‘లౌకికత’నే లేకుండా చేస్తే..! | AP Vital article on secularism | Sakshi
Sakshi News home page

‘లౌకికత’నే లేకుండా చేస్తే..!

Published Sat, Dec 30 2017 1:46 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

AP Vital article on secularism - Sakshi

లౌకిక రాజ్యం అనే పేరు వింటేనే దురదగుండాకు ఒంటికి పూసుకున్నట్లు భావిస్తున్న కేంద్రం, రాజ్యాం గంలో లౌకికత అనే పేరు లేకుండా చేయాలని భావిస్తోంది. అలా మన దేశం కూడా మతతత్వరాజ్యమైన పాకిస్తాన్‌ దుస్థితికి వెళ్లాలని పాలకుల ప్రయత్నం.

అప్పట్లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు, ‘రాజ్యాంగాన్ని సవరించేం దుకు ఏమైనా పరిమితులు ఉన్నాయా?’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. ‘అత్యవసర పరిస్థితిలో భారత రాజ్యాంగం అన్న పేరు, దాని పీఠికలో ప్రజాస్వామ్య లౌకిక, సోషలిస్టు రిపబ్లిక్‌ అన్న విశేషాలకు పర్యాయపదాలుగా అలానే ఉంచి, లోపల పేజీలలో వీటి వివరణలు అన్నింటినీ సవరించవచ్చు’ అని కేంద్రప్రభుత్వం తరపున అటార్నీ జనరల్‌ సమాధానమిచ్చారు. ‘అలా అయితే ప్రాథమిక హక్కులు, పౌరులకు జీవించే హక్కు సంగతేమిటి?’ అని న్యాయమూర్తులు అడిగారు. ‘దాన్ని కూడా పూర్వపక్షం చేస్తూ సవరణ చేయవచ్చు’ అని అదే అటార్నీ జనరల్‌ వివరణ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ పాలనలో ప్రధాని మోదీ, అమిత్‌ షాల ద్వయం పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీలో వలే మన భారతదేశమైన ఈ దేశ ప్రజలం, మాకై మేము నిర్మించుకున్న ప్రజాస్వామ్య, లౌకిక, సోషలిస్టు రిపబ్లిక్‌ అన్న పేరు మాత్రం మిగిలింది. మచ్చుకు స్థూలంగా చూద్దాం!

మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య రాజ్యాంగం. కానీ ప్రజలను తమ బూటకపు వాగ్దానాలతో వంచించి, అధికారంలోకి వచ్చిన పిదప, ఆ వాగ్దానాలన్నింటినీ తుంగలోతొక్కి తద్విరుద్ధమైన ప్రజావ్యతిరేక విధానాలతో, అధికారంలో కులుకుతున్నా, అదీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమేనట. ఇందుకు గత 3, 4 ఏళ్ల బాబు అబద్ధపు పాలనను మించిన సరైన ఉదాహరణ ఏముంటుంది? మరో ఘోరం ఏమంటే, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని పలు రకాల భయభ్రాంతులకు గురిచేసి, ధన, పదవీ ప్రలోభాలతో లోబర్చుకుని ఫిరాయింపచేసి.. వారిని తమ వెన్నుపోటు పార్టీలో చేర్చుకున్నారు.

మన రాజ్యాంగంలో మరో మౌలిక అంశం సోషలిజం. నేటికీ మన రాజ్యాంగ స్వరూపం పేరుకు మాత్రమే నిలిచివుంది. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఆ పేరును కూడా తొలగించడమే తరువాయిగా ఉంటోంది. కాంగ్రెస్‌ పాలకుల ఆచరణ ఎలా ఉండినా, అప్పుడప్పుడు సోషలిజం అనే పదాన్ని కలలో గుర్తుకొచ్చినట్లు అయినా అనేవారు. నేడు మోదీ, షా ద్వయం ఆ పదం ఉచ్చరించడం సరే, వినేందుకు కూడా ఘంటాకర్ణులే. మహాభారతంలో ఘంటాకర్ణుడు అని ఒక పాత్ర ఉంది. ఇతడు కృష్ణుడు అనే పదాన్ని సైతం వినడట. అందుకే చెవులకు గంటలు కట్టుకుని కృష్ణ అన్న పదం వినబడితే చాలు గంటల చప్పుడు చేసుకునేవాడట.

మనందరం మోదీ పెద్దనోట్ల రద్దు వ్యవహారం చూశాం. కుబేరుల నల్లధనాన్ని తెల్లగా శుభ్రం చేసి, చలామణిలోకి తెచ్చే ప్రయత్నమే. ఎవరో ఎందుకు, మన బాబుగారి కుటుంబం మర్నాడు పెద్ద నోట్ల రద్దు కానున్నాయన్న ఉప్పందుకుని ఆ రోజే తమ హెరిటేజ్‌ కంపెనీ షేర్లను అమ్మేసి, తమ నల్లడబ్బును దర్జాగా వేల కోట్లు తెల్లగా మార్చి, తెల్లదొరలల్లే తిరుగుతున్నారు కదా. నరేంద్ర మోదీ తన ఈ ‘విప్లవ సోషలిస్టు’ చర్యవలన కుబేరులు, కోటీశ్వరులు కునుకు పట్టక తల్లడిల్లుతున్నారని ప్రచారం చేసుకున్నారు. తీరా జరిగిందేమిటి? నల్ల డబ్బు కనబడకుండా, ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్లు నిర్భయంగా తిరుగుతున్నారు.

మోదీ పాలనలో మరో మహా గొప్ప చర్య జీఎస్టీ పన్నుల విధానం. దీని దెబ్బకు సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు వీరందరి నడ్డి విరిగింది. ఉన్న కొన్ని ఉద్యోగాలు ఊడి రోడ్డున పడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీ రెండింటినీ రెండుచేతులతో ఆహ్వానించిన మన బాబు ప్రస్తుతం కిమ్మనడం లేదు. ప్రస్తుతం దేశంలో అత్యంత ధనవంతుల చేతిలో 90 శాతం సంపద పోగైతే, కడు పేదవారిలో 20 శాతం మందికి ఒక శాతం కూడా సంపద లేకుండా తిండి, నిలువనీడ కూడా కరువై కటిక దారిద్య్రం అనుభవిస్తున్నారు. మరి ఆ పెద్దల సేవలో తరిస్తున్న ప్రభువుల పాలనలో సోషలిజమా? మన రాజ్యాంగ పీఠికలో ఉన్న సోషలిజం పదం ప్రపంచీకరణకు గురై కుంచించుకుపోతోంది.

ఇక లౌకిక రాజ్యం. మోదీ, షాలకు ఈ లౌకిక అన్న పదం వింటేనే దురదగుండాకు ఒంటికి పూసుకున్నట్లు ఎలర్జీతో వొళ్లంతా దురద. వీరికి, వీరి గురువులకు కావలసింది అఖండభారత హిందూ రాజ్యం. మన లౌకిక రాజ్యంలో ఎవరి మతం వారు స్వీకరించవచ్చు. ఎవరి విశ్వాసాలను వారు పాటించవచ్చు. కానీ పరమత ద్వేషమే పునాదిగా కలిగిన మతతత్వవాదులకు ఎవరికైనా మన రాజ్యాంగంలోని లౌకికత నచ్చదు. వీరందరికీ మన దేశం కూడా పాకిస్తాన్‌ ఆదర్శంలో నడవాలనే దుగ్ధ.

దేశంలో గోసంరక్షకుల పేరుతో, మానవభక్షక సమూహాలు పేట్రేగి పోతున్నారు. గోసంరక్షణ వంకతో ముస్లిం, క్రైస్తవులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు కూడా జరుగుతున్నాయి. కాగా, అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రాచీన కాలంలో మన దేశంలో అంతరిక్ష వాహనాలు, పుçష్పకవాహనాలు ఉండేవని, ప్లాస్టిక్‌ సర్జరీతో తెగిన శిరస్సులను కూడా అతికించేవారని ప్రసంగం దంచిన నేపథ్యంలో మన హేతువాదులకు, ప్రగతిశీలురకు రక్షణ ఎక్కడ? అందుకే గౌరీలంకేశ్‌ వంటివారు హత్యకు గురవుతున్నారు. రోహిత్‌ వేముల వంటి దళిత మేధావి తన దళిత పుట్టుకే తన మృత్యువైందంటూ హృదయం బద్దలై ఆత్మహత్య చేసుకున్నాడు. వీటన్నింటినీ చూస్తే లౌకికత్వమా ఎక్కడున్నావు, రాజ్యాంగ పీఠికలో మాత్రమే ఉన్నావు అనాలనిపిస్తుంది. వీటన్నింటికీ తీసిపోనిది, మన దేశ ఫెడరల్‌ స్వభావాన్నే మార్చి, రిపబ్లిక్‌ బదులు, ఏకశిలా సదృశంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు, ఒకే పన్నుల విధానం, ఒక జాతి అంటూ ఉన్మత్త జాతీయత పెచ్చరిల్లుతున్నది. ఇక మిగిలింది ‘ఒకే నేత మోదీ’ అన్నదే.

లెనిన్‌ తన రోజుల్లో రష్యన్‌ పార్లమెంటు డ్యూమాను బాతాఖానీ క్లబ్‌ అన్నాడు. కులక్కులు, భూస్వాముల సభగా మిగిలిపోయిన డ్యూమాను రద్దు చేసి, దాన్ని నిజమైన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే సభగా మారుస్తామని ప్రకటించారు. మన దేశ పార్లమెంటు కూడా బాతాఖానీ క్లబ్‌గా తయారైందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆచరణలో సాధించేది ఏమీ లేదని అందుకే సాయుధ పోరాటం, తదితర పోరాట మార్గాలను ఎంచుకోవలసిందేనని కొన్ని విప్లవ కమ్యూనిస్టు గ్రూపులు, ప్రధానంగా మావోయిస్టు పార్టీ ప్రచారం చేయడమే కాకుండా పరిమితంగానైనా గత 50 ఏళ్లుగా అదే పంధాను కొనసాగిస్తోంది. వారిని తీవ్రవాదులని, అంతర్గత ప్రజాస్వామ్య విచ్ఛిన్నకులని ఆరోపిస్తున్న నేటి కేంద్ర, రాష్ట్ర పాలకుల వ్యవహార శైలిని చూస్తుంటే ప్రజలు తమ అనుభవం ద్వారా ఆ మావోయిస్టుల ప్రచారానికి ప్రభావితులయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది. తస్మాత్‌ జాగ్రత్త.


డాక్టర్‌ ఏపీ విఠల్‌
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్‌ : 19848 06972

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement