రూ.250 కోట్లువిద్యుత్ బకాయిలు
హన్మకొండ సిటీ : జిల్లాలో విద్యుత్ బిల్లుల బకాయిలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బకాయిల వసూళ్లకు ఎన్పీడీసీఎల్ అధికారులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించినా పూర్తి స్థాయిలో వసూలు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా గృహ అవసరాల నుంచి మొదలు పరిశ్రమలు, ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, గ్రామీణ, నగర, పట్టణ నీటిసరఫరా, వాణిజ్య, వ్యాపార సంస్థలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం రూ.249.58 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. వీటిలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినవే రూ.84 కోట్ల ఉన్నాయి.
నోటీసులు ఇచ్చినా బకాయిలు వసూలు కాకపోవడంతో అధికారులు విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తున్నారు. దీంతో ముఖ్యంగా గ్రామపంచాయతీల పరిధిలో నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ విషయం వివాదాస్పదంగా మారడంతో పంచాయతీల తాగునీటి పంపుసెట్ల కనెక్షన్లు తొలగించొద్దని కలెక్టర్ అదేశించడంతో వాటిని పునరుద్ధరించారు.
గ్రామపంచాయతీలకు చెందిన విద్యుత్ బిల్లులు గతంలో ప్రభుత్వమే నేరుగా చెల్లించేది. ప్రస్తుతం సర్కారు నుంచి చెల్లింపులు లేకపోవడంతో వీధిలైట్లు, తాగునీటి సరఫరాకు వినియోగిస్తున్న విద్యుత్ బిల్లులను గ్రామ పంచాయతీల నుంచే నేరుగా చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో వీధి లైట్లకు సంబంధించి రూ.10.93 కోట్లు, తాగు నీటి పథకాలకు రూ.7.90 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
చిన్న పంచాయతీల్లో వీధిల్లైట్లకు రూ.17.55 కోట్లు, వాటర్ వర్‌క్సకు రూ.28.72 కోట్లు, కార్పొరేషన్ పరిధిలో వీధిలైట్లకు రూ.3.10 కోట్లు, తాగునీటి పథకాలకు రూ.1.18 కోట్లు, మునిసిపాలిటీల్లో వీధిలైట్లకు రూ.75 లక్షలు, వాటర్‌వర్‌సకు రూ. 1.32 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్‌కు అన్ని శాఖలు కలిపి రూ.249.58 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ ఆదాయం క్రమేణా తగ్గుతోంది.
వ్యవసాయ బకాయిలు రూ.23 కోట్లు
వ్యవసాయానికి ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్‌కు ఎన్పీడీసీఎల్ కస్టమర్ చార్జీల కింది ఒక పంపుసెట్‌కు నెలకు రూ.30 చొప్పున వడ్డిస్తోంది. వీటిని ప్రతి ఏటా రెండు దఫాలుగా వసూలు చేస్తోంది. ఇవి బకాయి పడడంతో రూ.23 కోట్లు పేరుకుపోయాయి. జిల్లాలో మొత్తం 2,79.000 వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల గృహాలకు అందిస్తున్న ఉచి త విద్యుత్‌కు చెందిన పెండింగ్ రూ.68 కోట్లు ఉంది.
విద్యుత్ బిల్లుల వసూలుకు చర్యలు
విద్యుత్ బిల్లుల వసూళ్లకు చర్యలు తీసుకొంటున్నాం. ఇందుకోసం ముందస్తుగా నోటీసులు జారీ చేయడతోపాటు బిల్లులు చెల్లించేలా అవగాహన కల్పిస్తున్నాం. వినియోగదారులు బకాయిలు చెల్లించి సహకరించాలి.
- ఎస్‌ఈ మోహన్‌రావు