సాక్షి, హైదరాబాద్: అత్యంత తీవ్రమైన ఉల్లంఘనగా భావించే మైనర్ డ్రైవింగ్‌పై నగర ట్రాఫిక్ విభాగం అధికారులు నెల రోజులుగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఎవరైనా చిక్కితే జరిమానాతో సరిపెట్టడం లేదు. వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రైవర్లుగా ఉన్న మైనర్లు, వీరికి వాహనాలిచ్చిన తల్లిదండ్రులు, యజమానులపై కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేస్తున్నారు. ఇలా గత నెల రోజుల కాలంలో 1,079 చార్జిషీట్లు దాఖలు చేయగా... మొత్తం 55 మంది తండ్రులకు ఒకటి నుంచి రెండు రోజులు జైలు శిక్ష పడింది. గురువారం ఒక్కరోజే నాంపల్లిలోని 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కె.అల్తాఫ్ హుస్సేన్ 10 మందికి ఒకరోజు చొప్పున జైలు శిక్ష విధించారు. బుధవారం టోలిచౌకి పరిధికి చెందిన ఓ మైనర్‌కు ఒక రోజు శిక్ష పడటంతో జువెనైల్ హోమ్‌కు తరలించారు.
మైనర్ డ్రైవింగ్‌పై తొలిసారిగా బాలుడికి శిక్ష
గత కొన్నాళ్లుగా వాహనం ఇచ్చిన నేరంపై తండ్రులకు ఒకటి నుంచి రెండు రోజుల వరకు జైలు శిక్షలు పడుతున్నా... ఇలా మైనర్ డ్రైవింగ్ కేసులో బాలుడిని జువెనైల్ హోమ్‌కు తరలించడం ఇదే తొలిసారి అని డీసీపీ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని ప్రధానంగా మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పుగా మారేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పును తెచ్చిపెట్టేవి. మైనర్ డ్రైవింగ్ మూడో కేటగిరీ కిందికి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు.
భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం (ఎంవీ యాక్ట్) పదహారేళ్ల లోపు వయసున్న వారు ఎలాంటి వాహనాలనూ నడపకూడదు. 16 ఏళ్లు నిండిన వారు మాత్రం కేవలం గేర్లు లేని సాధారణ వాహనాలు నడిపే అవకాశం ఉంటుంది. పద్దెనిమిదేళ్లు నిండిన తరవాత మాత్రమే గేర్స్‌తో కూడిన వాహనాలు నడపడానికి అర్హులు. చట్ట ప్రకారం మైనర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చిన యజమాని సైతం శిక్షార్హుడే. ఇప్పటి వరకు మైనర్ డ్రైవింగ్ కేసుల్లో అత్యంత అరుదుగా మాత్రమే... అదీ వాహనం నడిపే వ్యక్తిపై చార్జిషీట్ దాఖలు చేసేవారు. మోటారు వాహనాల చట్టంలోని 180 సెక్షన్ ప్రకారం ఓ మైనర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే... అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమానికీ జరిమానా విధించే అవకాశం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటున్న ట్రాఫిక్ పోలీసులు గత నెల రోజుల్లో అనేక మంది ‘వాహన యజమానుల’పై చార్జిషీట్స్ దాఖలు చేశారు. వీరంతా ఆయా మైనర్ల తండ్రులే కావడం గమనార్హం.
55 మంది‘తండ్రులకు’ జైలు
Published Fri, Mar 2 2018 2:55 AM | Last Updated on Fri, Mar 2 2018 3:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment