రాయ్‌పూర్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర తర్వాతి నుంచి వినిపిస్తున్న ‘లౌకికతత్వం’ అనే పదం అతి పెద్ద అబద్దమని అన్నారు. దేశాన్ని ఈ పదం సర్వనాశనం చేసిందని వ్యాఖ్యానించారు. చరిత్రను తప్పుగా చెప్పడం రాజ ద్రోహం కంటే పెద్ద నేరమని అన్నారు. ఎవరినైనా ఉద్దేశించి ‘పాకీ’ అనే పదాన్ని వాడితే యూరప్‌లో ఘోరమైన అవమానంగా భావిస్తారని వెల్లడించారు.
దైనిక్ జాగ్రణ్ గ్రూప్ రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆదిత్యనాథ్.. కమ్యూనలిజమ్, సెక్యులరిజమ్‌లపై ఎదురైన ప్రశ్నకు సమాధానమిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజమ్ అనే పదాన్ని సృష్టించిన వారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సివుంటుందని యోగి అన్నారు. ఏ వ్యవస్థా కూడా లౌకికతత్వాన్ని పాటించలేదని చెప్పారు. రాజకీయ వ్యవస్థ న్యూట్రల్‌గా మాత్రమే ఉండగలదని అన్నారు.
ఒకే విధానంతో ప్రభుత్వం నడవాలని ఎవరైనా చెప్పినా అది సాధ్యపడదని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్న తాను 22 కోట్ల మంది ప్రజల భద్రతకు, వారి భావాలకు సమాధానం ఇవ్వాల్సివుంటుందని అన్నారు. ఒక కమ్యూనిటీని నాశనం చేసేందుకు తాను సీఎం కుర్చీలో కూర్చొలేదని చెప్పారు. పాకిస్తాన్, పాకీ అనే పదాలను యూరప్‌లో వినియోగిస్తే అవమానంగా భావిస్తారని చెప్పారు. దేశంలో టెర్రరిజం, నక్సలిజం, వేర్పాటువాదాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు.
వందల కోట్ల మంది ప్రజల భావాలతో కాంగ్రెస్ ప్రభుత్వ ఆడుకుందని అన్నారు. స్వార్థంతో దేశాన్ని విడగొట్టిన పాపం కూడా కాంగ్రెస్ మూటగట్టుకుందన్నారు. కుల, మత, భాషల ప్రతిపాదికన దేశాన్ని చీల్చిన కాంగ్రెస్ పాపం ఊరికేపోదన్నారు. దేశం మొత్తం వసుధైక కుటుంబంలా ఉండాలే తప్ప ఇలా చిన్నభిన్నంగా ఉండకూడదని చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని రామ రాజ్యంతో పోల్చుతూ.. ప్రజల బాధలు అర్థం చేసుకునే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని అన్నారు. బీజేపీ కార్యకర్తలు చత్తీస్‌గఢ్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment