
సాక్షి, హైదరాబాద్: తమ కార్యాలయం లోపలికి ఎప్పుడూ రాని పోలీసులు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తే మాత్రం లోపలికి వచ్చారని, ఇంతకు ఈ పోలీసులు మోదీకి చెందిన కేంద్ర బలగాలా? లేదా సీఎం కేసీఆర్ పోలీసులా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, ఇ.టి.నర్సింహతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణతో సింగరేణి సంస్థను చంపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రధాని పర్యటన రాజకీయ దురుద్దేశంతో కూడిందే తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడలేదన్నారు. మునుగోడులో బీజేపీ ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు నిరాశ చెందకుండా ఉండేందుకే మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చారని ఎద్దేవాచేశారు.
సింగరేణి సంస్థలో 49 శాతం వాటా ఉన్న కేంద్రం దీన్ని ప్రైవేటు పరం చేయలేదని, అందుకే ఈ సంస్థను చంపే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. 2015లో గోదావరి పరివాహక ప్రాంతంలోని బొగ్గుబావిని సింగరేణికి ఇవ్వాలనే మైన్స్ మినరల్స్ డెవలప్ రెగ్యులేషన్ చట్టాన్ని 2015లో సవరించి, కమర్షియల్ మైనింగ్ అనుమతినిచ్చారన్నారు. తద్వారా ఇప్పటికే 240 మైన్స్ ప్రైవేటుకు ఇవ్వాలని గుర్తించారని, ఇందులో 98 మైన్స్ ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారని వివరించారు. ఇందులో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారని నారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment