సంగారెడ్డి టౌన్‌లో బైక్‌పై వెళ్తున్న మైనర్లు
పటాన్‌చెరు టౌన్: తల్లిదండ్రులకు పిల్లలే సర్వస్వం. వారిపై అతి ప్రేమతో బైక్‌లు, కార్ల ఇస్తున్నారు. వాటిని నడుపుతుంటూ అది చూసి సంబరపడుతున్నారు. అయితే కంటికి రెప్పలా పిల్లలను కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే వాహనాలు ఇచ్చి వారిని ప్రమాదాలల్లోకి నెడుతున్నారు. పట్టణ, మండల ప్రాంతాల్లో 4, 5 ప్రమాదాల్లో ఒకటి మైనర్ల డ్రైవింగ్ వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు సమచారం.
● ప్రస్తుతం పిల్లలు వాహనాలు నడిపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు వద్దని చెప్తున్న వారి మాట వినకుండా ద్విచక్ర వాహనాలను తీసుకొని రహదారుల పైకి వస్తున్నారు.
● మరికొందరు స్వయంగా తమ పిల్లలకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తో పోల్చుకుంటే, పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ కేసులను ఎక్కువగా నమోదయ్యాయి.
● సైకిల్ నడపాల్సిన వయస్సులో పిల్లలు ద్విచక్ర వాహనాలపై స్కూళ్లకు, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి దుకాణాల్లో సరుకులు తేవాలని పంపుతున్నారు. మరికొందరి తమ పిల్లలు వాహనం నడుపుతున్నారని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇలా ఇవ్వడం తప్పని తెలిసే తప్పు చేస్తున్నారు.
జిల్లాలో మైనర్ డ్రైవింగ్ వివరాలు...
జిల్లాలోని సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 12 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో రూ.6 వేలు జరిమానా విధించారు.
పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది 313 మైనర్ డ్రైవింగ్ కేసులకు రూ.1,56,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
వాహనాలు నడపాలంటే 18 సంవత్సరాల పైబడి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. గంటకు 25 కిలోమీటర్ కంటే వేగంగా వెళ్లలేని వాహనాలకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 26 కిలో మీటర్ల కంటే ఒక్క కిలోమీటర్ వేగంగా వెళ్లినా ఎలక్ట్రిక్ వాహనాలైనా రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
– రాజా మహమ్మద్, ఎంవీఐ
తల్లిదండ్రులే బాధ్యత వహించాలి
మైనర్లు వాహనాలు నడపరాదు. మొదటిసారి తనిఖీల్లో పట్టుబడితే వారికి జరిమానా విధించడంతో పాటు అవగాహన కల్పిస్తున్నాం. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చే వారు ప్రమాదంబారినపడే విధంగా ప్రోత్సహించడం సరికాదు. వాహనం ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించాలి.
– ప్రవీణ్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ
Comments
Please login to add a commentAdd a comment