Juluru Gowri Shankar
-
అంబేడ్కర్ అనంతర భారతం ఇదేనా?
దేశ రాజకీయాలను ప్రభావితం చేసే చారిత్రాత్మక వేదికగా ఖమ్మం సిద్ధమైంది. ఒకనాడు ఎర్రకొండగా ఉన్న స్తంభాద్రి ఇప్పుడు ఎర్రకోటపై ప్రజల అజెండాను ఎగుర వేసే ఒక మహాశక్తికి శంఖారావ క్షేత్రం అవుతోంది. బీఆర్ఎస్ ఒక మహోన్నత సమాజ నిర్మాణం వైపు అడుగులు వేస్తూ సృజనాత్మక మార్పుకు నడుంబిగించే సభకు ఖమ్మం గుమ్మం స్వాగతం పలుకుతోంది. దేశం అన్ని రంగాల్లో దివాళా తీసింది. ఎంతో స్ఫూర్తితో నిర్మించుకున్న ప్రభుత్వ రంగం కొడిగట్టే దీపమవుతోంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతున్న తరుణంలో ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ గొంతు విప్పబోతుంది. ఎమర్జెన్సీ తర్వాత అన్ని ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడటంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు కదిలిన లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ వెంట దేశం నడిచింది. ఆనాడు ప్రజాస్వామ్య పరిరక్షణకు లెఫ్ట్, రైట్లందరూ కలిసి నడిచారు. ఇవ్వాళ కూడా కేంద్రంలో పెద్దలు రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తీరును చాటిచెబుతూ దేశంలోని ప్రజాస్వామిక శక్తులందర్నీ కూడగట్టవలసిన అవసరం ఉంది. దేశానికి అత్యవసరమైన ఆర్థిక విధానాలను రచించుకోవాలి. 2014 నుంచి దేశం ఉత్పత్తిని పెంచుకోవటంలో పూర్తిగా వెనుకడుగు వేస్తూ ఉంది. ప్రభుత్వ రంగ ఆస్తులను మాత్రం తెగనమ్మటంలో ముందుంది. తక్షణం ఈ అమ్మకాల నుంచి దేశాన్ని కాపాడాలి. సహజ వనరులను, అడవి సంపదలను గుత్తకు అప్పజెబుతున్న తీరుకు అడ్డుకట్టవేయాలి. నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగాన్ని తగ్గించడానికి యువతను ఉత్పత్తి రంగంలో ఎక్కువగా వాడుకోవాలి. భారీగా పెరిగిపోయిన ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు జరపాలి. అంబేడ్కర్ పేరు జెప్పి ఆయన ఆశయాలను నిర్వీర్యం చేస్తున్న తీరును ఎత్తి చూపాలి. ఒక కులానికి వ్యతిరేకంగా మరొక కులాన్నీ, ఒక మతానికి వ్యతిరేకంగా మరో మతాన్నీ రెచ్చగొట్టి విద్వేష భారతాన్ని రచిస్తున్న తీరుకు అడ్డుకట్టవేయాలి. భారత గడ్డపై పుట్టిన వాళ్లనే పరాయి వాళ్లను చేస్తున్న తీరు ప్రమాదకరమైనది. దేశభక్తి కావాలి కానీ విద్వేషభక్తి ఉండకూడదు. ఒక్క భాషపైననే ప్రేమకాకుండా దేశ ప్రజలు మాట్లాడే అన్ని భాషలపై ప్రేమ ఉండాలి. ఇతరులపై గుడ్డి ద్వేషాన్ని పెంచే భావజాలం ఏదైనా అది విషాన్ని నింపటం కంటే ప్రమాదకరమైనది. చివరకు పాఠ్యప్రణాళికల్లో కూడా మతభావనలు చూపించే దశకు పోవటం అన్యాయమని ఎవరైనా అడిగితే వారిని జాతివ్యతిరేకి అంటున్నారు. లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థలను పరిరక్షించకపోతే దేశం కుప్పకూలుతుంది. మహాత్మాగాంధీ, జ్యోతిబాఫూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ అనంతర భారతం ఇదేనా? దేశాన్ని సంపన్న భారతం చేయమంటే వలసల భారతంగా మార్చేశారు. వారి దుందుడుకు విధానాల పట్ల మొత్తం జాతిని మేల్కొలిపి ముందుకు నడిపించటానికే ఖమ్మం వేదికగా ప్రజల అజెండాకు రూపకల్పన జరుగుతోంది. కమండలాలకు సరైన సమాధానం చెప్పి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం నిలిపిన లల్లూప్రసాద్ యాదవ్‌లాగా, ములాయంసింగ్ యాదవ్‌లాగా, ఒక వీపీసింగ్ లాగా దేశంలోని వలస భారతానికి ధైర్యం చెప్పే సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉంది. తమకు అనుకూల రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక పద్ధతీ, తమకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలపైన కక్షకట్టే రాజకీయాలూ పోవాలి. తమకు అను కూలురైన సీఎంలు లేకపోతే గవర్నర్‌తో పాలి స్తామనే సంస్కృతి ఫెడరల్ వ్యవస్థను పెను ప్రమాదంలో పడవేస్తుంది. సంప్రదాయాల్లోకి, విశ్వాసాల్లోకి, నమ్మకాల్లోకి, మతాల్లోకి, కులాల్లోకి, గనుల్లోకి, గుడుల్లోకి, బడుల్లోకి, వనాల్లోకి, అడవుల్లోకి మన ఇంటి గడపల్లోకి, మంది మెదడుల్లోకి అన్నిట్లోకి తమ పాత భావాలను, ఛాంద సత్వాన్ని చొప్పించి ప్రజాస్వామ్యాన్ని లౌకికత్వాన్ని అవహేళన చేస్తున్నారు. ఎవరు తమను ప్రశ్నించినా ఈడీలు, బేడీలు వేస్తున్నారు. అన్ని వ్యవస్థలూ కళ్లముందే ధ్వంసం అవుతున్నప్పుడు ఇదేమి న్యాయమని అడిగితే నేరుగా జైలుకే పంపించేస్తున్నారు. ఇది ఫాసిజం కంటే ప్రమాదకమైనది. ఇపుడు తక్షణంగా దేశాన్ని రక్షించుకునేందుకు దేశభక్తియుత ఉద్యమాలు రావాలి. అటువంటి ఉద్యమాన్నే కేసీఆర్ ఖమ్మం వేదికగా ప్రారంభి స్తున్నారు. ఆ ఉద్యమంలో దేశ ప్రజ అంతా భాగం కావాలి. (క్లిక్ చేయండి: జాతీయత కొరవడిన పార్టీ.. స్వార్థ ప్రయోజనానికే పెద్దపీట) - జూలూరి గౌరీశంకర్ ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ (జనవరి 18న ఖమ్మంలో బీఆర్ఎస్ జనగర్జన) -
హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తదితరులు మంగళవారం మంత్రిని కలిశారు. పుస్తక ప్రదర్శనకు తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్) స్టేడియంలో అనుమతివ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు మంత్రి ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 35 ఏళ్లుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని భాషల పుస్తకాలతో పాటు తెలుగు భాషా సంస్కృతి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, దేశవ్యాప్తంగా 300 లకుపైగా పబ్లిషర్స్ రావడంతో ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా మారిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ‘తానా’ అంతర్జాతీయ కార్టూన్ పోటీ.. విజేతలకు రూ. లక్ష నగదు) -
తెలంగాణ నిజానిజాలు గమనిస్తోంది!
ఇప్పుడు తెలంగాణ ఎట్లుంది? తెలంగాణ తెగదెంపుల సంగ్రామంలో తెగించి స్థిర పడిన తెలంగాణ తనను తాను చూసుకుంటోంది. రేపటి భవిష్యత్తుపై గంపెడు ఆశలతో కలలు కంటోంది. మార్పును ప్రతినిత్యం కోరుకునే తెలంగాణ ఊహించని మార్పులతో ఊహకందనంత వేగంతో అభివృద్ధి చెందుతోంది. విషాదాల కొలిమి, విప్లవాల పొలి కేకలు, ఫెళఫెళ కూలిపడ్డ ఆధిపత్య అహంకారాలు... పాఠ్యాంశాలుగా మారిన తెలంగాణ ఇప్పుడు నిజానిజాల నిగ్గు తేల్చు కుంటోంది. ఎవరిది విద్రోహమో, ఏది విలీనమో, ఏది బల ప్రయోగమో, గాయాలు ఎక్కడ తగిలాయో, గేయాలై ఎక్కడ పలికాయో, సున్నితపు ఐకమత్యపు తెలంగాణ తీగలను ఎవరు తెంచ చూశారో... మళ్లీ అన్నింటినీ కలిపి జాతీయ ఐకమత్య మహానదిగా మన తెలంగాణను ఎవరు మారుస్తున్నారో... అంతా తెలంగాణ బిడ్డలకు తెలుసు. దయచేసి మళ్లీ ఇప్పుడు తెలంగాణ పాత గాయాల కట్లు విప్పి కారం చల్లే పనులు ఎవరూ చేయకండి. తరతరాల సామాజిక తాత్విక సహజత్వ జీవ జలపాతం తెలంగాణతనం. అబ్బురపరిచిన ఆశ్చర్యాల నుంచీ, నిప్పుల వర్షాల నుంచీ... సకల జనుల ప్రశాంత వెండి వెన్నెల సిరుల పందిరిగా మారిన తెలంగాణను సంరక్షించుకుందాం, పరిరక్షించుకుందాం. మానవీయ సంస్కృతికి పట్టుగొమ్మయిన తెలంగాణ అత్యున్నత మానవ సమాజ నిర్మాణం వైపు పయనించమంటోంది. ఈ కుళ్ళు కులసంకెళ్లను తెంచమంటోంది. కమ్ముకొస్తున్న మత మబ్బుల్ని చెదరగొట్టమంటోంది. ఒకనాడు భూమి, భుక్తి, విముక్తి అంటూ నినదించి ముందుకు సాగిన తెలంగాణ ఇప్పుడు ప్రతి మనిషినీ సంపదగా మార్చి ప్రపంచానికి ఒక నూతన సందేశం ఇవ్వమంటోంది. అన్నార్తులు, అనాథలు కానరాని సమాజ నిర్మాణం చేయమంటోంది. గంగా జమున తెహజీబ్ సంస్కృతిని విత్తనాలుగా చల్లి మహోన్నత మానవీయ పాఠంగా దేశాన్నే తీర్చిదిద్దుకుందాం అంటోంది. జాతీయ సమైక్యత దినోత్సవ మహాసందేశంగా జాతిగీతమై మోగ మంటుంది. తరతరాల వారసత్వ చరిత్రకు ఎవరు పేటెంట్ దారులు కాదని తెలంగాణ పదేపదే చెబుతోంది. ప్రపంచానికి పిడికెడు అన్నం పెడుతున్న రైతు భారతానికి పట్టాభిషేకం చేయమంటోంది తెలంగాణ. వ్యవసాయాన్ని పరిశ్రమలుగా మార్చి, పండించిన పంటలకు రైతు కూలీలనే అత్యా ధునిక వ్యవసాయ పరిశ్రమల యజమానులను చేయమంటోంది. సాటి మనుషుల్ని కుల మతాల పేరుతో వెంటాడుతున్న ఆటవిక సంస్కృతిని దరిదాపుల్లోకి రానీయకుండా మానవీయ మహా కోటను నిర్మించుకుంది తెలంగాణ. ఆధిపత్య కుల అహంకార పదఘట్టనల కింద పశువుగా ప్రవర్తించే దుర్మార్గ సంస్కృతిని దరిదాపులకు రాకుండా సరిహద్దు సైనికునిగా పహారా కాస్తోంది తెలంగాణ. ఆదివాసీ గిరిజన వికాసంలో భాగంగా ‘మా గూడెంలో మా రాజ్యం’, ‘మా తండాలో మా రాజ్యం’ అన్న కలలను నిజం చేస్తోంది తెలంగాణ. పేదలైన ముస్లింలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు దక్కాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మైనారిటీ పిల్లలకు ఒక్క తెలంగాణ లోనే 1160 గురుకులాలను పెట్టి కార్పొరేట్ స్థాయి చదువు అందిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ వేలాది గురుకులాలు రావాలని తలుస్తోంది తెలంగాణ. