
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సామ్రాజ్య వాద శక్తుల కంటే దారుణంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మండిపడ్డారు. టీఆర్‌ఎస్ పతనం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్న కొన్ని చట్టాలపై అభ్యంతరం తెలుపుతూ గాంధీభవన్ నుంచి శాంతియుత ర్యాలీ తీయాలనుకున్నామని తెలిపారు. కాగా లౌకిక వాదాన్ని పెంచే ర్యాలీకి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆరోపించారు. దీంతో మౌనంగా శాంతి యాత్ర చేద్దామనుకున్నా ఇప్పుడు పోలీసులు అనుమతించలేదని, గాంధీభవన్ చుట్టు వేలాది మంది పోలీసులను మోహరించి కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేయడం దారుణమని పేర్కొన్నారు.
మరోవైపు కేంద్రంలో గాంధీని చంపిన వారి పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. 6 దశాబ్దాల తమ పాలనలో లౌకిక వాదంలో బతికిన ప్రజలు ప్రస్తుతం బీజేపీ పాలనలో మాత్రం బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి మోదీకి పరోక్షంగా కేసీఆర్ సహాయసహకారాలు అందించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి గుండెను తట్టి లేపుదామని కార్యకర్తలకు భట్టి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment