సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశ విభజన సందర్భంగా చెలరేగిన మత ఘర్షణల్లో లక్షలాది ప్రజలు మరణించినప్పుటికీ భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకిక రాజ్యాంగానికే కట్టుబడి పనిచేశారు. ఏ మతాన్ని ప్రోత్సహించక పోవడం, ఏ మతం పట్ల వివక్ష చూపక పోవడం, సర్వమతాలను సమాన దృష్టితో ప్రభుత్వం చూడడమే భారత లౌకిక వాదం. అయితే 1980 దశకం నుంచి ఈ భారత లౌకిక వాదం బలహీన పడుతూ వస్తోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నాడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారికంగా దీపావళి వేడుకలను నిర్వహించగా, అయోధ్యలో తమ ప్రభుత్వమే రామాలయాన్ని నిర్మిస్తుందని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం నాడు అధికార హోదాలో కాలికాదేవీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో భారత దేశానిది లౌకిక రాజ్యాంగమని ఏమాత్రం చెప్పుకోవడానికి, గర్వపడడానికి వీల్లేదు.
దేశంలో లౌకికవాద పునాదులను కదిలిస్తూ కేవలం హిందూ మతం నుంచి మరో మతంలోకి మార్పిడులను అడ్డుకునేందుకే దేశంలోని పలు రాష్ట్రాల్లో మత మార్పిడుల నిరోధక చట్టాలను తీసుకొచ్చారు. గోవధ నిషేధ చట్టాలను తీసుకొచ్చారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా లౌకికవాదానికి పట్టం కడతారన్న నమ్మకం కూడా ఎవరికి లేకుండా పోయింది. ఎన్నికల రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుళ్లూ గోపురాల చుట్టూ తిరుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment