టీకా.. ఆపై సిరా | Corona Virus Vaccine Injection After An Ink Drop Will Applied To Left Thumb | Sakshi
Sakshi News home page

టీకా.. ఆపై సిరా

Published Sat, Jan 16 2021 2:59 AM | Last Updated on Sat, Jan 16 2021 12:13 PM

Corona Virus Vaccine Injection After An Ink Drop Will Applied To Left Thumb - Sakshi

కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. టీకాపై ప్రజల ఆందోళనలను తొలగించేందుకు స్వయంగా నేను వ్యాక్సిన్‌ వేసుకుంటా. రాష్ట్రం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు అందరూ సహకరించాలి. వ్యాక్సిన్‌ మానవ కల్యాణం కోసమే.
– వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఈటల రాజేందర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్నాక ఎడమ చేతి బొటన వేలికి సిరా చుక్క వేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీకా వేసుకున్న వారికి గుర్తుగా ఎన్నికల్లో ఉపయోగించే సిరానే ఎడమ చేతి బొటన వేలిపై వేస్తామని తెలిపారు. నిమ్స్‌లో శనివారం ఉదయం 11:30 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తారన్నారు. అలాగే గాంధీ ఆసుపత్రిలో మంత్రి ఈటల రాజేందర్, తిలక్‌నగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ సైతం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని శ్రీనివాసరావు చెప్పారు.

సోమవారం 200–300 సెంటర్లలో టీకా ప్రక్రియ మొదలవుతుందన్నారు. వచ్చే గురు, శుక్రవారాల నాటికి 500–600 కేంద్రాల్లో టీకాలు వేస్తామన్నారు. మొత్తంగా 1,213 కేంద్రాల్లో కరోనా టీకాలు వేస్తామని, 100 మందికిపైగా సిబ్బంది ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ త్వరలో టీకా కార్యక్రమం ఉంటుందన్నారు. అంతకంటే తక్కువ ఉన్న క్లినిక్‌ల సిబ్బందికి సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాల్లో వేస్తామన్నారు. 10 నెలలపాటు కరోనాపై పోరా డిన ఆరోగ్య కార్యకర్తలకు ముందుగా టీకా వేసు ్తన్నామని, తద్వారా ప్రజల్లోనూ వ్యాక్సిన్‌పై నమ్మకం ఏర్పడుతుందన్నారు. కరోనా వ్యాక్సిన్లు వేసుకొని చనిపోయినవారు లేరని, అత్యంత సురక్షితమని  తెలిపారు. 

టీకా ప్రక్రియ ఇలా...

  • నిమ్స్‌లో శనివారం ఉదయం 11:30 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సమక్షంలో మొదలుకానున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.
  • ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున 140 కేంద్రాల్లో 4,200 మందికి తొలి రోజు వ్యాక్సిన్‌.
  • వ్యాక్సినేషన్‌లో పాల్గొననున్న 50 వేల మంది సిబ్బంది. వ్యాక్సిన్‌ వేసేందుకు 10 వేల మంది వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ.
  • బుధ, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో టీకా వేయరు.
  • వారంలో 4 రోజులే.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు.
  • అంగీకారపత్రం ఉంటేనే భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకా వేస్తామన్న ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు
  • ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవిషీల్డ్‌ టీకాకు ఎలాంటి అంగీకారపత్రం అవసరంలేదని స్పష్టీకరణ.
  • టీకా వేసుకున్నాక సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చినా ప్రమాదం ఏం ఉండదన్న వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి.
  • ఒకట్రెండు రోజులు పారాసిటమాల్‌ మాత్రలు వేసుకోవడం సహా సంబంధిత సైడ్‌ ఎఫెక్ట్స్‌కు వైద్యం చేస్తే సరిపోతుందని వెల్లడి.

అంగీకారపత్రం ఉంటేనే కోవాగ్జిన్‌ టీకా... 
అంగీకారపత్రం ఉంటేనే భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకా వేస్తారని డాక్టర్‌ శ్రీనివాసరావు మరోసారి స్పష్టం చేశారు. ఆ వ్యాక్సిన్‌ వేసుకున్నాక 7 రోజులపాటు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉండాలని కేంద్రం స్పష్టం చేసిందన్నారు.  కోవిషీల్డ్‌ టీకాకు ఎలాంటి అంగీకారపత్రం అవసరంలేదన్నా రు. అయితే ప్రతి వ్యాక్సిన్‌ సురక్షితమేనన్నారు. అన్ని వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇచ్చారన్నారు. తెలంగాణలో తయా రయ్యే కోవాగ్జిన్‌ టీకా ను తాను కూడా వేసుకుంటానన్నారు. 

లక్షలో ఒకరికి సీరియస్‌ రియాక్షన్‌... 
కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న లక్షల్లో ఒకరికి తీవ్ర రియాక్షన్‌ వచ్చే అవకాశం ఉందని వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఒకట్రెండు రోజులు పారాసిటమాల్‌ మాత్రలు వేసుకోవడం సహా సంబంధిత సైడ్‌ ఎఫెక్ట్స్‌కు వైద్యం చేస్తే సరిపోతుందన్నారు. టీకా రెండో డోసు వేసుకున్నాక మొదటిసారి కంటే ఎక్కువగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉందని, అయితే ఇది సహజమన్నారు. టీకాకేంద్రాల వద్ద అవసరమైన వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్నాక యాంటీబాడీలు వృద్ధి చెందుతాయన్నారు.

టీ–సెల్స్‌ యాక్టివేట్‌ అవుతాయన్నారు. దీంతో కరోనా వైరస్‌ సైకిల్‌ను బ్రేక్‌ చేయవచ్చన్నారు. టీకా వేసుకున్నాక ఒకవేళ వైరస్‌ ప్రవేశించినా దాని తీవ్రత అంతగా ఉండదన్నారు. 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌ వేయడం లేదని డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు. అలాగే పాలిచ్చే తల్లులకు, గతంలో మందుల వాడకం వల్ల రియాక్షన్లు వచ్చిన వారితోపాటు రక్తం గడ్డకట్టని పరిస్థితి ఉండే వారికి కూడా టీకా ఇవ్వబోమన్నారు. టీకా కోసం వచ్చే లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని, ఇతరత్రా వివరాలు అడిగి తెలుసుకున్నాకే టీకా ఇస్తామని వెల్లడించారు. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులన్నా టీకా వేస్తామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement