సాక్షి, హైదరాబాద్: వ్యాక్సిన్లు, మందులు, ఇంజెక్షన్ల గురించి మాట్లాడుతూనే, మరోవైపు అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు, శ్మశానవాటికల గురించి కూడా చర్చించుకోవాల్సిన దుస్థితికి కరోనా నెట్టివేసింది. నగరంలో కరోనా కేసులతోపాటు మరణాలూ పెరుగుతున్నాయి. అంత్యక్రియల కోసం మృతుల సంబంధీకులు శ్మశానవాటికల వద్ద గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. మరోవైపు శ్మశానవాటికల్లో కరోనా మృతుల అంత్యక్రియలకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో కరోనా మృతదేహాల అంత్యక్రియలకు కట్టెల కంటే విద్యుత్ లేదా గ్యాస్ ఆధారిత దహనవాటికలైతే మంచిదని జీహెచ్‌ఎంసీ అధికారులు భావించారు. ఈ మేరకు గ్యాస్ ఆధారిత దహనవాటికలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత సంవత్సరం కరోనా తీవ్రత పెరిగినప్పుడే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వినియోగిస్తున్న గ్యాస్ ఆధారిత తరహా దహనవాటికల్ని అందుబాటులోకి తేవాలనుకున్నారు. కాకపోతే అనివార్య కారణాల వల్ల జాప్యం చోటు చేసుకుంది. ఢిల్లీ, ఇంకా పలు ఉత్తరాది నగరాల్లో వినియోగిస్తున్న గ్యాస్ దహనవాటికలను పరిశీలించి వాటిని పర్యావరణకు అనువైనవిగా భావించి ఐదు మెషీన్లు తెప్పించారు.
అదే విధంగా వాటి నిర్వహణ నిమిత్తం టెండర్లు పిలిచారు. టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ఈ వారంలో వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో విద్యుత్ దహనవాటికకు దాదాపు రూ.45 లక్షలు కాగా, షెడ్డు, ఇన్‌స్టలేషన్ తదితరమైనవి వెరసి దాదాపు రూ.90 లక్షలు వ్యయమైంది. ఒక్కో మృతదేహం దహనం కావడానికి 80– 90 నిమిషాలు పడుతుంది. పటాన్‌చెరు, దేవునికుంట(నాంపల్లి), ఎస్‌పీనగర్(మల్కాజిగిరి), సంతోష్‌నగర్‌లలో వీటిని వినియోగంలోకి తేనున్నారు. హయత్‌నగర్‌లో కూడా ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ, కొన్ని కారణాలతో నిలిచిపోయింది.
చదవండి: ఒక్కో శవానికి రూ. 25 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లింపు!
Comments
Please login to add a commentAdd a comment