కర్నూలు జిల్లా ప్రజలకు ఉచితంగా మాస్కులు ఇస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప
సాక్షి, అమరావతి: మళ్లీ కోరలు చాస్తున్న కరోనాపై పోలీసులు వార్ ప్రకటించారు. కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లకు ఆదేశాలిచ్చారు. దీంతో వారు రంగంలోకి దిగి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. శనివారం సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చిన పోలీసులు వాహన చోదకులకు అవగాహన కల్పించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కె.నారాయణ్‌నాయక్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వారిని ఆపి వారికి గులాబీ పూలు అందించి కోవిడ్ ప్రమాదాన్ని వివరించి జాగ్రత్తలు చెప్పారు. వారి చేతులకు శానిటైజ్ చేసి ఉచితంగా మాస్క్‌లు అందించారు. కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డుపైకి వచ్చి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉచితంగా మాస్క్ లు పంపిణీ చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌లతో పాటు పలువురు ఎస్పీల పర్యవేక్షణలో ఆయా జిల్లాల్లో కోవిడ్ జాగ్రత్తలపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. మాస్కులు ధరించకుండా రోడ్లపైకి, జనంలోకి వచ్చే వారికి జరిమానా తప్పదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment