- హోర్డింగ్‌ల ఏర్పాటుపై హైకోర్టుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ నివేదన
- జంట నగరాల్లో బ్యానర్ల ఏర్పాటుకు అనుమతులివ్వడం లేదు
- అనుమతులు లేని హోర్డింగ్‌ల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్‌లు
- కౌంటర్ దాఖలు చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్
సాక్షి, హైదరాబాద్: హోర్డింగ్‌ల ఏర్పాటుకు పీవీసీ, ఫ్లెక్సీ మెటీరియల్స్‌ను ఉపయోగించకుండా నిషేధం విధించే నిబంధనలేవీ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) చట్టంలో లేవని ఆ సంస్థ కమిషనర్ సోమేష్‌కుమార్ హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో బ్యానర్లు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం నిషేధం విధించడంతో, జంట నగరాల్లో బ్యానర్ల ఏర్పాటుకు సంబంధించి తాము ఎలాంటి అనుమతులు మంజూరు చేయడం లేదని ఆయన వివరించారు.
ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేస్తున్న బ్యానర్లు, ఫ్లెక్సీలను ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్‌ల ద్వారా తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు, పోస్టర్లు, సైన్‌బోర్డులు, కటౌట్‌ల వినియోగంతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోందని, వీటిపై నిషేధం విధించేలా ఆదేశాలలివ్వాంటూ హెదరాబాద్‌కు చెందిన ట్రస్ట్ ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షురాలు బి.శ్రీలత గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇటీవల విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ప్రతివాదులుగా ఉన్న అధికారులకు, పలు రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసి, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. జీహెచ్‌ఎంసీలోని సెక్షన్ 420 ప్రకారం ఎవరైనా కూడా సైన్‌బోర్డులు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాల్సిందేనని సోమేష్ కుమార్ కోర్టుకు నివేదించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 సర్కిళ్లలో దాదాపు 2425 హోర్డింగ్‌ల ఏర్పాటుకు అనుమతులిచ్చినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా 740 హోర్డింగ్‌లను గుర్తించామని, వాటిని ఇప్పటికే 626 హోర్డింగ్‌లను తొలగించామన్నారు. మిగిలిన వాటి తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు.
2013-14లో ఎలాంటి అనుమతులు లేకుండా 141 హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారని, వీటిలో ఈ నెల 10 వరకు 48 హోర్డింగ్‌లు తొలగించామని, మిగిలిన వాటిని తొలగిస్తూ ఉన్నామని ఆయన తన కౌంటర్‌లో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే హోర్డింగ్‌లను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నామని, హోర్డింగ్‌ల ఏర్పాటునకు ఫ్లెక్సీ, పీవీసీ మెటీరియల్స్ వాటకూడదని జీహెచ్‌ఎంసీ చట్టంలో ఎక్కడా ఎటువంటి నిషేధం లేదని ఆయన కోర్టుకు నివేదించారు.