Special drives
-
GHMC: కోటికి చేరువలో టీకా
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): గ్రేటర్లో కోవిడ్ టీకాలు కోటికి చేరువయ్యాయి. అంచనాకు మించి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కేవలం స్థానికులే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు, వలస కూలీలు, వ్యాపారులు కూడా ఇక్కడే టీకాలు వేయించుకుంటున్నారు. ఫలితంగా గ్రేటర్ జనాభా కంటే ఎక్కువ టీకాలు వేయడం గమనార్హం. గ్రేటర్లో 1.20 కోట్ల జనాభా ఉన్నట్లు అంచనా. వీరిలో ఐదేళ్లలోపు వారే సుమారు పది లక్షల మంది ఉంటారు. 6 నుంచి 18 ఏళ్ల లోపు వారు మరో 20 లక్షల వరకు ఉంటారు. అయితే గ్రేటర్ జిల్లాల్లో ఇప్పటికే అంచనాలకు మించి టీకాలు వేయడం గమనార్హం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 93,92,811 మంది కోవిడ్ టీకాలు వేసుకున్నారు. వీరిలో 51,43,186 మంది పురుషులు కాగా, 42,48,032 మంది మహిళలు ఉన్నారు. వీరితో పాటు 1593 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 27,43,266 మంది ఇప్పటికే రెండు డోసులు పూర్తి చేసుకోగా, మరో 66,49,545 మంది మొదటి డోసును పూర్తి చేసుకుని రెండో డోసు కోసం ఎదురుచూస్తున్నారు. ఏ సెంటర్లో ఏ వ్యాక్సిన్ వేస్తున్నారో తెలియక లబ్ధిదారులు సమీపంలోని ఆరోగ్య కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. లక్షణాలు ఒకటే..టెస్టులు రెండు.. ► టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో ప్రస్తుతం నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ► వందమందిలో ఒకరిద్దరికి పాజిటివ్ నిర్ధారణ అవుతున్నప్పటికీ వైరస్ తీవ్రత గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. ► పాజిటివ్ నిర్ధారణ అయిన వారు కూడా చాలా వరకు హోం ఐసోలేషన్‌లోనే కోలుకుంటున్నారు. ► గత ఏడాదితో పోలిస్తే ఈసారి డెంగీ కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 600పైగా కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 200పైగా, మేడ్చల్ జిల్లాలో 180పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ► కరోనా, డెంగీ లక్షణాల్లో జ్వరం కామన్ సింప్టమ్‌గా ఉండటంతో ఆయా బాధితులు ఆందోళన చెందుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఆయా టెస్టింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ► ఫలితంగా ఇటీవల కోవిడ్ టెస్టింగ్ కేంద్రాలు జ్వరపీడితులతో రద్దీగా మారుతున్నాయి. కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారు డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. లక్ష్యానికి మించి టీకాలు రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 1039188 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వీరిలో 1,09,932 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 253 మంది మినహా మిగిలిన వారంతా కోలుకున్నారు. తాజాగా శనివారం 1858 నమూనాలను పరీక్షిస్తే...వీటిలో 25 పాజిటివ్ నిర్ధారణ అయ్యయి. జిల్లాలో కోవిడ్ టీకాల కార్యక్రమం లక్ష్యానికి మించి కొనసాగుతోంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల వారికి కూడా ఇక్కడ టీకాలు వేస్తున్నాం. జిల్లాలో 22 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేయగా, ఇప్పటి వరకు 26 లక్షల మందికిపైగా టీకాలు వేశాం. – డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, రంగారెడ్డి చదవండి: కోవిడ్ బాధితులకు ఇన్హేలర్ స్టెరాయిడ్స్! -
కరోనాపై మళ్లీ పోలీస్ వార్
సాక్షి, అమరావతి: మళ్లీ కోరలు చాస్తున్న కరోనాపై పోలీసులు వార్ ప్రకటించారు. కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లకు ఆదేశాలిచ్చారు. దీంతో వారు రంగంలోకి దిగి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. శనివారం సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చిన పోలీసులు వాహన చోదకులకు అవగాహన కల్పించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కె.నారాయణ్‌నాయక్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వారిని ఆపి వారికి గులాబీ పూలు అందించి కోవిడ్ ప్రమాదాన్ని వివరించి జాగ్రత్తలు చెప్పారు. వారి చేతులకు శానిటైజ్ చేసి ఉచితంగా మాస్క్‌లు అందించారు. కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డుపైకి వచ్చి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉచితంగా మాస్క్ లు పంపిణీ చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌లతో పాటు పలువురు ఎస్పీల పర్యవేక్షణలో ఆయా జిల్లాల్లో కోవిడ్ జాగ్రత్తలపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. మాస్కులు ధరించకుండా రోడ్లపైకి, జనంలోకి వచ్చే వారికి జరిమానా తప్పదని హెచ్చరించారు. -
రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సుల తనిఖీలు
సాక్షి, విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఉదయం నుంచి రవాణాశాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. డీటీసీ మీరా ప్రసాద్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బస్సులను తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 152 బస్సులపై కేసులు నమోదుచేయగా.. వాటిలో 125 బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీటీసీ మీరా ప్రసాద్ మాట్లాడుతూ.. స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందని తెలిపారు. రవాణాశాఖ మంత్రి, కమిషనర్ల ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నామని చెప్పారు. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తున్నామన్నారు. విద్యార్థులను తరలించే ప్రైవేట్ వాహనాలు, ఆటోలను కూడా తనిఖీ చేస్తున్నామని వెల్లడించారు. స్కూల్ బస్సులతో పాటు అందరూ రవాణాశాఖ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. -
55 మంది‘తండ్రులకు’ జైలు
సాక్షి, హైదరాబాద్: అత్యంత తీవ్రమైన ఉల్లంఘనగా భావించే మైనర్ డ్రైవింగ్‌పై నగర ట్రాఫిక్ విభాగం అధికారులు నెల రోజులుగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఎవరైనా చిక్కితే జరిమానాతో సరిపెట్టడం లేదు. వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రైవర్లుగా ఉన్న మైనర్లు, వీరికి వాహనాలిచ్చిన తల్లిదండ్రులు, యజమానులపై కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేస్తున్నారు. ఇలా గత నెల రోజుల కాలంలో 1,079 చార్జిషీట్లు దాఖలు చేయగా... మొత్తం 55 మంది తండ్రులకు ఒకటి నుంచి రెండు రోజులు జైలు శిక్ష పడింది. గురువారం ఒక్కరోజే నాంపల్లిలోని 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కె.అల్తాఫ్ హుస్సేన్ 10 మందికి ఒకరోజు చొప్పున జైలు శిక్ష విధించారు. బుధవారం టోలిచౌకి పరిధికి చెందిన ఓ మైనర్‌కు ఒక రోజు శిక్ష పడటంతో జువెనైల్ హోమ్‌కు తరలించారు. మైనర్ డ్రైవింగ్‌పై తొలిసారిగా బాలుడికి శిక్ష గత కొన్నాళ్లుగా వాహనం ఇచ్చిన నేరంపై తండ్రులకు ఒకటి నుంచి రెండు రోజుల వరకు జైలు శిక్షలు పడుతున్నా... ఇలా మైనర్ డ్రైవింగ్ కేసులో బాలుడిని జువెనైల్ హోమ్‌కు తరలించడం ఇదే తొలిసారి అని డీసీపీ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని ప్రధానంగా మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పుగా మారేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పును తెచ్చిపెట్టేవి. మైనర్ డ్రైవింగ్ మూడో కేటగిరీ కిందికి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం (ఎంవీ యాక్ట్) పదహారేళ్ల లోపు వయసున్న వారు ఎలాంటి వాహనాలనూ నడపకూడదు. 16 ఏళ్లు నిండిన వారు మాత్రం కేవలం గేర్లు లేని సాధారణ వాహనాలు నడిపే అవకాశం ఉంటుంది. పద్దెనిమిదేళ్లు నిండిన తరవాత మాత్రమే గేర్స్‌తో కూడిన వాహనాలు నడపడానికి అర్హులు. చట్ట ప్రకారం మైనర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చిన యజమాని సైతం శిక్షార్హుడే. ఇప్పటి వరకు మైనర్ డ్రైవింగ్ కేసుల్లో అత్యంత అరుదుగా మాత్రమే... అదీ వాహనం నడిపే వ్యక్తిపై చార్జిషీట్ దాఖలు చేసేవారు. మోటారు వాహనాల చట్టంలోని 180 సెక్షన్ ప్రకారం ఓ మైనర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే... అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమానికీ జరిమానా విధించే అవకాశం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటున్న ట్రాఫిక్ పోలీసులు గత నెల రోజుల్లో అనేక మంది ‘వాహన యజమానుల’పై చార్జిషీట్స్ దాఖలు చేశారు. వీరంతా ఆయా మైనర్ల తండ్రులే కావడం గమనార్హం. -
‘ప్లేటు’ మారితే వాహనం సీజ్
నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల దృష్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఆదేశాలు జారీ ‘నిషా’చరుల రక్తపరీక్షలకూ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నగరంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అమల వుతోంది. క్షేత్రస్థాయి అధికారులు నేరుగా జరిమానా లు విధించట్లేదు. ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు తీసి ఈ–చలాన్ పంపిస్తున్నారు. వీటిని పంపాలంటే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ నిర్దేశిత ప్రమాణాలతో ఉండటం అవసరం. అలా కానప్పుడు ఈ–చలాన్ చేరకపోవడమో, వేరే వారికి వెళ్లడమో జరుగుతుంది. ప్రస్తుతం నగరంలో సంచరిస్తున్న అనేక వాహనాలకు నంబర్ ప్లేట్లు నిబంధనల ప్రకారం లేకపోవడంతో ఈ ప్రక్రియ దెబ్బతింటోంది. దీంతో ట్రాఫిక్ విభాగం అధికారులు.. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని నిర్ణయించారు. నగరవ్యాప్తంగా సోమవారం నుంచి ఈ స్పెషల్‌డ్రైవ్ ప్రారంభమైంది. అక్రమ నంబర్ ప్లేట్ల కారణంగా ఈ–చలాన్ నుంచి తప్పించుకోవడంతో పాటు అసాంఘిక శక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, ఉగ్రవాదుల కదలికలు సైతం కనిపెట్టడం కష్టంగా మారిందని అధికారులు అంటున్నారు. మందుబాబులకు బ్లడ్ టెస్టులు సైతం... ఇక నుంచి నగర ట్రాఫిక్ పోలీసులు స్పెషల్‌డ్రైవ్స్‌లో వాహనచోదకుల్ని అవసరమైన సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్షిస్తారు. అప్పటికీ వారు సందేహం వ్యక్తం చేస్తే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి రక్తనమూనాలను సేకరించడం ద్వారా పరీక్షించాలని నిర్ణయించారు. నిబంధనలు, సూచనలివే.. ► ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాలు, కార్లకు తెల్లరంగు ప్లేటుపై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. ► కమర్షియల్, గూడ్స్ వాహనాలకు పసుపు రంగు ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. ► నంబర్ ప్లేట్‌పై పేర్లు, బొమ్మలు, సందేశాలు తదితరాలు నిషేధం. ► ఎవరైనా బోగస్ నంబర్ ప్లేట్లు కలిగి ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేస్తారు. ► వాహనచోదకులు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (కనీసం జిరాక్సు ప్రతులైనా) లేదంటే స్మార్ట్‌ఫోన్‌లోని ఆర్టీఏ యాప్‌లో కచ్చితంగా వీటిని కలిగి ఉండాలి. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ 200 ్ఠ 100 మిల్లీ మీటర్లు, తేలికపాటి వాహనాలు, ప్యాసింజర్ కార్లకు 340 ్ఠ 200 మిల్లీ మీటర్లు లేదా 500 ్ఠ 120 మిల్లీమీటర్లు, మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలకు 340 ్ఠ200 మిల్లీ మీటర్ల సైజుల్లో ఉండాలి. అన్ని సర్టిఫికెట్లు ఉండాల్సిందే ‘వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేటు ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటే తక్షణం చలాన్ జారీ చేయడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటాం. వాహనచోదకులు ఆ వాహనా నికి సంబంధించిన ధ్రువీకరణలు తీసుకువచ్చి న తర్వాత పరిశీలిస్తాం. ఆ వాహనం ఇన్సూ రెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉన్నాయా? లేదా? అనేది పరిగణనలోకి తీసుకుంటాం. అవి లేకుంటే దానికి సంబంధించి చలాన్ జారీచేసి ఆ మొత్తం వసూలు చేస్తాం. ఇవన్నీ పూర్తయిన తర్వాతే వాహనాన్ని తిరిగి అప్పగిస్తాం’. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
సబ్సిడీకి ఎసరు!
- గ్యాస్ సబ్సిడీ రూ.200 రద్దుకు ప్రభుత్వ పన్నాగం - వినియోగదారులకు నచ్చజెప్పి దరఖాస్తులు పూర్తిచేయించాలని హుకుం - గ్యాస్ ఏజెన్సీలకు టార్గెట్లు - త్వరలో స్పెషల్ డ్రైవ్‌లు - ఆసక్తి చూపని వినియోగదారులు విజయవాడ : చుక్కలనంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో విలవిల్లాడుతున్న వినియోగదారుడిని మరింత కుంగదీసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతోంది. వంటగ్యాస్ కోసం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సొమ్ము రద్దుచేసే ఎత్తుగడ వేసింది. గ్యాస్ సబ్సిడీ సొమ్మును స్వచ్ఛందంగా వదులుకోండంటూ ఇప్పటికే పిలుపునిచ్చిన ప్రభుత్వం నెమ్మదిగా పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకుంటున్నట్లు దరఖాస్తులు సేకరించాలని గ్యాస్ కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో గ్యాస్ కంపెనీల అధికారులు ఏజెన్సీలకు దరఖాస్తులు పంపి సబ్సిడీ కనెక్షన్లను తగ్గించాలని లోపాయికారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో హెచ్పీసీ, ఐవోసీ, బీపీసీ కంపెనీలకు చెందిన 74 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో 11 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో సంపన్న, ఉద్యోగ, మధ్యతరగతి వర్గాలకు నచ్చజెప్పి సబ్సిడీ వదులుకునేలా చూడాలని గ్యాస్ కంపెనీలు టార్గెట్ విధించినట్టు సమాచారం. ఒక్కో గ్యాస్ ఏజెన్సీ నెలకు 200 నుంచి 500 మంది గ్యాస్ సబ్సిడీని వదులుకునేలా దరఖాస్తులు సేకరించాలని మౌఖిక ఆదేశాలు గ్యాస్ డీలర్లకు అందాయి. టార్గెట్ విధించి సబ్సిడీ దరఖాస్తులు పూర్తి చేయించాలని ఆదేశించడంలో డీలర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారుల అనాసక్తి వినియోగదారులు మాత్రం గాస్ సబ్సిడీ వదులుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రధానమంత్రి పేరుతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఏర్పాటుచేస్తున్న దరఖాస్తులను ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం సిలిండర్ ఒక్కింటికీ రూ.700 వసూలు చేస్తుండగా, అందులో రూ.200 సబ్సిడీని వినియోగదారుడి ఖాతాకు జమ చేస్తున్నారు. దీనిద్వారా ప్రభుత్వంపై సబ్సిడీ భారం పడుతోంది. గృహ అవసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్ భారం తడిసి మోపెడవటంతో కేంద్రప్రభుత్వం రానున్న కొద్దినెలల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేసి సబ్సిడీని ఎత్తివేసే కార్యక్రమం అమలు చేయనుంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం చట్టం చేయకుండా గ్యాస్ సబ్సిడీని రద్దు చేయటానికి పన్నాగం పన్నుతోందని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. -
రూ.250 కోట్లువిద్యుత్ బకాయిలు
హన్మకొండ సిటీ : జిల్లాలో విద్యుత్ బిల్లుల బకాయిలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బకాయిల వసూళ్లకు ఎన్పీడీసీఎల్ అధికారులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించినా పూర్తి స్థాయిలో వసూలు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా గృహ అవసరాల నుంచి మొదలు పరిశ్రమలు, ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, గ్రామీణ, నగర, పట్టణ నీటిసరఫరా, వాణిజ్య, వ్యాపార సంస్థలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం రూ.249.58 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. వీటిలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినవే రూ.84 కోట్ల ఉన్నాయి. నోటీసులు ఇచ్చినా బకాయిలు వసూలు కాకపోవడంతో అధికారులు విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తున్నారు. దీంతో ముఖ్యంగా గ్రామపంచాయతీల పరిధిలో నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ విషయం వివాదాస్పదంగా మారడంతో పంచాయతీల తాగునీటి పంపుసెట్ల కనెక్షన్లు తొలగించొద్దని కలెక్టర్ అదేశించడంతో వాటిని పునరుద్ధరించారు. గ్రామపంచాయతీలకు చెందిన విద్యుత్ బిల్లులు గతంలో ప్రభుత్వమే నేరుగా చెల్లించేది. ప్రస్తుతం సర్కారు నుంచి చెల్లింపులు లేకపోవడంతో వీధిలైట్లు, తాగునీటి సరఫరాకు వినియోగిస్తున్న విద్యుత్ బిల్లులను గ్రామ పంచాయతీల నుంచే నేరుగా చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో వీధి లైట్లకు సంబంధించి రూ.10.93 కోట్లు, తాగు నీటి పథకాలకు రూ.7.90 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. చిన్న పంచాయతీల్లో వీధిల్లైట్లకు రూ.17.55 కోట్లు, వాటర్ వర్క్సకు రూ.28.72 కోట్లు, కార్పొరేషన్ పరిధిలో వీధిలైట్లకు రూ.3.10 కోట్లు, తాగునీటి పథకాలకు రూ.1.18 కోట్లు, మునిసిపాలిటీల్లో వీధిలైట్లకు రూ.75 లక్షలు, వాటర్వర్సకు రూ. 1.32 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్కు అన్ని శాఖలు కలిపి రూ.249.58 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ ఆదాయం క్రమేణా తగ్గుతోంది. వ్యవసాయ బకాయిలు రూ.23 కోట్లు వ్యవసాయానికి ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్‌కు ఎన్పీడీసీఎల్ కస్టమర్ చార్జీల కింది ఒక పంపుసెట్‌కు నెలకు రూ.30 చొప్పున వడ్డిస్తోంది. వీటిని ప్రతి ఏటా రెండు దఫాలుగా వసూలు చేస్తోంది. ఇవి బకాయి పడడంతో రూ.23 కోట్లు పేరుకుపోయాయి. జిల్లాలో మొత్తం 2,79.000 వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల గృహాలకు అందిస్తున్న ఉచి త విద్యుత్‌కు చెందిన పెండింగ్ రూ.68 కోట్లు ఉంది. విద్యుత్ బిల్లుల వసూలుకు చర్యలు విద్యుత్ బిల్లుల వసూళ్లకు చర్యలు తీసుకొంటున్నాం. ఇందుకోసం ముందస్తుగా నోటీసులు జారీ చేయడతోపాటు బిల్లులు చెల్లించేలా అవగాహన కల్పిస్తున్నాం. వినియోగదారులు బకాయిలు చెల్లించి సహకరించాలి. - ఎస్ఈ మోహన్‌రావు -
ఫ్లెక్సీల వినియోగంపై చట్టంలో నిషేధం లేదు
హోర్డింగ్‌ల ఏర్పాటుపై హైకోర్టుకు జీహెచ్ఎంసీ కమిషనర్ నివేదన జంట నగరాల్లో బ్యానర్ల ఏర్పాటుకు అనుమతులివ్వడం లేదు అనుమతులు లేని హోర్డింగ్‌ల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్‌లు కౌంటర్ దాఖలు చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ సాక్షి, హైదరాబాద్: హోర్డింగ్‌ల ఏర్పాటుకు పీవీసీ, ఫ్లెక్సీ మెటీరియల్స్‌ను ఉపయోగించకుండా నిషేధం విధించే నిబంధనలేవీ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టంలో లేవని ఆ సంస్థ కమిషనర్ సోమేష్‌కుమార్ హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో బ్యానర్లు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం నిషేధం విధించడంతో, జంట నగరాల్లో బ్యానర్ల ఏర్పాటుకు సంబంధించి తాము ఎలాంటి అనుమతులు మంజూరు చేయడం లేదని ఆయన వివరించారు. ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేస్తున్న బ్యానర్లు, ఫ్లెక్సీలను ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్‌ల ద్వారా తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు, పోస్టర్లు, సైన్‌బోర్డులు, కటౌట్ల వినియోగంతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోందని, వీటిపై నిషేధం విధించేలా ఆదేశాలలివ్వాంటూ హెదరాబాద్కు చెందిన ట్రస్ట్ ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షురాలు బి.శ్రీలత గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇటీవల విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ప్రతివాదులుగా ఉన్న అధికారులకు, పలు రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసి, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీలోని సెక్షన్ 420 ప్రకారం ఎవరైనా కూడా సైన్‌బోర్డులు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాల్సిందేనని సోమేష్ కుమార్ కోర్టుకు నివేదించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 సర్కిళ్లలో దాదాపు 2425 హోర్డింగ్‌ల ఏర్పాటుకు అనుమతులిచ్చినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా 740 హోర్డింగ్‌లను గుర్తించామని, వాటిని ఇప్పటికే 626 హోర్డింగ్‌లను తొలగించామన్నారు. మిగిలిన వాటి తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు. 2013-14లో ఎలాంటి అనుమతులు లేకుండా 141 హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారని, వీటిలో ఈ నెల 10 వరకు 48 హోర్డింగ్‌లు తొలగించామని, మిగిలిన వాటిని తొలగిస్తూ ఉన్నామని ఆయన తన కౌంటర్లో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే హోర్డింగ్‌లను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నామని, హోర్డింగ్‌ల ఏర్పాటునకు ఫ్లెక్సీ, పీవీసీ మెటీరియల్స్ వాటకూడదని జీహెచ్ఎంసీ చట్టంలో ఎక్కడా ఎటువంటి నిషేధం లేదని ఆయన కోర్టుకు నివేదించారు.