒక పాటకి డ్యాన్స్ చేశాను. అప్పుడు నాకు పదేళ్లు ఉంటాయేమో. నా పదహారేళ్లప్పుడు ‘ఇద్దరు మిత్రులు’లో నాగేశ్వరరావుగారి చెల్లెలిగా చేశాను. అందులో ఆయనవి రెండు పాత్రలు. ఒక పాత్రకు నేను చెల్లెల్ని. ‘ఈ సీన్ ఇలా చెయ్యి... ఇదయ్యాక అలా చెయ్యాలి’ అంటూ దగ్గర కూర్చుని చక్కగా నేర్పేవారు. ఆ వయసులో నాకు నటనంటే తెలియదు. ఇలాంటి పెద్దవాళ్లతో నటించడం అంటే చిన్న విషయం కాదు. నాకు ఆ అవకాశం రావడం నా అదృష్టం.
మా ఫ్యామిలీలో పదమూడేళ్లకే పెళ్లి చేసి, పంపించేస్తారు. కానీ, మా అమ్మకు నన్ను ఆర్టిస్ట్‌ని చేయాలని ఉండేది. నాన్నని ఎంతో కన్విన్స్ చేసి, తీసుకొచ్చినప్పుడు నాకు దొరికిన అవకాశం ‘ఇద్దరు మిత్రులు’. ఆ సమయంలో ఎల్వీ ప్రసాద్‌గారి ఆఫీసులో నాకు నవరసాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. అప్పుడు చెల్లెలి పాత్రకు ఆర్టిస్ట్ దొరక్క తర్జన భర్జన పడుతున్నారు. అది తెలిసి, ‘మా దగ్గర ఒక అమ్మాయి ఉంది’ అని ‘ఇద్దరు మిత్రులు’ యూనిట్‌కి ఫోన్ చేసి, ఆ పక్కన ఉన్న వారి ఆఫీసుకి పంపించారు. నాతో రెండు డైలాగ్స్ చెప్పించారు. ‘వండర్‌ఫుల్... నాగేశ్వరరావుగారి చెల్లెలిగా నువ్వే చేయబోతున్నావు’ అని డైరెక్టర్ (ఆదుర్తి సుబ్బారావు)గారు అన్నారు. సెట్‌లో నాగేశ్వరరావుగారిని చూసినప్పుడు పెద్ద నటుడు, వయసులోనూ పెద్దవారు కాబట్టి కాస్త భయపడ్డాను.
కానీ మాలాంటి కొత్తవారిని ఆయన ప్రోత్సహించిన తీరు అద్భుతం. మాలోంచి భయాన్ని తీసేసేవారు. ‘శారదా.. ఈ సీన్ ఇలా చేయాలి’ అని చక్కగా నేర్పేవారు. తనది పెద్ద స్థాయి అని కాకుండా అందరితో కలిసిపోయేవారు. నటుడిగా ఆయన ఎంత గొ΄్పో.. వ్యక్తిగానూ అంతే గొప్ప. ఎదుటివాళ్లు బాగా యాక్ట్ చేస్తే కొందరు చూడలేరు. పైకొచ్చినా చూడలేరు. కానీ, నాగేశ్వరరావుగారికి అలాంటివి లేవు. ఆయనేమో ఆయన వర్క్ ఏమో అన్నట్లు ఉండేవారు. ఒక పాత్రను ఎలా అవగాహన చేసుకోవాలి? డైలాగ్స్ ఎలా పలకాలి వంటివి ఆయన్నుంచి నేర్చుకున్నాను. ఆయనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇంటికి వెళ్లాను. అదే ఆఖరిగా ఆయన్ను కలిసింది.
డైలాగ్స్ చెప్పింది ఈ అమ్మాయేనా అన్నారు: రోజా రమణి
నాగేశ్వరరావుగారి ‘మూగ మనసులు’ సినిమాలోని ‘గోదారి గట్టుంది...’ పాటను ఆడిషన్‌కి వెళ్లినప్పుడు పాడటం వల్ల నేను ‘భక్త ప్రహ్లాద’ సినిమాకి సెలక్ట్ అయ్యాను. ఇక ఆయన కాంబినేషన్‌లో నటించే అవకాశం నాకు ‘మరపురాని మనిషి’ సినిమాలో వచ్చింది. అప్పుడు నాకు పదేళ్లు. ఆయన నాతో ‘అమ్మాయ్... నువ్వు తొందరగా ఎదిగిపో... నా పక్కన హీరోయిన్‌గా చెయ్యాలి. ఇలా చిన్నపిల్ల వేషం వేయకూడదు’ అని సరదాగా అన్నారు. ఆ తర్వాత ‘ఆలు మగలు’ సినిమాలో ఆయన కోడలిగా చేశాను. అప్పుడు కూడా ‘ఏంటమ్మాయ్... నువ్వు నా పక్కన హీరోయిన్‌గా చేస్తావనుకుంటే చిన్నపిల్ల, కోడలు వేషాలు వేస్తావ్’ అని చాలా జోవియల్‌గా అన్నారు. ఓ పదేళ్ల క్రితం అనుకుంటా... ఒకసారి గీతాంజలిగారు మా ఇంటికి వచ్చారు. ‘రోజా... ఇవాళ నాగేశ్వరావుగారి బర్త్‌డే.
ఆయన ఇంటికి వెళుతున్నాను... నువ్వూ వస్తావా’ అన్నారు. ‘నేనెప్పుడూ అలా వెళ్లలేదు’ అన్నాను. ‘నాకోసం రావా ప్లీజ్. పెద్దాయన బెస్ల్సింగ్స్ తీసుకుందాం’ అన్నారావిడ. బ్లెస్సింగ్స్ అనగానే వెళ్లాలనిపించింది. ఇద్దరం వెళ్లాం. మేం వెళ్లినందుకు ఆయన ఎంత హ్యాపీగా ఫీలయ్యారంటే... ‘అదేంటీ... ఎప్పుడూ గీత మాత్రమే వస్తుంటుంది... నువ్వు వచ్చావ్’ అన్నారు. ‘నేనే తీసుకొచ్చా’ అన్నారు గీత. ‘ఓ... నువ్వు తీసుకొస్తే వచ్చిందా తను’ అన్నారాయన. వెంటనే నేను ‘మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను’ అన్నాను. ఆయన మాకు టిఫిన్ పెట్టారు. చాలాసేపు మాట్లాడారు. అదొక గ్రేట్ మెమరీగా నా మనసులో ఉండిపోయింది.
ఆ తర్వాత ఒక ఫంక్షన్‌లో నా జీవితంలో మర్చిపోలేని కాంప్లిమెంట్ ఇచ్చారాయన. ఆ స్టేజి మీద ‘భక్త ప్రహ్లాద’ సినిమా చూశాను. ఆ సినిమాలో ఈ అమ్మాయి వేదాలు, పాటలు, సంస్కృత డైలాగ్స్‌ని ఐదారేళ్లకే అంత బాగా ఎలా చెప్పగలిగింది? అసలు చెప్పింది ఈ అమ్మాయేనా? ఎవరైనా చెప్పారా? అని చాలామందిని అడిగాను. ఆ అమ్మాయే చెప్పిందన్నారు. దాంతో నేను మళ్లీ ఆ సినిమా చూశాను. లిప్ మూమెంట్ అంత కరెక్ట్‌గా ఎలా ఇచ్చిందా అని ఆశ్చర్యపోయాను’ అని నా గురించి చెప్పారు. మలయాళ సినిమా ‘చెంబరుత్తి’కి మద్రాసు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లు నాకు ఉత్తమ నటి అవార్డు ఇచ్చారు. ఆ అవార్డుని నాగేశ్వరరావుగారి చేతుల మీదగా అందుకోవడం అనేది నాకో మంచి మెమరీ.
మా బాబు తరుణ్ కూడా ఆయన చేతుల మీదగా అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత నాగేశ్వరరావుగారి పేరు మీద ఉన్న అవార్డును నాకు ఇచ్చారు. అది స్వీకరించడం నా అదృష్టం. ఇక నాకు బాగా గుర్తుండిపోయినది ఒకసారి ఆయనతో కలిసి చేసిన ఫ్లైట్ జర్నీ. హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్నాం. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. ఆయనకు బ్రేక్‌ఫాస్ట్ వచ్చింది. కానీ ఆయన ఒకే ఒక్క ఇడ్లీ, కొన్ని బొప్పాయి ముక్కలు తీసుకున్నారు. అంతే తీసుకుంటారా? అని అడిగితే, ‘అంతే అమ్మాయ్... బాగా ఆకలి అయితే ఇంకో ఇడ్లీ తింటాను’ అన్నారు. లిమిటెడ్ ఫుడ్, మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోలో వాకింగ్ ఈ విషయాలన్నింటినీ చెప్పారు. ఆయన లైఫ్‌స్టైల్ బాగుంటుంది.
నా ఎక్స్‌పెక్టేషన్‌ని దాటేశావు అన్నారు: మీనా
ఏయన్నార్‌గారి దగ్గర్నుంచి నేను నేర్చుకున్నది ‘పంక్చువాలిటీ’. ‘సీతారామయ్యగారి మనవరాలు’ సమయంలో ‘షూటింగ్ లొకేషన్లో ఎవరి కోసం అయినా నువ్వు వెయిట్ చేయొచ్చు. కానీ నీకోసం ఎవరూ వెయిట్ చేయకూడదు. అది ఫాలో అవ్వు’ అన్నారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ షూటింగ్ విషయంలో నేను అదే ఫాలో అవుతున్నాను. ఇక ఆ సినిమా చేసేటప్పుడు ‘నేను పెద్ద నటుణ్ణే. కానీ, ఇది నీ సినిమా. నువ్వే ఈ సినిమాకి బ్యాక్‌బోన్. క్యారెక్టర్‌ని బాగా అర్థం చేసుకుని డైలాగ్స్ చెప్పాలి... ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి’ అని ఆయన అన్నారు. ఆ సినిమా ప్రివ్యూ చూశాక ‘న్యూ కమర్ కదా అనుకున్నాను. కానీ బాగా చేశావమ్మా... నా ఎక్స్‌పెక్టేషన్‌ని దాటేశావు. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది’ అని అన్నారు.
ఎప్పుడు ఆలోచించినా ఏయన్నార్‌గారిలాంటి పెద్ద నటుడు, పైగా టైటిల్‌లో నా రోల్ కూడా ఉండటం అనేది చాలా పెద్ద విషయంగా అనిపిస్తుంటుంది. నిజానికి నేను ఆ సినిమా చేయాలా? వద్దా అనుకున్నాను. ఎందుకంటే చదువుకుంటున్న టైమ్‌లో ఆ చాన్స్ వచ్చింది. ఈ సినిమా క్లిక్ అయితే సినిమాల్లో కంటిన్యూ అవుదామని చేశాను. కట్ చేస్తే... నా లైఫ్ టర్నింగ్ మూవీ అయిపోయింది. ‘సీతారామయ్యగారి మనవరాలు’ ఫస్ట్ డే షూట్ అప్పుడు ఏయన్నార్‌గారి కాళ్లకు నమస్కారం చేసి, ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ సినిమా తర్వాత ఎక్కడ కనబడినా ‘నా మనవరాలు వచ్చింది... రా’ అని ఆయన అంటే... ‘తాతయ్యా... ఎలా ఉన్నారు’ అనేదాన్ని. నన్ను చూసి చాలా ప్రౌడ్‌గా ఫీలయ్యేవారు. అంతటి లెజెండ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నా లక్.
-డి.జి.భవాని
ఇదీ చదవండి : అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి!
Comments
Please login to add a commentAdd a comment