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును నూతన సచివాలయానికి పెట్టి ఎద ఎదలో రాజ్యాంగ రక్షణ స్ఫూర్తిని చాటింది. దేశ పార్ల మెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టమని నినదిస్తున్న ఆచరణవాది తెలంగాణ. సస్యశ్యామల దేశంలో క్షామాలు, నిరుద్యోగ రక్కసులు, రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని నడుంబిగించింది తెలంగాణ. నెర్రెలు బాసిన కరువు భూముల్లోకి గంగమ్మను రప్పించేందుకు కాళేశ్వరాన్ని కట్టుకొని జలకళతో నిండింది తెలంగాణ. ఇంటింటికీ ‘మిషన్ భగీరథ’నిచ్చి గొంతు తడిపిన తెలంగాణ... దేశానికి ఆ పథకాన్ని ఎందుకు అందించలేమని పయనమవుతోంది. దేశంలో జరగాల్సింది జాతీయ సమైక్యతా ఉత్సవాలు కానీ విద్వేష ఉత్సవాలు కాదని గొంతెత్తి పిలుస్తోంది తెలంగాణ. పగలు సెగలులేని, పరమత ద్వేషాలు లేని దేశమే సకల సంపదలతో తులతూగుతుందని ఆచరణాత్మకంగా తెలంగాణ తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. దళితుల ఆత్మగౌరవ జెండాగా నిలిచిన ‘దళిత బంధు’ పథకాన్ని పెట్టి వాళ్లను ఉత్పత్తి శక్తులుగా తీర్చి దిద్దుతున్న తెలంగాణ దేశంలో దళితులంతా ఇట్లనే వర్ధిల్లాలని తలంచుతోంది. బహుజనులకు ఆత్మగౌరవ భవనాలనిచ్చి ఆయా కులాల సామాజిక ఎదుగుదలకు ఇంతగా కృషిచేసిన రాష్ట్రం దేశంలో మరోటి లేదంటోంది తెలంగాణ. ఇప్పుడు అన్ని రంగా లలో పురోభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణను చూస్తున్నాం. వర్ధిల్లు వీర తెలంగాణ ! వర్ధిల్లు సామరస్య తెలంగాణ! జూలూరీ గౌరిశంకర్ (ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి) -
ఇప్పుడు మతం కాదు... ప్రేమ కావాలి!
మనుషుల మధ్య అంతరాలను పెంచుతున్నప్పుడు అందరం కలిసి మానవీయ సమాజాన్ని కాపాడు కోవాలి. ఏకమైతేనే నిలుస్తామన్న సత్యానికి అల్లుకుపోవాలి. విడి విడిగా విడిపోతే మనకు మనంగా కృంగిపోతాం. సామూహిక తత్వం నశించిపోయిన వ్యవస్థ గడ్డకట్టుకు పోతుంది. కరోనా కాలంలో మాస్క్నే భరించలేని వాళ్ళం మనుషుల మధ్య దూరాలను పెంచుకొని ఎట్లా బతుకుతాం! మనుషులుగా మనం ఎడం ఎడంగా, ఎడమొఖం పెడమొఖంగా, గోడకు కొట్టిన మేకుల్లాగా విడిపోయి ఎట్లా జీవించగలం! వేష భాషలు ఎన్ని ఉన్నా, ఈ ప్రపంచానికి మహా బోధితత్వపు సంఘజీవన భాష ఉంది. మనిషిని మనిషి ద్వేషించుకునే విద్వేష భావజాలం చాలా ప్రమాద కరమైనది. విభిన్న తత్వాల కలయికగా ఉన్న దేశ ప్రజలు... ద్వేషరూపులుగా మారితే మిగిలేది బూడిదే కదా! నువ్వూ నేను, వాడు వీడు, అతను ఆమె ... అందరం పిల్లల మనసులపై కుల విభజన రేఖలు, మతం పచ్చ బొట్లు పొడిస్తే సమతుల్యత అల్ల కల్లోలమై సమాజం గందరంగోళం కాదా? దేన్నైనా భరిస్తాం. దేన్నైనా సహిస్తాం. మన ఇంటి వెనుక, ఇంటి ముందు ఎవరికి వాళ్లుగా కలువలేని గోడలను కట్టుకుంటే మనందరం బావిలో కప్పలుగా మారిపోతాం. ఇట్లే ఎవరి కులం వారిదనీ, ఎవరి మతం వారిదనీ; రంగు, రూపు, ఊరు, వాడ పేర్లతో విభజన రేఖలు గీసుకుంటూ పోతే ఆటవిక సమాజ మూలాల దగ్గరకు పోతాం. వేల సంవత్సరాల సాంస్కృతిక మానవ పరిణామ క్రమాన్నీ, మన ఐకమత్య సమాజ ఉన్నత తత్వాన్నీ... విభేదాల, విద్వేషాల పేరుతో మనకు మనమే కూల్చుకుంటూ పోతే చివరకు మిగిలేదేమిటి? మానవ సంబంధాల వనంలో మానవీయ ప్రేమ మొక్కలు నాటటానికి మారుగా విద్వేషపు మొక్కలు నాటితే దేశమే విద్వేషాల కుంపటిగా మారుతుంది. సమస్త వృత్తుల, సకల కులాల, మతాల ఐక్యమత్య సమాజాన్ని విభజించి చూడగలమా? హుస్సేన్ సాగర్ కీవల ఆవల, గండిపేటకు అటువైపు ఇటువైపు, చార్మినార్‌కు ముందు వెనక బెర్రలు గీసి.. మసీదుకు, మందిరానికి భేదాలు పెట్టి; చర్చిలకు, గుళ్లకు పోటీలు పెట్టి చూసే దుస్థితిని ఊహల దరిదాపులకు సైతం రానివ్వలేం కదా! గుడి, మసీదు, చర్చి అన్నీ ఒకటే. నమ్మకాలు, విశ్వాసాలన్నీ ఎవరి మదిలో వాళ్ళం భద్రంగా గుండె గుండెల్లో దాచు కుందాం. ఎవరి ఆహారపు అలవాట్లు వారివి. ఎవరి వేషధారణలు వారివి. ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి భాషలు వారివి. దేవుళ్ళందరూ ఒకటే. మనుషులందరూ సమానమేనన్న సర్వమత సమానత్వ లౌకికతత్వం మన దేశానికి ప్రాణవాయువు. దాన్ని రక్షించుకుందాం. పరిరక్షించుకుందాం. పరమత సహనం పవిత్ర జెండాగా, మనందరి సామూహిక లక్ష్యంగా, ధ్యేయంగా ముందుకు సాగుదాం. కలలో కూడా మన మానవీయ సమాజ గూడుపై ఎవరు చెయ్యేసినా వదిలేది లేదు. ‘గంగా జమునా తెహాజీబ్’ అని గొప్పగా కీర్తించబడ్డ ఈ నేల మీద మత ముద్రల విభజనలను గీస్తే సహిస్తామా? ఐకమత్య దారులపైనే అభివృద్ధి సగర్వంగా నడుచుకుంటూ పోతుంది. మనందరం ఐకమత్య సమాజానికి చిహ్నాలుగా నిలవాలి. సోదరభావంతో ఎదగాలి. అందర్నీ ఆదరించి అక్కున చేర్చుకునే హైదరాబాద్ మహాసంస్కృతి ఇంకో వేయ్యేళ్లు వర్ధిల్లే విధంగా మనందరం మానవీయ మహా మొక్కల్ని ఎద ఎదలో నాటడాన్ని ఒక మహోద్యమంగా చేపడదాం. విభిన్న సంస్కృతుల సంగమ స్థలిని విష సంస్కృతుల కూడలిగా మార్చే కుట్రలను తిప్పికొడదాం. తెలంగాణ అంటే కలిసి జీవించే ఆత్మీయతల అలయ్ బలాయ్ సంస్కృతి. సబ్బండ వర్ణాల ఐక్య సంస్కృతే తెలంగాణ అసలు అస్తిత్వం. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని చెదరగొట్టే కుట్రలు ఎవరు చేసినా వారిని తెలంగాణ సమాజం విడిచిపెట్టదని గుర్తుపెట్టుకోవాలి. తెగించి తెలంగాణను బెర్రగీసి తెచ్చుకున్నోళ్లం సమాజాన్ని ఛిద్రంచేసే మత దురహంకారాన్ని తిప్పికొట్టి తీరాలి. విచ్ఛిన్నకర మత, కుల ఆధిపత్య కుట్రలను చూసి తెలంగాణ విలపిస్తోంది. సమూహాల, గుంపుల తలలు లెక్కలు కట్టుకొని; పోటీపెట్టి, విద్వేషాల్ని రెచ్చగొడుతున్న విచ్ఛిన్నకర శక్తుల్ని చూసి తెలంగాణ తల్లడిల్లుతోంది. సబ్బండ వర్ణాల సంస్కృతిని పరిరక్షించుకోవటానికి తెలంగాణలో జరగాల్సిందేమిటో అభ్యుదయ తెలంగాణ సమాజమే నిర్ణయించుకుని ముందుకు సాగుతది. అలసత్వం వద్దు. చూద్దాంలే చూసుకుంటూ కాసేపా గుదాం అనుకోవద్దు. నాకెందుకులే, మనకెందుకులే, నాదాకా వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటే అందరూ అయిపోయినాక ఆ మతభూతం చివరివానిగా నిన్ను కూడా వదిలిపెట్టదు. విషవాయువులు వ్యాపించిన ప్రాంతమంతా విషకోరల బారిన పడకతప్పదు. అందులో ఎవరికీ మినహాయింపు ఉండదని గుర్తు పెట్టుకోవాలి. కన్నీళ్లను తుడుచుకుని, ఇప్పటిదాకా పడ్డ కష్టాల పట్టె నుంచి బైట పడుతూ, నెర్రలు బాసిన నేలల్లో పచ్చటి పంటలను చూసి పరవశిస్తూ ముందుకు సాగుతోంది తెలంగాణ. కలహాల చిచ్చులు పెడ్తున్న కుట్రపూరిత రాజకీయ మత పిచ్చిగాళ్ల నుంచి తక్షణం ఈ నేలను రక్షించుకోవాలి. తెలంగాణను కలహాల రణస్థలంగా మార్చే వారిని గుర్తుపట్టాలి. ఆదర్శాలకు అగ్గి పెట్టేవాళ్ల నుంచి తెలంగాణను కాపాడుకోవాలే! (క్లిక్: చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!) ‘మనిషిని ద్వేషించడానికి సరిపడా మతం వుంది మనకు. ప్రేమించడానికి కావలసినంత మతం లేదు’ అన్నాడు జోనాథన్ స్విఫ్ట్. అంటే మనుషులు మను షులుగా బతకడానికి ఇప్పుడున్న మతం సరిపోదు. కాస్త ప్రేమను అరువు తెచ్చుకోవాలి. మనిషిని మనిషితో కలిపి కుట్టే కన్నీటి దారం పేరు ప్రేమ. మనిషిని మనిషితో కలిపి బంధించే ఆనంద ఉద్వేగం పేరు ప్రేమ. ఇప్పుడు మరింత ప్రేమ కావాలి! మరింత సహనం కావాలి!! (క్లిక్: ఇంగ్లిష్ వెలుగులు చెదరనివ్వొద్దు) - జూలూరు గౌరీశంకర్ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు -
పదును తగ్గని యుద్ధం చేసినోళ్లం
దాడి ఒకలాగుండదు... ఒక రూపంలో ఉండదు... దాడికి పలు రూపాలు, పలు అవతారాలు! ఏ విశ్వాసాలను నమ్మకాలనైనా అడ్డుపెట్టుకుని అమాంతం దాడి చేయవచ్చు. దాడి చేయటమన్నది పథకం ప్రకారం ఆట మధ్యలో అవాంతరాలు సృష్టించి అడ్డంగా గెలవటం లాంటిది కదా! అధికారం కోసం కల్లోలాలు సృష్టించటం, అంతర్యుద్ధాలు సృష్టించటం, సమాజాన్నే రెండు ముక్కలు చేయటం, రెండు మతాల మధ్య మంట రాజేయటం, కులాల మద్య రాజకీయ కుంపట్లు పెట్టటం, పార్టీలను చీల్చటం... ఎన్ని పన్నాగాలో! ఇలాంటి వారికి కొనుగోలు శక్తి తక్కువేం కాదు... దేశాన్ని ఎన్ని రకాలుగా ప్రైవేటైజేషన్ చేయాలో అన్నీ రకాలుగా చేసేశారు. నానా అగచాట్లు పెడతారు. అరగోసలు, అర్వతిప్పలు! ఇపుడు నా దేశ ప్రజాస్వామ్యమనే సౌధం రకరకాల అధికార దాహాలతో చేసే విచ్చలవిడి దాడులతో నెర్రలు బాస్తోంది... లౌకికత్వం తనను తాను రక్షించుకోలేక... భిన్న సంస్కృతుల, భిన్న జాతుల ఐక్యతను కాపాడలేక దురాక్రమణల దాడులకు నిలువలేక తల్లడిల్లుతుంది. జాతి సంస్కృతే చిన్నాభిన్నమౌతూ ఛిద్రమైపోతుంది. ఏమి దౌష్ట్యం? ఏమి దుర్నీతి? ఏమైపోతున్నాం... ఎటుపోతున్నాం. మన దేశ దశ దిశల లక్ష్యం ఏ వైపునకు పయనిస్తుందో కదా! రాష్ట్రాలపై కేంద్రం దాడులు మాములైపోయాయి. రాష్ట్రాలను అస్థిరపరచటం మామూలు క్రీడైపోయింది. ఒక ప్రభుత్వం ఒక్క పూటలో కూలిపోయి ఎప్పుడది వన్డే క్రికెట్ మ్యాచ్ అవుతుందో తెలియదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవటం, వాళ్ల చేతులతో వాళ్లే కూల్చుకునేలా చేయటం షరా మామూలైన స్థితికి ప్రజలస్వామ్యం రావటం చెప్పలేని బాధ. ప్రశ్నలను జోకొట్టవచ్చనే భ్రమలు బాగా పెరిగాయి. ప్రశ్నిస్తే ప్రశ్న నోటిని మూసేసి ప్రశ్నలను కిడ్నాప్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రశ్నలనే బెదిరిస్తూ ప్రశ్నను ప్రశ్నించకుండా ప్రశ్నల గొంతులపై సీబీఐలను పెడ్తుండ్రు. ప్రశ్నల తలలు లేవకుండా పార్టీల అంతర్గత కలహాలు రాజేస్తుండ్రు. ప్రశ్నలు పురి విప్పకుండా ప్రశ్నల గాలులను ఆపాలని చూస్తుండ్రు. ప్రశ్నించకుండా అధికార ముద్రలతో దాడులన్నీ చేస్తుండ్రు. దుర్నీతి రాజకీయాలు చేస్తున్నవాళ్లే చీకటి రోజుల గురించి మాట్లాడుతుండటమే విచిత్ర చిత్రం. ఎందుకో ఈ తెలంగాణ మట్టి ఆధిపత్యాలను ససేమిరా ఒప్పుకోలేదు. మత ఆధిపత్యాన్ని అస్సలు సహించదు. తెలంగాణ పరమత సహన లౌకికతత్వం కోరుకునే మానవీయ మహాతల్లి. తెలంగాణ అందరికోసం తపన పడే బోళాతనమున్న మహాతల్లి. ఇది సృజనాత్మకమైన నేల. సబ్బండ వర్ణాల మహా సంస్కృతిని తనువంతా నిండిన తెలంగాణ నేల ఇది. ఇదొక మానవీయ మహా సమాజం. మానవీయత మత సామరస్యం తెలంగాణ తల్లివేరు. దీన్ని పెకలించటం ఎవరితరం కాదు. మనం ఉరుముల్లా ఉరిమినోళ్లం. జన జాతర్ల మెరుపులుగా మెరిసిన వాళ్లం. పిడుగుల్లా కురిసినోళ్లం. జన జలప్రళయాలుగా పొంగి పొరలినోళ్లం. ఆవేశ ఆగ్రహాలకు ఆది అంతాలుగా నిలిచిన సింహగర్జనలం. (క్లిక్: లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహించాలి!) ఒక సుదీర్ఘ ప్రయాణం చేసి లక్ష్యాన్ని చేరుకున్న విజయ చిహ్నాలం కదా... ఇపుడు కమ్ముకొస్తున్న కుల, మత కారు మేఘాలను చెల్లాచెదురు చేయగల శక్తులం మనమే. ఎంతపోరు చేసి ఎన్నెన్ని త్యాగాలు చేసి తెలంగాణను నిలబెట్టుకున్నమో... గెలిచిన తెలంగాణను మత గత్తరల నుంచి, కుల కలరాల నుంచి కాపాడుకోలేమా. మనకు కొత్తగా చెప్పాల్సిన పన్లేదు. చేసిన యుద్ధం పదును ఏ మాత్రం తగ్గనోళ్లం... మనమే గెలుస్తాం. (క్లిక్: సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం?) - జూలూరు గౌరీశంకర్ చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి