డాక్టర్‌ ఉంటారు.. పేరెంట్స్‌ ఉండాలి | Telangana: Covid 19 Vaccination Program Starts Teenage 15 To 18 Age | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ ఉంటారు.. పేరెంట్స్‌ ఉండాలి

Published Mon, Jan 3 2022 3:58 AM | Last Updated on Mon, Jan 3 2022 8:47 AM

Telangana: Covid 19 Vaccination Program Starts Teenage 15 To 18 Age - Sakshi

సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టీకాల పంపిణీ మార్గదర్శకాలను విడుదల చేసింది. తల్లిదండ్రుల సమక్షంలోనే టీనేజర్లకు టీకాలు వేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అలాగే ఈ నెల 10 నుంచి హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు (ఎన్నికల విధుల్లో ఉన్నవారితో సహా), 60 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రికాషనరీ డోస్‌ (మూడో డోస్‌) టీకా వేస్తామని తెలిపింది.

అయితే ఈ గ్రూప్‌లోని వారికి ఏ టీకా వేయాలన్న దానిపై త్వరలో తెలియజేస్తామని వివరించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ఆదివారం మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. 15–18 ఏళ్ల వయసు టీనేజర్లకు కోవాగ్జిన్‌ టీకా మాత్రమే ఇస్తామని పేర్కొన్న ప్రభుత్వం... ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా వేస్తారా? లేదా? ఒకవేళ వేస్తే ఎంత ధర ఉంటుందన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. దేశంలో దాదాపు 10 కోట్ల మంది 15–18 ఏళ్ల మధ్య ఉన్న యువత వ్యాక్సినేషన్‌ తీసుకొనేందుకు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ అంచనా వేసింది. మరోవైపు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఆదివారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాలు ఇవీ...
► 2007 సంవత్సరం లేదా అంతకుముందు పుట్టిన టీనేజర్లు టీకాకు అర్హులు.
► వారందరికీ పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ వేస్తారు.
►వ్యాక్సిన్‌ కేంద్రం వద్ద ఒక ప్రత్యేక సెషన్‌ నిర్వహిస్తారు. అక్కడ ప్రత్యేకంగా సైట్‌లు, క్యూలతోపాటు వ్యాక్సినేటర్లు ఉంటారు.
► రాష్ట్రంలో 15–18 ఏళ్ల వయసు వారికి కోవాగ్జిన్‌ టీకానే వేస్తారు. వారు 22,78,683 మంది ఉంటారని అంచనా.
►ప్రతి మోతాదులో ఒక్కొక్కరికీ పెద్దలకు ఇచ్చిన తరహాలోనే 0.5 ఎంఎల్‌ ఇస్తారు.

రెండో డోసు తీసుకొని 9 నెలలు దాటితేనే బూస్టర్‌...
​​​​​​​► హెల్త్‌కేర్‌ వర్కర్లకు గతేడాది జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. వారు అప్పట్లో రెండో డోస్‌ తక్షణమే తీసుకుంటే 2021 ఫిబ్రవరి మూడు లేదా చివరి చివరి వారంలో వేసుకొని ఉండొచ్చు. ఫిబ్రవరి 2021లో రెండో డోస్‌ తీసుకున్న హెల్త్‌కేర్‌ వర్కర్లు ఇప్పుడు ప్రికాషినరీ (బూస్టర్‌) డోస్‌కు అర్హత సాధించారు.
​​​​​​​► ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు గతేడాది ఫిబ్రవరి 5 మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ మొదలవగా రెండో డోస్‌ అదే ఏడాది మార్చి మూడు లేదా చివరి వారంలో ప్రారంభమైంది. అప్పుడు మార్చిలో రెండో డోస్‌ తీసుకున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు ప్రస్తుతం జనవరిలో ప్రికాషినరీ (బూస్టర్‌) డోస్‌ తీసుకొనేందుకు అర్హత సాధిస్తారు.
​​​​​​​► ప్రికాషినరీ డోస్‌ వ్యాక్సిన్‌కు అర్హులైన లబ్ధిదారుల జాబితా కోవిన్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంది.
​​​​​​​►ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, హెల్త్‌కేర్‌ వర్కర్లు ఏ టీకా, ఎంత మోతాదులో వేసుకోవాలన్న విషయంపై త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది.

60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు...
​​​​​​​► 60 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గతేడాది మార్చి ఒకటో తేదీన మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ను ప్రారంభించారు. వారు రెండో డోస్‌ అదే ఏడాది ఏప్రిల్‌ మూడు లేదా చివరి వారంలో తీసుకొని ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రికాషనరీ టీకాకు అర్హుత సాధిస్తారు.
​​​​​​​►లబ్ధిదారుల సుముఖతతోపాటు వైద్యులతో తగు సంప్రదింపుల తర్వాత ప్రికాషనరీ డోస్‌ మోతాదు ఇస్తారు. వారికి పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల్లో టీకా వేస్తారు.
​​​​​​​► ఎంత మోతాదులో, ఏ టీకా వేసేదీ త్వరలో తెలియజేస్తారు. 
​​​​​​​► దీర్ఘకాలిక జబ్బులున్న 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్యను కేంద్రం తెలియజేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం 60 ఏళ్లు దాటి మొదటి, రెండో డోస్‌ వేసుకున్న వారిలో దీర్ఘకాలిక జబ్బులున్నవారు దాదాపు 20 శాతం ఉండొచ్చని అంచనా. 

వైద్యుల పర్యవేక్షణలో..
►  టీనేజర్లకు టీకా ఇచ్చే సమయంలో డాక్టర్‌ అక్కడే ఉంటారు. తల్లిదండ్రుల సమక్షంలోనే టీకా వేస్తారు.
►  వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత 30 నిమిషాలు టీకా కేంద్రంలోనే వేచి ఉండాలి. ఏదైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయా లేదా అని వైద్యులు పర్యవేక్షిస్తారు.
►  మొదటి డోస్‌ తర్వాత తిరిగి 28 రోజుల అనంతరం రెండో డోస్‌ టీకా వేస్తారు.

గ్రేటర్‌లో ఆన్‌లైన్‌..   
►జీహెచ్‌ఎంసీ, 12 మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే టీకాలు ఇస్తారు. మిగిలిన జిల్లాలకు చెందిన పిల్లలు నేరుగా వ్యాక్సిన్‌ కేంద్రానికి వెళ్లి టీకా పొందొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement