
బెంగళూరు: కన్నడ సినీ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె సవతి తండ్రి, డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు ప్రమేయంపై నిగ్గు తేల్చాలని కర్ణాటక ప్రభుత్వం అదనపు చీఫ్ సెక్రటరీ గౌరవ్ గుప్తాను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయినట్లు సీఎం కార్యాలయం మంగళవారం తెలిపింది.
ఇక, అదే సమయంలో, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధి నిర్వహణలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం, లోటుపాట్లపైనా విచారణ చేపట్టాలని సీఐడీ విభాగాన్ని ఆదేశించింది. తక్షణమే దర్యాప్తు చేపట్టి, వారం లోగా నివేదిక అందించాలని స్పష్టం చేసింది. విచారణకు సహకరించాల్సిందిగా సంబంధిత పోలీసు విభాగాలను సీఎంవో కోరింది.
రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ నెల 3వ తేదీన దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న రన్యా రావు వద్ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ)అధికారులు రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వా«దీనం చేసుకున్నారు. మరునాడు ఆమె ఇంట్లో మరికొంత బంగారం, డబ్బు స్వా«దీనం చేసుకోవడం తెలిసిందే. తరచూ దుబాయి వెళ్లి వస్తూ ఆమె బంగారాన్ని దొంగచాటుగా తీసుకువస్తోందని, విమానాశ్రయంలోని పోలీసు సిబ్బంది సోదాలు జరపకుండా ఆమెను పంపించి వేస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
కాగా, రన్యా రావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంతో మంత్రులకు సంబంధాలున్నట్లు వస్తున్న వార్తలన్నీ రాజకీయ పుకార్లేనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొట్టిపారేశారు. కేంద్ర విభాగాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
DRI Busts Smuggling Nexus: Ranya Rao’s associate, Tarun Raju, has been taken into custody as part of the ongoing smuggling investigation.#RanyaRao #TarunRaju #DRIProbe #SmugglingCase #BreakingNews #NewsX pic.twitter.com/7zE4CBQA3i
— NewsX World (@NewsX) March 11, 2025
హోటల్ యజమాని మనవడు అరెస్ట్
ఇదే కేసులో డీఆర్‌ఐ అధికారులు మంగళవారం బెంగళూరులోని అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును అరెస్ట్ చేశారు. అతడిని బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల కస్టడీకి అనుమతించిందని డీఆర్‌ఐ తెలిపింది. రన్యా రావు, తరుణ్ రాజులకు సన్నిహిత సంబంధాలున్నాయని, విదేశాల నుంచి బంగారాన్ని దొంగచాటుగా తేవడం వీరు కూడబలుక్కుని చేసిందేనని అంటోంది. రన్యా రావు వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో వీరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టినా చట్ట విరుద్ధ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారంది. దుబాయి నుంచి బంగారాన్ని తీసుకువచ్చేటప్పుడు రన్యా రావు తరుణ్ రాజుతో ఫోన్‌లో మాట్లాడినట్లు డీఆర్‌ఐ తెలిపింది. వీరిద్దరినీ వేర్వేరుగా, కలిపి సైతం విచారించినట్లు వివరించింది. అయితే, విచారణ సమయంలో అధికారులు తనను బెదిరించారని, మానసికంగా వేధించారని సోమవారం కోర్టు విచారణ సమయంలో రన్యా రావు ఆరోపించింది. తనను కొట్ట లేదు కానీ, పరుషంగా దూషించారని తెలిపింది. ఇష్టం లేకున్నా తనతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని రోదిస్తూ జడ్జికి ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment