బాలాపూర్ ఆరోగ్యకేంద్రంలో టీకా కోసం క్యూ
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): గ్రేటర్‌లో కోవిడ్ టీకాలు కోటికి చేరువయ్యాయి. అంచనాకు మించి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కేవలం స్థానికులే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు, వలస కూలీలు, వ్యాపారులు కూడా ఇక్కడే టీకాలు వేయించుకుంటున్నారు. ఫలితంగా గ్రేటర్ జనాభా కంటే ఎక్కువ టీకాలు వేయడం గమనార్హం. గ్రేటర్‌లో 1.20 కోట్ల జనాభా ఉన్నట్లు అంచనా. వీరిలో ఐదేళ్లలోపు వారే సుమారు పది లక్షల మంది ఉంటారు. 6 నుంచి 18 ఏళ్ల లోపు వారు మరో 20 లక్షల వరకు ఉంటారు. అయితే గ్రేటర్ జిల్లాల్లో ఇప్పటికే అంచనాలకు మించి టీకాలు వేయడం గమనార్హం.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 93,92,811 మంది కోవిడ్ టీకాలు వేసుకున్నారు. వీరిలో 51,43,186 మంది పురుషులు కాగా, 42,48,032 మంది మహిళలు ఉన్నారు. వీరితో పాటు 1593 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 27,43,266 మంది ఇప్పటికే రెండు డోసులు పూర్తి చేసుకోగా, మరో 66,49,545 మంది మొదటి డోసును పూర్తి చేసుకుని రెండో డోసు కోసం ఎదురుచూస్తున్నారు. ఏ సెంటర్‌లో ఏ వ్యాక్సిన్ వేస్తున్నారో తెలియక లబ్ధిదారులు సమీపంలోని ఆరోగ్య కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
లక్షణాలు ఒకటే..టెస్టులు రెండు..
► టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో ప్రస్తుతం నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
► వందమందిలో ఒకరిద్దరికి పాజిటివ్ నిర్ధారణ అవుతున్నప్పటికీ వైరస్ తీవ్రత గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు.
► పాజిటివ్ నిర్ధారణ అయిన వారు కూడా చాలా వరకు హోం ఐసోలేషన్‌లోనే కోలుకుంటున్నారు.
► గత ఏడాదితో పోలిస్తే ఈసారి డెంగీ కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 600పైగా కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 200పైగా, మేడ్చల్ జిల్లాలో 180పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి.
► కరోనా, డెంగీ లక్షణాల్లో జ్వరం కామన్ సింప్టమ్‌గా ఉండటంతో ఆయా బాధితులు ఆందోళన చెందుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఆయా టెస్టింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
► ఫలితంగా ఇటీవల కోవిడ్ టెస్టింగ్ కేంద్రాలు జ్వరపీడితులతో రద్దీగా మారుతున్నాయి. కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారు
డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు.
లక్ష్యానికి మించి టీకాలు
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 1039188 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వీరిలో 1,09,932 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 253 మంది మినహా మిగిలిన వారంతా కోలుకున్నారు. తాజాగా శనివారం 1858 నమూనాలను పరీక్షిస్తే...వీటిలో 25 పాజిటివ్ నిర్ధారణ అయ్యయి. జిల్లాలో కోవిడ్ టీకాల కార్యక్రమం లక్ష్యానికి మించి కొనసాగుతోంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల వారికి కూడా ఇక్కడ టీకాలు వేస్తున్నాం. జిల్లాలో 22 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేయగా, ఇప్పటి వరకు 26 లక్షల మందికిపైగా టీకాలు వేశాం.
– డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, రంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment