సంపాదకీయం
సెక్యులరిజాన్ని ఈ దేశ రాజకీయాల్లోకి ఏ క్షణంలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారోగానీ దానికి వ్యతిరేకంగా కావొచ్చు, అనుకూలంగా కావొచ్చు... మొత్తానికి మాత్రం దాన్నుంచి దూరంగా ఎవరూ ఉండలేకపోతున్నారు. 80వ దశకం చివరిలో ఈ సెక్యులర్ పదానికి ప్రత్యామ్నాయంగా ‘సూడో సెక్యులర్’ పదం సృష్టించి తమను మతతత్వవాదులుగా ముద్రవేసేవారికి గట్టి జవాబివ్వడానికి బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ ప్రయత్నించారు. కానీ, చివరకు ఆయన కూడా ‘సెక్యులర్’ అనిపించుకోవడానికి తహతహలాడారు. అందుకోసం పాకిస్థాన్ పర్యటనను అవకాశంగా ఉపయోగించుకుని జిన్నాపై ప్రశంసల వర్షం కురిపించారు.
అది సంఘ్‌పరివార్‌కు కోపం తెప్పించడం, పార్టీలో ఆయన ప్రాభవాన్ని క్రమేపీ తగ్గించి వేర్వేరు ప్రయోగాల అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దించడం వర్తమాన చరిత్ర. గుజరాత్‌లో గోధ్రా అనంతర నరమేథంవల్ల కావొచ్చు...ఆయన పరిపాలన తీరువల్ల కావొచ్చు మతతత్వవాదిగా మోడీకి ఉన్న ముద్ర జగద్వితం. ఆ సంగతి ఆయనకూ తెలుసు. అందుకే, ఈమధ్య దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన ఒక యువ సమ్మేళనంలో మోడీయే ఆ సంగతిని ఒప్పుకున్నారు. తనను అందరూ ‘హిందూత్వ వాది’ అంటారనీ...కానీ, తన వాస్తవ ఆలోచనా విధానం వేరని చెప్పారు. ‘ముందు మరుగుదొడ్లు...తర్వాతే దేవాలయాలు’అనేదే ఆ విధానం సారాంశమని వివరించారు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. ‘నాపై ఉన్న అభిప్రాయాన్నిబట్టి చూస్తే ఇలా ఆలోచించడానికి, చెప్పడానికి ఎంతో సాహసం ఉండాలి’ అన్నారు. అలా సాహసిస్తేనే నాయకత్వ లక్షణం ఉన్నట్టని చెప్పారు.
నిజానికి మరుగుదొడ్ల సమస్య మన దేశంలో తీవ్రమైనదే.
సెల్‌ఫోన్ల సంఖ్యతో పోల్చినా, టీవీ సెట్లతో పోల్చినా, బ్యాంకు ఖాతాలతో పోల్చినా మరుగుదొడ్ల సంఖ్య చాలా తక్కువని 2011లో విడుదల చేసిన జనాభాలెక్కలు తేల్చిచెప్పాయి. దేశంలో 59 శాతం మందికి బ్యాంకు ఖాతాలున్నాయని, 63 శాతం మందికి సెల్‌ఫోన్లున్నాయని, 48 శాతం మందికి టీవీ సెట్లున్నాయని ఆ లెక్కలు చెబుతున్నాయి. కానీ, మరుగుదొడ్లున్న వారి శాతం కేవలం 47 మాత్రమేనని... డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఉన్నవారు 50 శాతం కంటే తక్కువేనని ఆ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక మంచినీటి కనెక్షన్లు ఉన్న ఇళ్లు 43.5 శాతం మాత్రమే. ఇవన్నీ చేదు వాస్తవాలు. అందులో సందేహమేమీ లేదు.
పారిశుద్ధ్యం అత్యంత అధ్వాన్నంగా ఉండటంవల్ల ఎందరెందరో అంటురోగాలబారిన పడుతున్నారు. అందువల్ల ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండితీరాలని నరేంద్ర మోడీ చెప్పడంలో వైపరీత్యమేమీ లేదు. కానీ, ఈ సమస్యలోకి దేవాలయాలను లాక్కొచ్చి వాటికంటే ముందు మరుగుదొడ్లే ముఖ్యమని చెప్పడమే ఆయన పార్టీవారికిగానీ, వారి మిత్రులకుగానీ, ఆయనను ప్రతిష్టించిన సంఘ్‌పరివార్‌కుగానీ మింగుడు పడని విషయం. మరుగుదొడ్లను హిందీలో శౌచాలయ అంటారు గనుక... దేవాలయం దానికి ప్రాసగా ఉపయోగపడుతుంది గనుక అలా అన్నారా? తనపై ఉన్న మతతత్వవాది ముద్రను చెరిపేసుకుని సెక్యులర్‌గా కనబడాలని కోరుకుంటు న్నారా? తనను తాను అతివాద హిందూత్వనుంచి వేరుపరచుకోవాలనుకున్నారా? తాను సమర్ధవంతమైన పరిపాలనకు ప్రాధాన్యమిస్తాను తప్ప అనవసర భావోద్వేగాలతో ముడిపడి ఉండే అంశాలపై అంతగా దృష్టిపెట్టనని చెప్పదలుచుకున్నారా? ఆయన ఉద్దేశమేమిటో ఆ పార్టీవారికే ఇప్పుడు అర్ధంకాని విషయం. శివసేన మాత్రం ఇకపై మోడీ ‘జైశ్రీరాం’కు బదులు ‘జై జైరాం’ అనాలని విమర్శించింది.
కొన్నాళ్లక్రితం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేష్ ఈ తరహాలోనే మాట్లాడటాన్ని శివసేన గుర్తుచేసింది. మరుగుదొడ్లకంటే దేవాలయాలే మనదేశంలో అధికమని అప్పట్లో జైరాం వ్యాఖ్యానించారు. దేవాలయాలకంటే మరుగుదొడ్లే పవిత్రమైనవని కూడా ఆయన నోరుజారారు. దాంతో జైరాం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకగణం డిమాండ్‌చేసింది. కేంద్ర మంత్రిగా ఉంటూ మరుగుదొడ్లు లేని అధ్వాన్నస్థితికి బాధ్యతవహించి దాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నించకుండా ఆ సమస్యను దేవాలయాలతో ముడి పెట్టడమేమిటని ఇతర పార్టీలవారుకూడా ప్రశ్నించారు.
మన ప్రణాళికాసంఘం అజెండాలోగానీ, విధానకర్తల ఆలోచనల్లో గానీ ఇంత కీలకమైన సమస్యకు చోటేలేదు. పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేవని పిల్ దాఖలైనప్పుడు ఈ రెండు ప్రాథమిక సౌకర్యాలనూ నిర్దిష్ట వ్యవధిలోగా కల్పించాలని నిరుడు సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ సమస్య కారణంగా ఆడపిల్లల్లో అధికశాతం మంది అయిదో తరగతితో చదువుకు స్వస్తి చెబుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఏడాదిక్రితం ఈ ఆదేశాలిచ్చింది. అయితే, ఇంతకాలం గడిచినా ఆ ఆదేశాలను అమలుపరిచిన దాఖలాలెక్కడా లేవు. ఉపన్యాసకళలో నరేంద్ర మోడీకున్న సామర్ధ్యం సామాన్యమైనది కాదు.
సభికులను మంత్రముగ్ధుల్ని చేయగల వాక్పటిమ, తాను చెప్పదలుచుకున్న అంశాన్ని ప్రభావవంతంగా వ్యక్తీకరించడం, అందుకు తగ్గ హావభావాలను ప్రకటించడం ఆయన సొంతం. అయితే, ఆరోజు సభకు హాజరైన వేలాదిమంది యువజనాన్ని చూసి, అక్కడ చర్చకొచ్చిన ‘అభివృద్ధి’ అంశాన్ని గమనించి మైమరచి మాట్లాడారేమోగానీ... భావోద్వేగాలతో, మనోభావాలతో ముడిపడే ఉండే అంశాన్ని మరుగుదొడ్లవంటి అంశంతో సమంచే యడానికి లేదా పోటీపెట్టడానికి ప్రయత్నించడాన్ని సెక్యులరిస్టులు కూడా హర్షించరు. జైరాంరమేష్ అయినా, నరేంద్రమోడీ అయినా సమస్యలను లేవనెత్తడంలో, వాటిని పరిష్కరించడంలో చిత్తశుద్ధి కనబరచాలని... మంచి ఫలితాలను సాధించాలని, అందువల్ల దేశ ప్రజలకు మేలు కలగాలని కోరుకుంటారు.
మోడీ ఆంతర్యం?!
Published Sat, Oct 5 2013 11:52 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement