
దేశ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: విదేశీ గడ్డపై స్వదేశీ ప్రతిపక్షాలను అవమానపరిచేలా మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు డాక్టర్ కె.నారాయణ డిమాండ్ చేశారు. ఒక పార్టీ నేతగా కాకుండా దేశప్రధానిగా 125 కోట్ల మంది ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు ప్రతినిధిగా జపాన్ పర్యటనలో హుందాగా వ్యవహరించాల్సిందన్నారు. జపాన్ చక్రవర్తికి భగవద్గీతను బహూకరించిన సందర్భంగా ‘భారత్‌లో నా సెక్యులర్ మిత్రుల నుంచి విమర్శల తుపాను ఎదురుకావొచ్చు. అయినా ఫరవాలేదు. వారికి కూడా జీవనోపాధి ఉండాలి కదా. నేను లేకుంటే వారికి జీవనోపాధి పోతుంది’ అని మోడీ వ్యాఖ్యానించారన్నారు. విదేశంలో స్వదేశీ సెక్యులరిస్టులను అవమానించడమేనా భారతీయీకరణ అని నారాయణ ప్రశ్నించారు.